ఈ ఏడాది ద్వితీయార్ధంలో జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావలసిందని ఎన్‌సిపి (ఎస్‌పి) చీఫ్ శరద్ పవార్ సోమవారం తన పార్టీ కార్యకర్తలకు ఉద్బోధించారు. రాష్ట్రంలో అధికారం ఎన్నికల అనంతరం కార్యకర్తల చేతుల్లోనే ఉంటుందని పవార్ చెప్పారు. పుణెలోని పార్టీ కార్యాలయంలో పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పవార్ ఎన్‌సిపి (ఎస్‌పి) కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమిలో భాగంగా మహారాష్ట్ర నుంచి పోటీ చేసిన పది సీట్లలో ఎనిమిదింటిని ఆయన పార్టీ గెలుచుకున్న విషయం విదితమే.
తన కుమార్తె, బారామతి ఎన్‌సిపి (ఎస్‌పి) ఎంపి సుప్రియా సూలె, ఇతర నేతలు, కార్యకర్తల సమక్షంలో పవార్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ‘గడచిన 25 ఏళ్లలో పార్టీ సిద్ధాంతం వ్యాప్తికి పాటుపడ్డాం. దానిని ముందుకు తీసుకువెళ్లేందుకు మనం కలసి కృషి చేద్దాం. వచ్చే మూడు నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. అందుకోసం కృషి చేయడం మన అందరి బాధ్యత. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో అధికారం మీ చేతుల్లో ఉంటుంది’ అని ఎన్‌సిపి వ్యవస్థాపకుడు చెప్పారు.