Monday, December 23, 2024

బిసిల తొలి కవితా సంకలనం

- Advertisement -
- Advertisement -

 

తెలంగాణలో ఆధునిక కవితా సంకలనాల ప్రారంభం ‘గోలకొండ కవుల సంచిక’తో 1934లో ప్రారంభమయింది. అనంతరం ఆంధ్రకేసరి గ్రంథమాల 1940 ఆ ప్రాంతంలో ‘స్రవంతి’ పేరిట ఒక కవితా సంకలనాన్ని వెలువరించింది. పోలీసుచర్య అనంతరం ‘ప్రత్యూష’, ‘ఉదయఘంటలు’ వెలువడ్డాయి. మూటుపూరు వెంకటేశ్వరరావు ‘తొలిసంజ’ పేరిట ఒక కవితా సంకలనాన్ని తీసుకొచ్చారు. వరంగల్ నుంచి వెలువడ్డ ‘తొలికారు’, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలో ‘విప్లవ ఢంకా’ పేరిట రుక్నుద్దీన్, జి.యాదగిరిలు కవితా సంకలనాన్ని వెలువరించారు. అట్లాగే దిగంబర కవులు కవితా సంకలనాలు, పెండ్యాల కిషన్ రావు సంపాదకత్వంలో వెలువడ్డ మార్చ్, ‘విరసం’ వెలువరించిన ఝంఝ, ‘లే’ కవితా సంకలనాలు ఉన్నాయి. అట్లాగే జనధర్మ పత్రిక ప్రత్యేక కవితా సంచికను వెలువరించింది. వీటికి కొనసాగింపుగా 1973 ఫిబ్రవరిలో సిరిసిల్లకు చెందిన యువసాహితీ సమితి ‘యువస్వరాలు’ పేరిట ఐదుగురి కవితా సంకలనాన్ని వెలువరించింది. బహుశా తెలుగు సాహిత్యంలో అందరు బీసి కవులతో వెలువడ్డ తొలి కవితా సంకలనమిది. సామాజికంగా బీసీలైనప్పటికీ కవిత్వంలో సామాన్య జనం వెతలు చిత్రితమయ్యాయి. ఆ తర్వాత జూలూరు గౌరీశంకర్ వెలువరించిన ‘వెనుకబడ్డ కులాలు వెంటాడే కలాలు’ రెండో కవితా సంకలనం. ఇప్పుడిక్కడ చర్చించుకుంటున్న కవితా సంకలనం వెలువడి దాదాపు 50 ఏండ్లవుతుంది. ఈ సందర్భంగా యాభై ఏండ్ల జ్ఞాపకాలను మరోసారి తాజా చేసుకుందాం!
ఈ సంకలనంలో కనపర్తి లక్ష్మీనర్సయ్య, వడ్డేపల్లి కృష్ణ, జక్కని వెంకట్రాజం, కుడిక్యాల లింగయ్య, గోలి కృష్ణహరిల కవిత్వమున్నది. ఈ కవితా సంకలనానికి ఇదే ప్రాంతానికి చెందిన సుప్రసిద్ధ కవి సి.నారాయణరెడ్డి ‘అవతారిక’ రాస్తూ “ఈ కవులందరూ అస్తమించని ఉదయాన్నీ, నిట్టూర్చని హృదయాన్నీ, ప్రేమించే వాళ్ళే. మనిషిలో మానవత కోసం, సమాజంలో అభినవత కోసం పరితపించిన వాళ్ళే. చైతన్యం కేతనంగా జాతి పురోగమించాలని ఆశించిన వాళ్ళే. ఈ మధ్య వెలువడుతున్న నవతరం కవుల్లో చెప్పుకోదగ్గ కంఠాలే