Saturday, December 21, 2024

బిజెపి విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: దాసోజు శ్రవణ్

- Advertisement -
రజాకార్ ఫైల్స్, బుల్డోజర్ అంటూ ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు 
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లఫై కిషన్ రెడ్డి రాద్ధాంతం గురివింద సామెత గుర్తు తెస్తున్నారు
‘కూట్లె రాయి తీయనోడు ఏట్లె రాయి తీత్త’ అన్నట్లుగా కిషన్ రెడ్డి తీరు 

- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీరు ‘కూట్లె రాయి తీయనోడు ఏట్లె రాయి తీత్త’ అన్నట్లు ఉందని బిఆర్‌ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేసారు. బిజెపి పార్టీ మత ధోరణితో ఈనాడు మణిపూర్ తగలబడిపోతుందని, గత రెండు నెలలుగా అక్కడ మెయితెయ్, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పారు. నడిరోడ్డుపై మహిళలను బట్టలువిప్పి ఊరేగిస్తూ..అత్యాచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఎక్కడికక్కడే మతం ముసుగులో మారణహోమం సృష్టిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. మణిపూర్ ఘటనలు చూస్తుంటే అన్నం కూడా తినబుద్ది కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులు చూసి యావత్ దేశ ప్రజలంతా బిజెపిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బిజెపి మత పిచ్చి వల్ల అక్కడ అంత దారుణాలు జరుగుతున్నాయని దుమ్మెత్తిపోస్తున్నారని అన్నారు. ఇంత జరుగుతుంటే కేంద్రమంత్రి హోదాలో ఉన్న కిషన్‌రెడ్డి తన బాధ్యత మరిచిపోయి, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ అంత దారుణాలు జరుగుతుంటే తనకు ఏమి సంబంధం లేనట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు.

ఓ పక్క మణిపూర్‌లో దారుణం జరుగుతుంది..దేశ ప్రజలు దుమ్మెత్తిపోస్తుంటే.. ఇవేమి తనకు తెలియదన్నట్లు ఆయన హైదరాబాద్‌కు వచ్చి బిజెపి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో రుణమాఫీ చేయాలనీ, గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సమకూర్చాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి రాసిన లేఖపై శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో బిఆర్‌ఎస్ నేత శ్రావణ్ స్పందించారు. ఈ సమావేశంలో దాసోజు శ్రవణ్‌తో పాటు బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, ఎంఎల్‌సి శ్రీనివాస్ రెడ్డి, చలపతి రావు, రాజారామ్ యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ..బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా శుక్రవారం జి.కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరుణంలో ..కుంభకర్ణుడు అప్పుడే లేచినట్లు కిషన్ రెడ్డి…కెసిఆర్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసే ప్రయత్నం చేశారని అన్నారు. ఎయిర్ పోర్ట్ నుండి బయటకు అడుగుపెట్టగానే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన అంటూ పెద్ద డ్రామా మొదలుపెట్టారని మండిపడ్డారు. బాధ్యతలు చేపట్టి చేపట్టగానే రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదని పేర్కొన్నారు.
తెలంగాణపై సవతి తల్లి ప్రేమ ఎందుకు?
బిజెపికి విధివిధానం ఉందా..? ప్రజలను అభివృద్ధి చేసే ప్రణాళిక ఉందా..?..అని శ్రవణ్ నిలదీశారు. ఏమి లేకుండా..ఏం చేయకుండా..తెలంగాణ ప్రజల మధ్య మత విభేదాలు సృష్టించి ,చిల్లర రాజకీయాలు చేయాలని కిషన్‌రెడ్డి అండ్ టీం చూస్తుందని, వీరి నుండి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను సూచించారు. డబుల్ బెడ్ రూమ్ విషయంలో కెసిఆర్ ప్రజలను మోసం చేశాడని కిషన్‌రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మనసున్న కెసిఆర్ రూ. 8 లక్షల ఖర్చుతో 600 స్కేర్ ఫీట్ విస్తీర్ణంతో ఎన్నో ఇల్లు కట్టించారని..కట్టిస్తూనే ఉన్నారని తెలిపారు. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. 31 రాష్టాలకు ఓ నీతి… తెలంగాణకు ఓ నీతి ఏంటి అని శ్రవణ్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి..రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కట్టడం లేదా? పన్నులు కట్టడం లేదా? ఎందుకు తెలంగాణపై సవతి తల్లి ప్రేమను మోడీ , కిషన్ రెడ్డి చూపిస్తున్నారని శ్రవణ్ నిలదీశారు.

