ప్రధానిని కలిసి వినతిపత్రం సమర్పించిన బిసి నేతలు
హైదరాబాద్ : బిసిల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం నేతలు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో బిసి ప్రతినిధి బృందం గురువారం ప్రధాని నరేంద్ర మోడిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా బిసిల ప్రధాన డిమాండ్లను కృష్ణయ్య ప్రధానికి వివరించారు. దేశంలో 56 శాతం జనాభా ఉన్న బిసిలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమాన వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని, బిసిలకు న్యాయం చేయడానికి రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ ప్రకారం ప్రధానమంత్రి హోదాలో జోక్యం చేసుకోవాలని కోరారు. జాతీయ బిసి కార్పొరేషన్ ద్వారా బిసి కుల వృత్తులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని కోరారు. గత 75 సంవత్సరాలుగా బిసిలకు ఏ రంగంలో జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదని ప్రధానికి వివరించారు.
విద్యా,ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదన్నారు. ప్రజస్వామ్యంలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి, వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు. అప్పుడే దేశంలో సమైక్యత, సమగ్రత, శాంతి ఉంటుందన్నారు. బిసిలకు అసెంబ్లీ, – పార్లమ్మెటులో రిజర్వేషన్లు పెట్టకుండా అన్యాయం చేశారని, విమర్శించారు. 2021-22 లో సేకరించి బోయే జన గణనలో కులాల వారిగా బిసి జనగణన చేయాలని కోరారు. పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బిసి లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని. బిసి ఉద్యోగులకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బిసిల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతానికి పెంచాలని కోరారు. బిసిలకు విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్‌లపై ఉన్న క్రీమీ లేయర్‌ను తొలగించాలని కోరారు. బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బిసిల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని, బిసిలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బిసి యాక్టు తేవాలని వినతిపత్రంలో కోరారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సుప్రీం కోర్టు- హై కోర్టు జడ్జీల నియామకాలలో రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్నప్తి చేశారు. కేంద్ర బడ్జెటులో రెండు లక్షల కోట్లు బిసిలకు కేటాయించి కేంద్రంలో బిసిలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజు రియింబర్స్‌మెంట్ సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలన్నారు. రాష్ట్రాలు అమలు చేసే పధకాలకు 60 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు.
ప్రధాని నరేంద్ర మోడీ హామీ
బిసిల డిమాండ్లు న్యాయమైనవని, దశల వారీగా పరిష్కరిస్తామని ప్రధాని హామినిచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. అన్నీ రంగాలలో సమాన వాటా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయ్యిందని ఇంకా పూర్తి స్థాయి న్యాయం చేయడం కోసం చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రధానిని కలిసిన వారిలో బిసి నేతలు గుజ్జ కృష్ణ , లాల్ కృష్ణ, డా.మరేష్, డా.పద్మలత, రమేశ్ తదితరులు ఉన్నారు.