Sunday, November 24, 2024

 కులగణనతోనే బిసిల భవిష్యత్!

- Advertisement -
- Advertisement -

విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బిసిలు ముందు నుండి అనేక వివక్షలకు గురవుతున్నారు. వీరి ఎదుగుదలకు కులగణన ఒక గొప్పఅవకాశం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్‌లో అధికారంలోకి రాగానే 100 రోజుల్లో 23 నుంచి 42 శాతానికి ఒబిసి రిజర్వేషన్లను పెంచుతామని హామీ ఇచ్చింది. దాన్ని పరిగణనలోకి తీసుకొని తెలంగాణలో కులగణన చేయాలని మంత్రివర్గం ఆమోదం కూడా తెలిపింది. 2018లో బిసి కులగణనను చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి కులగణనను ప్రభుత్వం మార్చి 15వ తేదీన జిఒ నెంబర్ 26ను 2024 ద్వారా మొత్తం తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులు, వృత్తి, విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాలు, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతులు ఇలా మొదలైనటువంటి వివరాలను సేకరించాలని, అటువంటి ఉద్దేశంతో ఈ కులగణన చేయాలని నిశ్చయించుకున్నారు.

1931 తర్వాత కులగణన జరగకపోవడం వల్ల చాలా కులాలకు సంక్షేమ ఫలాలు అందక అభివృద్ధిలో కూడా వెనుకబడిపోయారు. ఈ సంపూర్ణ కులగణన ద్వారా వారి స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలవడంతోపాటు, వారికి ఏం చేయాలో అనేటువంటి విషయం కూడా తెలుస్తుందని ప్రభుత్వం యోచిస్తుంది. సంపూర్ణ కుటుంబ సర్వే వల్ల జనాభా ప్రాతిపదికన బడ్జెట్, నిధులు, రిజర్వేషన్లు పెంచడం వీలవుతుంది. గతంలో తమిళనాడులో 1982లో అంబాకర్ కమిషన్ నూరు శాతం జనాభా, కులగణన, కుటుంబ సర్వే చేయడం వల్ల 69% రిజర్వేషన్లకు ఆధారమైంది. 2016లో కర్ణాటకలో ఇలాంటి సంపూర్ణ సర్వే నిర్వహించడం జరిగింది. నిజానికి కులగణన డిమాండ్ 1950 నుంచి ఉన్నది. బ్రిటిష్ పాలనలో 1881 నుంచి 1931 వరకు ప్రతి పదేండ్లకు ఒకసారి జరిగే జనాభా గణనలో కులాలవారీగా జనాభా లెక్కలు సేకరించారు.

నిజాం రాష్ట్రంలో కూడా సెన్సస్‌తో పాటు కులగణన జరిగింది కానీ 1951 సెన్సెస్‌లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒబిసిల కులగణనను సమ్మతించకపోవడం వల్ల అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ డిమాండ్ కొనసాగుతూ ఉంది. ఈ మధ్య జాతీయ ప్రాధాన్యత అంశంగా మారింది. లెక్కల ప్రకారం విద్య, ఉద్యోగ రంగాల్లో ఎస్‌సిలకు 1947 నుంచి, ఎస్‌టిలకు 1950 నుంచి రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఒబిసిలకు సంబంధించి సుప్రీం కోర్టు తీర్పు బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ తీర్పు 1962 ప్రకారం రిజర్వేషన్లు 50% మించకుండా మండల కమిషన్ నివేదిక ప్రకారం ఉద్యోగాలలో 27% 1993 నుంచి, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా 2006 నుంచి కల్పిస్తున్నారు. బిసిలను రాజకీయ పార్టీలు ఎప్పటికీ కార్యకర్తల్లాగానే చూస్తున్నాయి.

వారికి ఉన్నత పదవులను కట్టబెట్టడం లేదు. ఓట్ల కోసం మాత్రమే వారిని వాడుకుంటున్నారు. బిసిలపై ప్రేమ చూపినట్టు నటించి, హామీలిచ్చి అధికారంలోకి రాగానే బిసిలను పట్టించుకోవడం లేదు. అందుకే బిసి నాయకులు ఉన్నతమైన రాజకీయ పదవులలో కనిపించడం లేదు. అందుకోసం బిసిలంతా ఐక్యంగా పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. స్థానిక సంస్థల ఎన్నికలతో ఈ కులగణనకు ప్రత్యక్ష సంబంధం ఉంది. దీని ద్వారా రాజకీయ ముఖచిత్రమే మారిపోయే అవకాశం ఉంది. పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లు ఉన్నాయి. వాటిని ఎవరూ కూడా మార్చలేరు. కానీ బిసిలకు స్థానిక సంస్థల్లోనే తప్ప, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్లు లేవు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రిజర్వేషన్లను ప్రభుత్వాలు మార్చడం, చాలా మంది కోర్టుకు వెళ్లడం, రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆధారమైనటువంటి కులజనాభా లెక్కలు అడగడం గత ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నటువంటి విషయం.

గతంలో 1986లో ఎన్‌టి రామారావు ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. అప్పుడు 20%గా ఉండేది. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో 34 శాతానికి పెరగగా, 2019లో సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా కెసిఆర్ ప్రభుత్వం దాన్ని 22 శాతానికి తగ్గించింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బిసి కులాల జనాభా వివరాలు సేకరిస్తే ఆ తర్వాత చట్టసభల్లో కూడా తమ సీట్ల సంఖ్య పెరగాలని, రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ వస్తుందనేటువంటి నేపథ్యంలో పాలక వర్గాలకు చెందిన అగ్రనేతలు కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు బిసి కులాల జనాభా వివరాలను శాస్త్రీయంగా సేకరించాలి. చేపట్టబోయే ఈ సర్వే కేంద్ర ప్రభుత్వంతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం కూడా వీటిని గుర్తించేలా ఉండాలి.

ఈ కులాల జనాభా వివరాలను సేకరించే ముందు వారికి ఒక అవగాహన అనేటువంటిది అవసరం. దేశ జనాభాలో 56% గా ఉన్న బిసిలకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఇటు అసెంబ్లీ లోను, అటు పార్లమెంట్‌లోను ఎక్కువ సంఖ్యలో బిసిలు నష్టపోతున్నారు. బిసి నాయకులు ఉన్నత పదవుల్లో కనిపించడం లేదు. పార్లమెంట్‌లో 15% కూడా బిసిల బలంలేదు. దేశంలో 16 రాష్ట్రాల నుంచి ఒక్క బిసి ఎంపి కూడా లేరు. రిజర్వేషన్‌లు లేకపోవడం వల్ల ఆర్థికంగా ఉన్నటువంటి వారు మాత్రమే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తరతరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతుంది. వారిని ఇప్పటికే ఎన్నో పార్టీలు మోసం చేశాయి.

దేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి బిసిలకు 23% రిజర్వేషన్లు కూడా లేవు. బిసి బిల్లు కోసం ఉద్యమిస్తున్న వారిని ఎన్‌డిఎ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణలోనైనా బిసి జనగణన చేపట్టాలి. తెలంగాణలో వేగంగా కులగణన కార్యక్రమాన్ని చేపట్టాలి. ఇటీవల బీహార్‌లో ఐదు వారాల్లోనే కులగణన చేశారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. బి.ఆర్ అంబేద్కర్ చెప్పినట్టు బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి మాటలను బిసిలు ఆదర్శంగా తీసుకొని ఒక ఉద్యమాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది.

మోటె చిరంజీవి

9949194327

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News