Sunday, January 19, 2025

వర్షాకాల పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -
ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా చూడాలి
పురపాలక శాఖ, జిహెచ్‌ఎంసి, వాటర్‌వర్క్ అధికారులతో
పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సమీక్ష
పట్టణాల్లో చేపట్టాల్సిన అంశాలపై కెటిఆర్ దిశా నిర్ధేశం

హైదరాబాద్ : పట్టణాల్లో వర్షాకాల పరిస్ధితులను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని పురపాలక శాఖ అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పురపాలికల్లోని వర్షాకాల సన్నద్ధతపై మంత్రి కెటిఆర్ అధికారులతో సమీక్ష జరిపారు. వర్షాకాలం నేపథ్యంలో పట్టణాల్లో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి కెటిఆర్ దిశానిర్ధేశం చేశారు.ఇందులో భాగంగా పురపాలికల్లో చేపట్టిన వర్షాకాల సన్నద్ధత కార్యక్రమాలను సమీక్షించిన అనంతరం కెటిఆర్ వరద నివారణ కోసం నగరంలో చేపట్టిన ఎస్‌ఎన్‌డిపి వంటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రత్యేక సమీక్ష జరిపారు. దీంతోపాటు
నగరంలో ప్రారంభించిన వార్డు కార్యాలయ వ్యవస్థ గురించి అధికారులను మంత్రి కెటిఆర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. ఇప్పటికే వర్షాకాల ప్రణాళికకు సంబంధించి కొంతకాలంగా పురపాలికలు అన్నీ ఏర్పాట్లను చేసుకుంటు న్నాయని, మరింత పకడ్భందీగా చర్యలు చేపట్టాలని మంత్రి తెలిపారు. ఇప్పటికే జిహెచ్‌ఎంసితో పాటు రాష్ట్రంలోని ఇతర పురపాలికల్లో నాలాల సేఫ్టీ ఆడిట్‌ను పూర్తి చేసినట్లు కెటిఆర్ పేర్కొన్నారు.

లోతట్టు ప్రాంతాలను గుర్తించాలి
జిహెచ్‌ఎంసి చేపట్టిన ఎస్‌ఎన్‌డిపి ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చేపట్టిన పనుల్లో మెజార్టీ పనులు పూర్తయ్యాయని, గత సంవత్సరంతో పోలిస్తే వరద ప్రమాదం అనేక కాలనీలకు తప్పుతుందని ఎస్‌ఎన్‌డిపి విభాగం అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో అవసరమైన డివాటరింగ్ పంపులు, ఇతర ఏర్పాట్లు పూర్తి చేసుకొని సన్నద్దంగా ఉండాలని మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించారు. నగరవ్యాప్తంగా ఉన్న చెరువులో నీరు, పుల్ ట్యాంకు నిల్వలకు చేరకుండా వాటి నీటి నిల్వ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.

వార్డు కార్యాలయాల పనితీరుపై…
నగరవ్యాప్తంగా ప్రారంభించిన వార్డు కార్యాలయాల పనితీరుపైన మంత్రి కెటిఆర్ ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల వ్యవస్థ ప్రారంభ దశలోనే ఉందని, ఈ దశలో ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని అధికారులకు మంత్రి కెటిఆర్ సూచించారు. ఈ దిశగా జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ప్రతిరోజు వార్డు కార్యాలయ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ఆయన సూచించారు. వార్డు కార్యాలయ వ్యవస్థను నగర పౌరులు విస్తృతంగా వినియోగించుకునేలా ప్రయత్నాలు చేయాలన్నారు. వార్డు కార్యాలయ వ్యవస్థ మరింతగా మెరుగుపరిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకునేలా ప్రత్యేకంగా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని జిహెచ్‌ఎంసి అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. వార్డు కార్యాలయ వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న అన్ని విభాగాల అధికారులు రానున్న కొన్ని వారాల పాటు ప్రత్యేకంగా అంతర్గత సమీక్షలు నిర్వహించుకొని, వార్డు కార్యాలయ వ్యవస్థ పనితీరును బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ అధికారులకు సూచించారు.

నగర పౌరులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పలువురు నగర పౌరులతో ఫోన్‌లో మాట్లాడారు. జిహెచ్‌ఎంసికి వివిధ సమస్యలపైన ఫిర్యాదు చేసిన వారికి, ఆయా సమస్యల పరిష్కారం జరిగిన తీరు, ఈ విషయంలో జిహెచ్‌ఎంసి నుంచి ఎదురైన అనుభవాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వీధి దీపాల విషయంలో జిహెచ్‌ఎంసికి ఫిర్యాదు చేసిన తర్వాత, ఆ సమస్యను పరిష్కరించి, అందుకు సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ను కూడా తీసుకున్నట్లు గాజుల రామారాంకు చెందిన రామ్ మంత్రి కెటిఆర్‌కు తెలియజేశారు. మంత్రి కెటిఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆరా చేసిన తీరు పట్ల అయన హర్షం వ్యక్తం చేశారు. మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. జిహెచ్‌ఎంసితో పాటు, జలమండలి చేపట్టిన ప్రాజెక్టులు, ఉచిత నీటి సరఫరా, ఫిర్యాదుల పరిష్కారం వంటి జలమండలి కార్యక్రమాల గురించి కూడా మంత్రి సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పురపాలక శాఖ, జిహెచ్‌ఎంసి, జలమండలి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

KTR

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News