Monday, January 20, 2025

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ ప్రతినిధి : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సీజనల్ వ్యాధుల పట్ల వివిధ శాఖల అధికారులు అనుసరించాల్సిన విధానాలపై కో ఆర్డినేషన్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నీరు నిలువ ఉన్న చోట అవసరమైన మందు పిచికారి చేయాలన్నారు.

దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులైన మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ, బోదకాలు, మెదడు వాపుతో పాటు ఇతర వ్యాధులను అరికట్టడానికి ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో ఇండ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని, దీనికోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని పంచాయతీ శాఖను ఆదేశించారు. ఎక్కువగా నీళ్లు నిల్వ ఉండే చోట మత్సశాఖ ఆధ్వర్యంలో గంబుసియా చేపలు పెంచడం లాంటి కార్యక్రమాలు చేయాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా అందించే త్రాగునీటిలో కలుషితం లేకుండా చూడాలన్నారు.

ఎక్కడైనా పైపులు లీకై ఉంటే వెంటనే మరమ్మత్తు చేయాలని మిషన్ భగీరథ ఈఈని ఆదేశించారు. వ్యాధుల నివారణ కోసం పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా అవసరమని పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, రెసిడెన్సియల్ హాస్టల్లో విద్యార్థుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు. హాస్టల్లో తనిఖీ చేసి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలను ఆన్లైన్‌లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సహజంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

వర్షాకాలంలో వాతావరణంలో చోటు చేసుకునే మార్పుల ఫలితంగా సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి వ్యాధులతో పాటు విష జ్వరాలు ప్రభలే అవకాశం అధికంగా ఉంటుందని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కాచి వడగాచిన నీటిని తీసుకోవాలనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏజెన్సి ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాలను పరీక్షించి అవగాహన కల్పించాలని వైద్య శాఖను ఆదేశించారు.

జిల్లాలో గత సంవత్సరం 45 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, ఈ సంవత్సరం ఇప్పటి వరకు రెండు డెంగ్యూ కేసులు, ఒక మలేరియా కేసు నమోదైందని, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు నిర్వహించాల్సిన బాధ్యతలు, విధులపై అంతకు ముందు అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీనివాసులు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధార్ లాల్, డిఆర్‌డిఏ పిడి నర్సింగ్ రావు, డిఈఓ గోవిందరాజులు, డిపిఆర్‌ఓ సీతారాం, బిసి వెల్ఫేర్ అధికారి శ్రీధర్ జి, మత్సశాఖ అధికారి లక్ష్మప్ప, మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్, డిప్యూటి డిఎంహెచ్‌ఓ వెంకట దాస్, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీనివాసులు, వైద్య సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News