యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 25న) సినిమా విడుదల కానుంది. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఆ విశేషాలు…
హీరో కార్తికేయ మాట్లాడుతూ ”నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లు, సినిమాలు వేరు. ‘బెదురులంక 2012’ వేరు. ‘ఆర్ఎక్స్ 100’తో ఒకసారి ఇంట్రడ్యూస్ అయ్యాను. మళ్ళీ ఇంకోసారి ‘బెదురులంక 2012’తో అవుతున్నాను. రెండిటిలో శివ పేరు కుదిరింది. క్లాక్స్ కథ చెప్పినప్పుడు ఇందులో నా క్యారెక్టర్, హీరోయిజం ఎంత ఉంది? మార్కెట్ ఎలా ఉంది? వంటి లెక్కలు వేసుకోలేదు. కథ వినగానే నేను ఎంజాయ్ చేసినట్లు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తే బావుంటుందని అనిపించింది. ఆరు గంటలకు క్లాక్స్ కథ చెప్పడం మొదలు పెడితే రాత్రి 12 అయ్యింది. ఈ కథను ఆడియన్స్ 100 పర్సెంట్ ఎంజాయ్ చేస్తారని, ఆలోచిస్తారని అనిపించింది. జీవితంపై క్లాక్స్ కు ఉన్న క్లారిటీ సినిమాలో కనిపిస్తుంది.
మా వేవ్ లెంగ్త్స్ మ్యాచ్ అయ్యాయి. ఈ సినిమా చేస్తున్న క్రమంలో మనిషిగా నేను కూడా మారాను. ఆ మార్పు ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇందులో వేరేగా ఉన్నానని ప్రేక్షకులకు అనిపిస్తుంది. ఇటువంటి కథను నాతో సినిమా చేయడానికి నిర్మాత నమ్మాలి. నాతో లవ్ స్టోరీ, యాక్షన్ సినిమా చేయడానికి నిర్మాతలు వస్తారు. ఈ క్యారెక్టర్ నేను చేయగలనని క్లాక్స్ నమ్మాడు. మేం ఇద్దరం ఈ సినిమా చేయగలమని నిర్మాత బెన్నీ నమ్మారు. న్యూ ఏజ్ ప్రొడ్యూసర్ ఆయన. బెన్నీ గారికి థాంక్స్. సినిమాలో కథానాయికగా ముందు నేహా శెట్టిని అనుకోలేదు. బెన్నీ గారు ఆమె పేరు చెబితే మేం డౌట్ పడ్డాం. మా భయం కన్నా ఆమె ఎక్కువ భయపడిందని షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది.
రాధికా కనిపించకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుని నటించింది. తన క్యారెక్టర్ వరకు కాకుండా సినిమాను చూసింది. మణిశర్మ గారి ‘రామా చిలకమ్మా’ సాంగ్ వల్ల నాలో ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ మొదలైంది. ఎంతో మంది హీరోలతో, ఎన్నో జానర్ సినిమాలు చేసినప్పటికీ… ఈ తరహా సినిమాను ఎప్పుడు చేయలేదని, తన మొదటి సినిమాకు పని చేసినట్లు చేస్తున్నానని మణిశర్మ గారు చెప్పారు. నా ఫెవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ పాటలకు నేను డ్యాన్స్ చేయడం సంతోషంగా ఉంది. టెక్నీషియన్లు, ఆర్టిస్టులు అందరూ మనసు పెట్టి పని చేశారు.
సినిమాలో ప్రతి క్యారెక్టర్ కీలకమే. నేను ఈ సినిమా చేయడం లక్కీగా ఫీలవుతున్నా. నా సినిమాలు ఆడినా, ఆడకపోయినా ప్రేక్షకులు నాపై ప్రేమ, అభిమానం చూపిస్తున్నారు. ప్రతి సినిమాకు కష్టపడుతున్నా. ఈ సినిమాకు రిలాక్స్ కావచ్చు. ఇంతకు ముందు మిస్ అయినవి వడ్డీతో కలిపి రావచ్చు. నిజాయతీగా కొత్త సినిమా తీశాం. దీన్ని ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే… ఇటువంటి ప్రయోగాలు చేయడానికి మరింత ఉత్సహం వస్తుంది. సినిమాపై మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి 24వ రాత్రి ప్రీమియర్ షోలు వేస్తున్నాం. ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయండి. మరిన్ని బ్లాక్ బస్టర్స్ చేయడానికి ఇంకా కష్టపడతా” అని అన్నారు.
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ”బెన్నీ గారు సెన్సిబుల్ కథలు ఎంపిక చేస్తారని అందరూ చెప్పారు. నేను సెన్సిబుల్ కథ రాస్తే సరిపోదు. దాన్ని గుర్తించి, అర్థం చేసుకోవాలనే వ్యక్తి కావాలి. నేను ఈ కథను 7, 8 ఏళ్లుగా చాలా మంది నిర్మాతలకు చెప్పా. వాళ్ళందరూ ఏవేవో చూశారు. బెన్నీ గారికి చెప్పినప్పుడు కోర్ పాయింట్ అర్థం చేసుకున్నారు. నేను చాలా మంది హీరోలకు కూడా కథ చెప్పా. తమకు తగ్గట్టు మార్చమని అడిగారు. కార్తికేయకు కథ చెప్పినప్పుడు బెన్నీ గారిలా కథను అర్థం చేసుకున్నారు. కార్తికేయ లాంటి హీరో, బెన్నీ గారి లాంటి నిర్మాత దొరకడం అదృష్టం. మంచి టీమ్ కుదిరింది. మణిశర్మగారి సంగీతం, వినోద్ గారి సౌండ్ డిజైనింగ్ అద్భతం” అని అన్నారు.
‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ మల్లిడి మాట్లాడుతూ ”బెన్నీకి కంగ్రాట్స్ చెప్పాలి. ‘కలర్ ఫోటో’కి కొత్త కాన్సెప్ట్ నమ్మి, కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చారు. అలాగే, ఈ సినిమాకు కూడా కొత్త దర్శకుడిని లాంఛ్ చేస్తున్నారు. ‘బెదురులంక 2012’కు ‘కలర్ ఫోటో’ కంటే ఎక్కువ డబ్బులు, అవార్డులు రావాలి. కార్తికేయ, నేహా శెట్టి… ఇంకా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు.
హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ ”ప్రేక్షకులు అందరూ ‘డీజే టిల్లు’లో తెలంగాణ అమ్మాయి రాధికను చూశారు. ఇప్పుడు ‘బెదురులంక 2012’లో ఆంధ్ర అమ్మాయి చిత్రను చూడబోతున్నారు. నేను ఎగ్జైటెడ్ గా ఉన్నాను. మంచి సినిమాలో నేను భాగం అయినందుకు సంతోషంగా ఉంది. పల్లెటూరి అమ్మాయిగా నటించగలనా? లేదా? అని దర్శకుడు క్లాక్స్ సందేహించినా… నిర్మాత బెన్నీ గారు సజస్ట్ చేశారు. వాళ్ళిద్దరికీ థాంక్స్. మణిశర్మ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. కార్తికేయ ‘ఆర్ఎక్స్ 100’ 2018లో విడుదలైంది. స్నేహితులతో కలిసి వెళ్ళా. సినిమా నాకు బాగా నచ్చింది. అప్పుడు ఆ హీరోతో ‘బెదురులంక 2012’ చేస్తానని అనుకోలేదు. తను మంచి కో స్టార్, ఫ్రెండ్” అని అన్నారు.
చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ… ”హీరో కార్తికేయ చాలా ప్రొఫెషనల్. క్లాక్స్ కొత్త కథను చెప్పాడు. మంచి సినిమా చేశామనే సంతోషం ఉంది” అని అన్నారు.
‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ ”నేను ‘కలర్ ఫోటో’ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాక బెన్నీ అన్నకు నేరేషన్ ఇచ్చా. నాకు ఆయన సెన్సిబిలిటీస్ చాలా ఇష్టం. ఆయన ఇచ్చిన సజెషన్స్ చాలా హెల్ప్ అయ్యాయి. సీన్ చూసి ఆయన చిన్న స్మైల్ ఇస్తే బాగా వచ్చిందని అర్థం. ఆయన తర్వాత ఏం చేస్తారు? అని ఆలోచించా. ‘బెదురులంక 2012’ ఐడియా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఊహించిన దానికంటే ట్రైలర్ చాలా బావుంది. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. మణిశర్మ గారితో నేను షార్ట్ ఫిలింకి పని చేశా. ఏమీ లేని సన్నివేశాలకు అద్భుతంగా చేశారు. ఈ సినిమాకు ఏ స్థాయిలో సంగీతం అందించారో ఊహించగలను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని అన్నారు.
‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ ”బెన్నీకి గుడ్ లక్. అతనితో కలిసి ‘కలర్ ఫోటో’ ప్రొడ్యూస్ చేశా. తను ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్. కచ్చితంగా ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కార్తికేయ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో ప్రతి పాట నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది. బ్లాక్ బస్టర్ కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని అన్నారు.
‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు మాట్లాడుతూ ”డిఫరెంట్ కథలను ఎంపిక చేసుకుని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న బెన్నీ గారికి థాంక్స్. నేను, క్లాక్స్ 8 ఏళ్లుగా ఫ్రెండ్స్. ‘విరూపాక్ష’లో అతని ఇన్ పుట్స్ కూడా ఉన్నాయి. నాకు ఈ కథ నాలుగైదేళ్ళ క్రితం తెలుసు. క్లాక్స్ మంచి దర్శకుడు అవుతాడు. అతనికి చాలా క్లారిటీ ఉంది. కార్తికేయ, నేహా శెట్టి పెద్ద హిట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని అన్నారు.
ప్రముఖ నటులు ఎల్బీ శ్రీరామ్ మాట్లాడుతూ ”మంచి క్యారెక్టర్స్ కోసం ఏడాది గ్యాప్ తీసుకుందామని షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టాను. అక్కడ బిజీ అయిపోయా. ఇక్కడ నా స్నేహితులు వెళ్ళిపోయారు. ఆ సమయంలో దర్శకుడు క్లాక్స్ ఈ కథతో వచ్చారు. మంచి క్యారెక్టర్, పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. వెండితెరకు దూరం కాకూడదని మళ్ళీ క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టా” అని అన్నారు.
నటుడు అజయ్ ఘోష్ మాట్లాడుతూ ”కార్తికేయను చూస్తే నాకు ఇంగ్లీష్ హీరో గుర్తుకు వస్తాడు. ఆయన మంచి కథ ఎంపిక చేసుకున్నాడు. ఆయన నటనా భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సినిమా చేసేటప్పుడు నా ఆరోగ్యం అంత బాలేదు. నైట్ షూట్స్ కష్టం, రాత్రి 9 గంటల తర్వాత షూటింగ్స్ చేయలేనని అంటే… 8.45కి పంపించేవాడు. క్లాక్స్ ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. మనుషుల్లో బలహీనతలు, స్వార్థం, దిగజారుడు తనం సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేది ఆయన స్టైల్ లో ఈ సినిమాలో చూపించాడు. అద్భుతమైన కథ. ఇది ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్లలో చూడాల్సిన సినిమా. ఇందులో ముఖ్యమైన క్యారెక్టర్ చేశా” అని అన్నారు.