ఈ అయుదుగురివి” అన్నాడు. అట్లాగే “ఏవేవో ఊహాగానాలతో ఈదులాడక, సమకాలీన సమాజంలోని దీప్త చైతన్యాన్ని గుర్తించి, దానికి తమ కలాలనూ, గళాలను శ్రుతిచేసి, పదునైన కవితలుగా తీర్చిదిద్ది, ఈ సంపుటి రూపంలో తెలుగు సాహితీ లోకానికి ఒకే స్వరంతో పరిచయమవుతున్నారు ఈ అయిదుగురు కవులు” అని ప్రశంసించాడు.
సిరిసిల్ల, వేములవాడ ప్రాంతం నుంచి నారాయణరెడ్డి, బాపురెడ్డి, సురమౌళి, మామిడిపల్లి సాంబశివశర్మ, మునుగోటి కృష్ణమూర్తి, ప్రతాప మృత్యుంజయ, జి.చంద్రమౌళి తదితరులు 1970కి ముందు కవిత్వాన్ని సృజించారు. వీరి స్ఫూర్తితో ఈ ‘యువస్వరాలు’ కవితా సంపుటి వెలువడింది. సిరిస్లిలో పుస్తక ముద్రణ ఈ సంకలనంతోనే ప్రారంభమయింది.
హన్మాజిపేటలో సి.నారాయణరెడ్డి పక్కింట్లో 1936లో పుట్టిన కనపర్తి లక్ష్మీనరసయ్య తన కవిత్వంలో సామాన్యుల వెతలను, నిరుద్యోగుల బాధలను చిత్రించిండు. ఇందులో ఆయనవి మొత్తం ఏడు కవితలున్నాయి. బాపూజీ పేరిట గాంధీ గురించి రాసిన కవితలో ఇలా అంటాడు.
“ఈనాటికీ నీ దేశంలో/ మతకల్లోలాలు మాసిపోలేదు/ కుల విభేదాలు కూలి పోలేదు/ ఆకలి చావులు ఆగి పోలేదు/ అతః కలహాలు ఆగిపోలేదు/ పీడిత జనాన్ని పీల్చుక తింటున్నారు/ పెత్తందారీ చెలాయిస్తున్నారు/ హరిజనులను హత్యలు చేస్తున్నారు/ హరి భజనలు నిత్యము చేస్తున్నారు” అంటూ లోకంలో కొనసాగుతున్న అవలక్షణాలను అక్షరీకరించాడు.
“ ‘కర్మ’ నీవు నిర్మించిన/ మర్మ హర్మ్యమని తేలెను/ పునర్జన్మపూర్వ కర్మ/ పుక్కిటి పౌరాణికములు/ విసర్జించు విసర్జించు/ విగ్రహార్చనలు జపములు/ అదే నీకు ముక్తిపథము” అంటూ ‘నిశిత సత్యాలు’ పేరిట రాసిన కవితలో పెరియార్ ఆలోచనా విధానాన్ని ఆవాహన చేసుకొని రాసిండు. అభ్యుదయ ఆలోచనలు, సినారె ప్రభావం ఈయన రచనల్లో కనిపిస్తుంది. ఇందులో హేతువాదాన్ని ప్రచారం చేసిండు. నాస్తికోద్యమానికి స్వాగతం పలికిండు. సిరిసిల్లకే చెందిన గేయకవిగా, రూపకాల రచయితగా ప్రసిద్ధులైన వడ్డేపల్లి కృష్ణ పలు ప్రక్రియల్లో రచనలు చేసిండు. ఈ సంకలనంలో ఆయన రాసిన ఏడు కవితలున్నాయి. అభ్యుదయం, నిరుద్యోగం, బాధ, ప్రకృతి మొదలైన విషయాలను ఇందులో కవిత్వంగా మలిచిండు.

“తడియారిన గొంతుకతో/ తలెత్తి చూస్తున్నాయి, పచ్చని బయళ్ళు/ లాభం లేదంటూ పరమ/ లోభిలా వెళ్తున్నాయి, పైన మొయిళ్ళు/ “ఈ ఏడు కూడ పిడికెడు అన్నం పెట్టవా?’ అంటున్నాయి, కర్షకుని చూపులు దీనంగా” అంటూ వర్షాభావం చేత కొట్టుమిట్టాడుతున్న రైతుల బాధను వ్యక్తీకరించాడు. పంటలు నీరు లేక ఎట్లా ఎండి పోతున్నాయో తన కవిత “ప్రకృతి పరిహసిస్తే’లో చెప్పిండు. గేయ కన్య గురించి రాస్తూ ఇట్లా కవిత్వమల్లిండు.

“అప్సరసల తలదన్నే/ అందాలను విరజిమ్మే/ ప్రబంధ గేయకన్యల గూడ వీడి/ పఠించిననాకు వలపును పంచి/ మధురమైన తలుపులో ముంచి/ మైమరపించి, వచనగేయ కన్య/ మారిపోయింది నా ప్రేయసిగా కన్య” అంటూ కవితా ప్రేయసి గురించి అన్నడు. అంతటా పరుచుకు పోయిన అవినీతి, లంచావతారులపై తన కవిత్వంలో ఆగ్రహాన్ని వెలిబుచ్చిండు.
“లంచాలు పెంచే కాలము/ మంచిని వంచించే కాలము/ తలలో అసలే తెలివి లేకున్నా/ తనవాడైతే చాలు/ తగినపదవి పొందే కాలము/ సిఫారసు పట్టుకు వస్తే/ సిగ్గుమాలి నివసిస్తే/ దద్దమ్మలకైనా/ పెద్ద పదవి దొరికే కాలము” అంటూ మెరిట్ ఉన్నా, మేధావి అయినా ఆదరణ కరువైన విషయాన్ని రికార్డు చేసిండు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రభావంతో రాసిన కవిత ఇది. ఈ తీరు ఇప్పటికీ కొనసాగుతుంది అంటే ఆయన కవిత్వానికి నేటికీ ప్రాసంగికత ఉన్నదని అర్థమౌతుంది. మరో కవి జక్కని వెంకటరాజం. ఈయన రాసిన డజను కవితలు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ అభ్యుదయ దృక్పథంతో రాసినవే. సామాన్యుడు, గుమాస్తాల సమ్మె, విజ్ఞానం ప్రాధాన్యత, మానవ జీవితం, నాయకుడి కపట యోచనలను కవిత్వీకరించాడు.

“గుమాస్తాల సమ్మె రోజులవి/ నెలలో ఇరవయ్యేడో తారీకు/ ‘రేపు’ను గరించి ఆలోచిస్తూ/ గుమాస్తా గుర్నాథం/ గుమ్మంలో నిల్చొని చూస్తున్నాడు” అంటూ సమ్మెకాలపు అగచాట్లను చెప్పిండు.
“మానవుని బ్రతుకు ప్రమిదలో/ ఒక్కొక్క చుక్కగా చమురును పీలుస్తూ/ ఏమీ ఎరుగని దానిలా/ సాగిపోతోంది కాలం” అంటూ కాలం మానవ జీవన ప్రయాణం గురించి రాసిండు. / ‘నా పేరు నాయకుడు’ పేరిట రాసిన కవితలో రాజకీయ నాయకుడి విన్యాసాల గురించి ఇట్లా చెప్పిండు.

“నా ఉపన్యాసాల పాటలను/ గంగిరెద్దుల్లాంటి ప్రజలంతా/ చెవులు నిక్కబొడుచుకొని /వింటారని నాకు తెలుసు/ ఈ గంగిరెద్దుల్లాంటి ప్రజలున్నంత కాలం/ నాకు లేదు ‘ఢోకా”’ అంటూ రాజకీయ నాయకులు ప్రజల్ని గంగిరెద్దుల్ని చేసి ఎట్లా ఆడిస్తున్నారో, ఎట్లా వాళ్ళు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతుందో చెప్పిండు.

ఈ సంకలనంలో చోటు చేసుకున్న మరో కవి కుడిక్యాల లింగయ్య. ఈయన రాసిన నాలుగు కవితలు ఇందులో ఉన్నాయి. ‘ఎదురు తిరుగకేం చేస్తారు’ అంటూ తన కవిత్వంలో ప్రశ్నించిండు. కుళ్ళి, కృషించి పోతున్న సమాజాన్ని కుక్కలతో పోల్చిండు. అందులో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కూడా రికార్డయింది. అందుకే /“బలిసిన ఆ కుక్కలు/భయపెడ్తాయనే గదా నీ భయం/ అయితే యిదే నా అభయం/ పక్కనున్న రాతిని/ పట్టుకొని అటువిసురు/ పౌరుషంతో కసురు/ ప్రక్కకైనా చూడకుండా/ పరుగెత్తుకెళ్తాయో లేదో చూడు/ ఇంకెందుకీ గోడు?” అంటూ తిరగబడుమని చెబ్తాడు.
“పగలనక రేయనక/ పరిశ్రమించి/ చెమటనే నీరుగ పారించి/ పంటల్ని పండించే రైతుకే/ పస్తులు తప్పడం లేదు/ ఫలితం దక్కడం లేదు/ రెక్కలు ముక్కలు చేసుకున్నా/ డొక్కనిండని నిరుపేదలు/ చదివిన సర్టిఫికేట్లు పట్టుకొని/ సమస్త బాధల్నీ మూటగట్టుకొని/ నిరుద్యోగపు నింగి క్రింద/ నిట్టూర్పులు విడుస్తున్న నిరుద్యోగులు/ చావలేక/ బ్రతకలేక/సతమతమై పోతుంటే/ ఎదురుతిరుగకేం చేస్తారు?/ తిరుగుబాటు చేయనిదే/ ఎలా జీవిస్తారు” అంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంలోని జీవితాలను, నిరుద్యోగం, పోరుబాటను రికార్డు చేసిండు.

