గ్రేట్ హైదరాబాద్‌లో థార్ గ్యాంగ్ హడల్ సృష్టిస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో తిరుగుతూ ఇళ్లల్లో చోరీలు దోపిడీ చేస్తున్నారు. ఈ ముఠా ఇప్పటికే హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బినగర్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మాములు గృహాలతోపాటు విద్యుత్ ఫెన్సింగ్ ఉన్న అపార్ట్ మెంట్లు.. గేటెడ్ కమ్యూనిటీలను కూడా ఈ గ్యాంగ్ వదలడం లేదు. సోలార్ వైర్లను కట్ చేసి మరీ లోపలికి చొరబడి చోరీలు చేస్తున్నారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే గురువారం ఐదు ఇళ్లల్లోకి చొరబడి నగదు, బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ ముఠా రాత్రి సమయంలో ఇంటి డోర్ కొట్టి అత్యవసరం ఉందని చెబుతున్నారు.
నమ్మి డోర్ తీసిన వారిపై దాడి చేసి ఇంట్లోని బంగారు ఆభరణాలు, వెండివస్తువుల, డబ్బులు చోరీ చేస్తున్నారు. అడ్డు వస్తే ప్రాణాలు కూడా తీసేందుకు ఈ ముఠా వెనుకాడదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్‌లో వృద్ధులు ఉంటున్న ఇంటిపై దొంగలు దాడి చేశారు. దీంతో వృద్ధులు అరవడంతో స్థానికులు వచ్చి దొంగలను పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో ఉప్పల్ పోలీసులు వచ్చి దొంగలను అదుపులికి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుకున్నవారు థార్ ముఠాకు చెందిన వారా కాదా అనేది తెలియాల్సి ఉంది.
మధ్యప్రదేశ్ గ్యాంగ్…
చోరీ చేసిన ప్రదేశాల నుంచి సేకరించి ఆధారాలను పరిశీలించిన పోలీసులు చోరీలకు పాల్పడుతోంది మధ్యప్రదేశ్ కు చెందిన ‘థార్’ గ్యాంగేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ముఠా నగర శివారులో సంచరిస్తున్నట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. హయత్ నగర్, అబ్దుల్లాపూర్ పూర్ మెట్, ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని కాలనీల్లో తిరుగుతూ చోరీలు చేస్తున్నారు. ప్రజలు రాత్రి సమయంలో ఒంటరిగా తిరగొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
పగలు రెక్కీ.. రాత్రి చోరీ..
మధ్యప్రదేశ్ కు చెందిన థార్ గ్యాంగ్ పగలు రెక్కి నిర్వహించి, రాత్రిళ్లు చోరీలకు పాల్పడతారని పోలీసులు చెబుతున్నారు. గ్యాంగ్ లో ఐదుగురు, అంత కంటే ఎక్కువ మంది ఉంటారని, అర్ధరాత్రి ఎవరైనా తలుపు తడితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ తీయొద్దని, వచ్చిన వ్యక్తులు ఎవరో నిర్ధారించుకున్నాకే ఓపెన్ చేయాలని అప్రమత్తం చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్100 కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు