Monday, December 23, 2024

అన్ని వివరాలతో సిద్ధంగా ఉండండి

- Advertisement -
- Advertisement -

ఎన్నికల సంఘం పర్యటన సందర్భంగా అధికారులకు సిఎస్ ఆదేశం

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పర్యటన సందర్భంగా అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఎన్నికల సంఘం అధికారుల రాష్ట్ర పర్యటనకు సంబంధించి చేసిన ఏర్పాట్లపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘంకు చెందిన ఇతర సభ్యులు వచ్చే నెల 3 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే పర్యటిస్తారు. ఇసి సభ్యులు తమ మూడు రోజుల పర్యటనలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలు/ సిపిలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారని సిఎస్ అధికారులకు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.

రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున ఎన్నికలకు సంబంధించిన అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని, అధికారులు అన్ని వివరాలను ఒకే పద్ధతిలో అందించాలని ఆమె సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాల వివరాలను అందించాలని, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లతో చర్చించి వీల్ చైర్‌లు కొనుగోలు చేసి పోలింగ్ కేంద్రాల వద్ద ఉంచాలన్నారు. ఎఈఆర్‌ఓ/ఈఆర్‌ఓల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, సమీకృత సరిహద్దు చెక్‌పోస్టుల వివరాలను కూడా ఎన్నికల సంఘం అధికారులకు అందుబాటులో ఉంచాలని ఆమె తెలిపారు. సమావేశంలో సిఈవో వికాస్‌రాజ్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సునీల్ శర్మ, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోం శాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, జిఏడి కార్యదర్శి శేషాద్రి, విద్యాశాఖ కార్యదర్శి కరుణ, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అశోక్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News