చివరగా ఐదో కవి గోలి కృష్ణహరి రాసిన ఐదు కవితలున్నాయి. పల్లెటూరు జీవితాన్ని, లంచగొండుల దోపిడీని తన కవితల్లో చిత్రించాడు. పాలేరు గురించి రాస్తూ.. “పల్లెటూరి మూలవేరు/ జాతికి స్వాతంత్య్రం వచ్చి/ పాతికేళ్ళు గడుస్తున్నా/ పాపం/తనకు మాత్రం యింకా స్వాతంత్య్ర లేనివాడు” అంటూ పల్లెటూరులో పాలేరు వెతలను చిత్రించిండు. /ఈ ఐదుగురు కవులు బిసి సామాజిక వర్గానికి చెందిన వారు. సీనియర్ కవి, ప్రస్తుతం కరీంనగర్‌లో జీవిస్తున్న కనపర్తి లక్ష్మీనరసయ్య కంసాలి సామాజిక వర్గానికి చెందినవాడు. టీచర్‌గా పని చేసి రిటైరయ్యారు. 1953 నుంచి కవిత్వం రాస్తూ ఉన్నాడు. సిరిసిల్ల పాఠశాల ప్రత్యేక సంచిక ‘నినాదం’లో ఈయన మొదటి కవిత అచ్చయింది. ‘దీపశిఖలు’ అనే ఖండకావ్య సంపుటిని, ‘పరాజిత’ అనే గేయ కావ్యాన్ని వెలువరించాడు.

భిన్న ప్రక్రియల్లో అనేక రచనలు చేసిన, చేస్తున్న వడ్డేపల్లి కృష్ణ తన 24వ యేట ఈ రచనలు చేసిండు. ఒక్క లక్ష్మీనరసయ్య తప్ప మిగతా అందరూ సిరిసిల్లలో మెజారిటీగా ఉన్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. బహుశా వీరంతా తొలితరం కథా రచయిత, నవలాకారుడు, కవి జి.రాములు శిష్యులు కావొచ్చు. ఈ నలుగురు కవుల్లో కుడిక్యాల లింగయ్య మరణించారు. జక్కని వెంకటరాజం సిరిసిల్లలో గత ఐదేండ్లుగా మళ్ళీ తన రచనా వ్యాసాంగాన్ని కొనసాగిస్తున్నాడు. తంతి, తపాల శాఖలో పనిచేసి రిటైరైన గోలి కృష్ణహరి, వడ్డేపల్లి కృష్ణమాదిరిగా హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు.
ఈ ఐదుగురు కవులు 1973 నాటి ‘యాంగ్రీ యంగ్‌మెన్స్’లాగా తమ కవిత్వంలో సమాజంలోని దుర్మార్గాలు, అవినీతి, లంచగొండి, బంధుప్రీతిపై అక్షర శరాలను సంధించారు. ఒక వైపు ఉద్యోగాలు చేసుకుంటూనే సిరిసిల్లలో యువసాహితీ సమితిని ఏర్పాటు చేసి సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు. అక్కినేని నాగేశ్వరరావు లాంటి పాపులర్ సినీతారలతో పాటు దాశరథితో పాటు అనేక మంది లబ్ధప్రతిష్టులైన కవులతో కార్యక్రమాలను నిర్వహించారు. యాభై ఏండ్ల క్రితం, తొలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానంతరం సాహితీ ఉద్యమాలకు వివిధ కేంద్రాలు నడుంచుట్టాయి. నల్లగొండ, వనపర్తి, సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, జనగామ లాంటి ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు జోరుగా సాగాయి. అట్లాంటి సాహితీ ఉద్యమంలో ముందు వరుసలో నడిచిన ‘యువసాహితీ సమితి’కి అభినందనలు.

సంగిశెట్టి శ్రీనివాస్
9849220321

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News