హైదరాబాద్ : కరీంనగర్ పట్టణవాసులకు ఎలుగు బంటి భయాందోళనకు గురిచేసింది. పట్టణ శివారు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి నడిరోడ్డుపై ప్రత్యక్షం కావడంతో శ్రీపురం, రజ్వీ చమన్ వాసులు అప్రమత్తమయ్యారు. ఎవరిపై దాడి చేస్తుందోనన్న భయంతో వేకువజాము వరకు నిద్ర లేకుండా గడిపారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోవడంతో స్థానిక యువత కర్రలు పట్టుకుని గస్తీ చేపట్టారు. చివరకు ఆ ప్రాంతం నుంచి ఎలుగుబంటి వెళ్లిపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం ఉదయం రేకుర్తిలోని పలు కాలనీల్లోనూ ఎలుగుబంటి సంచరించినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం తీగలగుట్టపల్లి, గోపాల్ పూర్ ప్రాంతంలో సంచరించినట్లు స్థానికులు గుర్తించారు.
ఎలుగుబంటి సంచారంపై సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. రేకుర్తిలో జనావాసాల మధ్య సంచరిస్తున్న ఎలుగు బంటిని పట్టుకునేందుకు దాదాపు నాలుగు గంటల పాటు అటవీశాఖ సిబ్బంది శ్రమించిగా.. అటవీశాఖ బృందంలోని డాక్టర్ సిహెచ్ ప్రవీణ్ కుమార్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎట్టకేలకు ఎలుగుబంటిని బంధించారు. పదేళ్ల వయసున్న ఆడ ఎలుగుబంటిగా అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. పట్టుబడిన ఎలుగుబంటిని కరీంనగర్ జిల్లా అటవీశాఖ కార్యాలయ సముదాయానికి తరలించారు. అక్కడి నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్‌పూర్ మండలంలో పలిమెల అడవిలోకి ఎలుగుబంటిని తీసుకెళ్లి విడిచిపెట్టునున్నట్లు అధికారులు తెలిపారు.