- వారు మాటలకు లొంగరు
- యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్
- బెంగాల్ హింసాకాండపై మమతను ఆక్షేపించిన యోగి
హార్దోయి (యుపి) : వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్‌లో నిరసనల్లో హింసాకాండపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం తీవ్రంగా తూర్పారబట్టారు. ‘బెంగాల్ దగ్ధమవుతోంది’, కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘మౌనంగా’ ఉన్నారని, తుదకు అల్లర్ల కారకులను ‘శాంతి దూతలుగా’ కూడా పేర్కొంటున్నారని యోగి విమర్శించారు. అల్లర్ల కారకులకు బడితె పూజే సరైనదని కూడా ఆదిత్యనాథ్ అన్నారు. ‘దెబ్బలకు స్పందించేవారు మాటలకు లొంగరు’ అని ఆయన అన్నారు. రూ. 650 కోట్లు విలువ చేసే 729 అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేసిన అనంతరం హార్దోయిలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ. ‘బెంగాల్ ఎలా దగ్ధమవుతోందో మీరంతా చూడవచ్చు, కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారు. ఆమె అల్లర్ల కారకులను శాంతి దూతలని కూడా అంటున్నారు. సెక్యులరిజం పేరిట అల్లర్ల కారకులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు’ అని అన్నారు. ‘ఈ విధమైన అరాచకాన్ని కట్టడి చేయాలి. మొత్తం ముర్షిదాబాద్ గత వారం రోజులుగా దగ్ధం అవుతోంది. అక్కడ కేంద్ర దళాల మోహరింపును ఆదేశించినందుకు, ఆ జిల్లాలో మైనారిటీ హిందువుల భద్రతకు చర్యలు తీసుకున్నందుకు న్యాయస్థానానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’ అని ఆయన తెలిపారు.
వక్ఫ్ (సవరణ) చట్టం 2025 చేయడాన్ని ఆదిత్యనాథ్ శ్లాఘిస్తూ, ‘వక్ఫ్ (సవరణ) బిల్లును (పార్లమెంట్‌లో) ఆమోదింపజేసి, నిరుపేదల భూమి దోపిడీని అడ్డుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు కృతజ్ఞులం. ఇప్పుడు ఆ భూముల్లో ఆసుపత్రులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు వస్తాయి. వాటిని హస్తగతం చేసుకునేందుకు ఎవ్వరినీ అనుమతించబోరు. అందుకే ఈ వ్యక్తులు కలవరపడుతున్నారు, ఎందుకంటే దోపిడీ ఇక ఆగిపోతుంది, వీరి గూండాలు నిరుద్యోగులు అవుతారు’ అని పేర్కొన్నారు. వక్ఫ్ చట్టంపై ఆగ్రహంతో సుటి, ధులియాఁ, జాంగీపూర్ సహా ముర్షిదాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో దౌర్జన్యపూరిత నిరసనలు ప్రజ్వరిల్లిన తరువాత యోగి ఆదిత్యనాథ్ ఆ వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చాలా త్వరగా సంఘర్షణలకు దారి తీయగా కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించడం, పలువురు గాయపడడం విదితమే. ‘ముర్షిదాబాద్ అల్లర్లపై కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి), తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) మౌనముద్ర వహించాయి. దుండగులు బెదరిస్తున్నారు, బంగ్లాదేశ్‌లో సంభవించిన పరిణామాలను సమర్థిస్తున్నారు. వారికి బంగ్లాదేశ్ అంతగా నచ్చితే, వారు అక్కడికి వెళ్లాలి. వారు మన భూమిపై ఎందుకు భారంగా మారాలి’ అని ఆదిత్యనాథ్ అన్నారు.
ముర్షిదాబాద్ జిల్లాలో తాజాగా ఎటువంటి దౌర్జన్య సంఘటనలు జరగకుండా నివారించేందుకు భద్రతా దళాలు గట్టి నిఘా వేసి ఉంచారని అధికారులు మంగళవారం వెల్లడించారు. జాంగీపూర్, ధులియాఁ, సుటి, షంషేర్‌గంజ్‌లలో అధిక సంఖ్యలో బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్, రాష్ట్ర పోలీస్, ఆర్‌ఎఎఫ్ సిబ్బందిని మోహరించారని, గడచిన 48 గంటల్లో అక్కడ కొత్తగా ఎటువంటి దౌర్జౌన్య సంఘటనలూ జరగలేదని అధికారులు తెలిపారు. ‘భద్రత పరిస్థితి మెరుగు పడినప్పుడు పెట్టుబడులు వస్తాయి, ఉపాధి కల్పన జరుగుతుంది, యువజనుల వలస తగ్గిపోతుంది. 2017కు ముందు (ఉత్తర ప్రదేశ్‌లో) ప్రతి రెండవ రోజు అల్లర్లు జరుగుతుండేవి. ఈ వ్యక్తులకు సరైన శిక్ష బడితె పూజే. అది లేకుంటే వీరిని కట్టడి చేయలేం’ అని ఆదిత్యనాథ్ అన్నారు. అభివృద్ధి పథకాల గురించి సిఎం ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ‘హార్దోయి జిల్లా సరిహద్దుల్లో పిఎం మిత్ర జౌళి పార్క్ రాబోతోంది. అది లక్షలాది మంది యువజనులకు ప్రయోజనం కలుగుతుంది’ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2023 మార్చిలో జౌళి పరిశ్రమ కోసం ఏడు పిఎం మెగా సమీకృత జౌళి ప్రాంతాలు, దుస్తుల (పిఎం మిత్ర) పార్క్‌ల ఏర్పాటుకు స్థలాలు ప్రకటించింది. ఆ పార్కులు ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, కర్నాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలలో ఏర్పాటు కానున్నాయి.