మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ భవన్ కేం ద్రంగా ప్రజలకు అందుబాటులో ఉందామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసికెట్ కెటిఆర్ పార్టీ నేతలకు తెలిపారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం, ప్రగతి భవన్ కేంద్రంగా విధులు నిర్వహించిన మనమంతా, ఇకపై కేంద్ర కార్యాల యం తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉందామని చెప్పారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికైన పార్టీ ఎంఎల్‌ఎలు, పోటీ చేసి న అభ్యర్థులు, పార్టీ సీనియర్ నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలంగాణ భవన్‌లో సోమవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కెటిఆర్ పార్టీ నాయకులు, ఎన్నికైన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో మాట్లాడారు. 10 ఏళ్ల కాలంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని, అందుకే ప్రజలు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చినా, మన పార్టీకి గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారని కెటిఆర్ అన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ప్ర జల నుంచి బిఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం పైన ఒక సానుకూలను స్పందన వస్తున్నదని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారం కోల్పోతుందని అనుకోలేదని, సమాజంలోని అన్ని వర్గాల నుంచి వందలాది మెసేజ్ లు వస్తున్న విషయాన్ని కెటిఆర్‌తో పాటు, పార్టీ నాయకులు చర్చించారు. త్వరలోనే పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు పోదామని అన్నారు.ఈ సందర్భంగా పార్టీ తరఫున గెలిచిన ఎంఎల్‌ఎలకు కెటిఆర్ అభినందనలు తెలిపారు.