మనతెలంగాణ/హైదరాబాద్ : నేషనల్ లీగల్ సర్వీసెస్ అధారిటీ( ఎన్ ఎల్ ఎస్‌ఎ) సభ్యురాలిగా రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్ బీనా చింతలపూరి నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. చట్టంలో నిర్ధేశించిన విధంగా నియామకాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణను కేంద్ర ప్రభుత్వం సంప్రదించింది. జైళ్లు, ఖైదీలకు సంబంధించి సంస్కరణల కోసం విశిష్ట కృషి చేసి సత్పలితాలను సాధించిన ప్రొఫెసర్ బీనా చింతలపూరి నియామకానికి జస్టిస్ ఎన్‌వి రమణ సుముఖత వ్యక్తం చేశారు.
కాగా ఉస్మానియా యూనివర్శిటీలో సైకాలజీ ప్రొఫెసర్ గా పనిచేసిన బీనా చింతలపూరి జైలు నుంచి విడుదలైన ఖైదీల మనస్తత్వాలపై అనేక పరిశోధనలను చేయడమే కాకుండా, ఖైదీలు జనజీవన స్రవంతిలో కలిసేందుకు అనేక వర్క్ షాపులు నిర్వహించారు.ఈ నేపథ్యంలో చింతలపూరి బీనా వర్క్‌షాపులకు హాజరైన వేలాదిమంది ఖైదీలు మార్పుచెంది తమ జీవితాలను మార్చుకున్నారు. ఈక్రమంలో సీనియర్ న్యాయవాదులు మీనాక్షి అరోరా, కెవి. విశ్వనాధన్, సిద్ధార్ధ లూధ్రలతో పాటు సామాజిక కార్యకర్త ప్రతి ప్రవీణ్ పాట్కర్‌లను సైతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యులుగా నియామించారు. కాగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యురాలిగా తనకు అవకాశం కల్పించడంతో చొరవ చూపిన సిజె ఐ ఎన్వీ రమణకు బీనా చింతలపూరి ధన్యవాదాలు తెలిపారు.