హైదరాబాద్ : మరో నాలుగు నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయంగా అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు జులై 15న రాజకీయ ప్లీనరీని నిర్వహించనున్నట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్, ఎల్‌బి నగర్ లోని కెబిఆర్ కన్వెన్షన్ లో పదివేల మంది బిసి ప్రతినిధులతో నిర్వహించే ఈ ‘బిసిల రాజకీయ ప్లీనరీ , లో భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు.
సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు బైరి రవికృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారం గణేష్ చారి, యువజన సంఘం అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మ, మహిళా అధ్యక్షురాలు బి మణి మంజరిలతో కలిసి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. బిసిలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జనాభా దామాషా ప్రకారం టికెట్లు ఇస్తామని చెప్పకుండా రాయితీలు, సంక్షేమ పథకాలతో ‘బీసీ డిక్లరేషన్‘ పేరుతో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మోసం చేయాలని చూస్తున్నాయని జాజుల ఆరోపించారు.
బిసిలు రాయితీలతో రాజీ పడకుండా, రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా, సిఎం పీఠమే ఎజెండాగా రాజకీయ ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు, బిసిలను మోసం చేసే పార్టీలను ఎండగట్టి, వచ్చే ఎన్నికల్లో వారిని ఓడించాడానికి, బిసిలలో రాజకీయ చైతన్యం రగిలించడానికి ఈ ప్లీనరీ ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్లీనరీలో విస్తృతంగా చర్చించి అవసరమైతే బిసిలకు కూడా ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. బిసిలు రాజకీయ సంఘటిత శక్తిని చాటి 2023 ఎన్నికలు బిసి ఎజెండాగా జరగడానికి, బిసిలు ఆశించే స్థాయి నుండి రాజకీయంగా శాసించే స్థాయికి ఎదగడానికి ఈ ప్లీనరీ ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
పార్టీలకతీతంగా ఈ ప్లీనరీ లో వేలాది మంది పాల్గొని విజయవంతం చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్, బిసి యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడిగి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర నాయకులు సింగం నగేష్ గౌడ్, పానుగంటి విజయ్ గౌడ్, ఎన్నాం ప్రకాష్, మాదేశి రాజెందర్, సిద్ధాంతం శ్యామల తదితరులు పాల్గొన్నారు.