పోడుభూముల సమస్యపై సిఎం కెసిఆర్ చట్టపరమైన సమస్యలు రావొద్దని పోడుభూముల సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టారని చెప్పారు. 1 లక్ష 51 వేల 146 మంది గిరిజన బిడ్డలకు పోడుభూముల పట్టాలను అందజేశారని వివరించారు. ఈ విషయం కిషన్ రెడ్డికి తెలియదా..ఇంకా మీరు కుంభకర్ణ నిద్రలో ఉన్నారా..? అని శ్రవణ్ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.నిరుద్యోగుల కోసం కెసిఆర్ లక్ష ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి, వాటిలో కొన్ని భర్తీ చేశారని, ఇంకా నోటిఫికేషన్లు పడుతున్నాయని చెప్పారు. మరోపక్క తెలంగాణకు ఇతర కంపెనీలను తీసుకొచ్చి దాదాపు 20 లక్షల మందికి కెటిఆర్ ఉపాధి కల్పించారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేసిందో చెప్పాలని కిషన్ రెడ్డిని శ్రవణ్ ప్రశ్నించారు. 2014లో మోడీ ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు..ఆ లెక్కన చూస్తే 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని అన్నారు. కేంద్రంలో ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నారు కదా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ముందు ప్రధాని మోడీ చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి..తెలంగాణ గురించి మాట్లాడాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు.
బిజెపి పాలిత ప్రాంతాలలో ఎంత పెన్షన్ ఇస్తున్నారో చెప్పాలి
బిజెపి పాలిత ప్రాంతాలలో ఎంత పెన్షన్ ఇస్తున్నారో చెప్పాలని శ్రవణ్ కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. గుజరాత్‌లో 60 నుండి 80 ఏళ్లు ఉన్న వారికీ రూ.750, 80 ఏళ్లు దాటినా వారికీ రూ.1000 ఇస్తున్నారని, అత్యంత ధనికులు అంబానీ, అదానీ, మోడీలు ఉన్న గుజరాత్‌లో ఇంత దారుణంగా పెన్షన్‌లు ఇస్తున్నారని విమర్శించారు. సిఎం కెసిఆర్ పేదలను, వృద్దులను, వితంతువులను దృష్టిలో పెట్టుకొని వారికీ పెద్ద కొడుకుల రూ. 2016 , వికలాంగులకు రూ. 4016 ఇస్తున్నారని..కిషన్‌రెడ్డి ఇది తెలుసుకోవాలని సూచించారు. ముందు బిజెపి పాలిత రాష్ట్రాల్లో పెన్షన్‌లు పెంచి..అప్పుడు సిఎం కెసిఆర్‌ను విమర్శించాలని అన్నారు. కెసిఆర్ బ్రతికున్న వారినే కాదు చనిపోయినవారికి కూడా గౌరవం ఇవ్వాలని ప్రతి పల్లెలో, పట్టణంలో వైకుంఠధామాలు కట్టించారని… అవేమి మీకు కనిపించడం లేదా అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.బిసిల గురించి మాట్లాడానికి సిగ్గుందా..? అని అడిగారు. 2023 -24 కేంద్ర బడ్జెట్‌లో ఒబిసిలకు కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించడం బిసిలపై కేంద్రానికి ఉన్న చిన్నచూపునకు నిదర్శనమని విమర్శించారు.
బుల్డోజర్‌తో ఎవరి ఇల్లు కూల్చేస్తావ్?
అవినీతి గురించి మాట్లాడే అర్హత బిజెపి ఉందా అని శ్రవణ్ ప్రశ్నించారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా లాంటి ఎంతోమంది పెట్టుబడిదారులకు, బ్యాంకులను మోసం చేసిన నేరస్థులకు మోడీ సర్కార్ కొమ్ముకాస్తుంది నిజం కాదా అని ప్రశ్నించారు. బుల్డోజర్‌లను తీసుకొస్తా అని కిషన్ రెడ్డి అంటున్నాడు..ఎవరి ఇల్లు కూల్చేస్తావ్ ..దమ్ముంటే కూల్చు చూస్తానని శ్రవణ్ సవాల్ విసిరారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధితో ముందుకు సాగుతుందని తెలిపారు. ఆనాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన కిరణ్ కుమార్‌ను..ఈరోజు మీ పక్కన కూర్చుపెట్టుకొని తెలంగాణను అభివృద్ధి చేస్తామంటే ప్రజలు నమ్మరని .. తప్పుడు ఆరోపణలతో సిఎం కెసిఆర్‌పై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని కిషన్ రెడ్డికి శ్రవణ్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News