న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సోమవారం రాత్రి ఒక మహిళా క్యాబ్ డ్రైవర్‌పై ఇద్దరు వ్యక్తులు బీర్ బాటిళ్లతో దాడి చేసి గాయపరిచారు. న్యూఢిల్లీలోని కశ్మీర్ గేట్ వద్ద ఉన్న అంతర్ రాష్ట్ర బస్సు టెర్మినస్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 9వ తేదీ రాత్రి కస్టమర్‌ను పికప్ చేసుకోవడానికి బస్సు టెర్మినస్ వైపు వెళుతుండగా కస్టమర్‌కు కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు తన కారుకు అడ్డుగా వచ్చారని ఢిల్లీలోని సమయ్‌పూర్ బద్లీ నివాసి అయిన క్యాబ్ డ్రైవర్ ప్రియాంక విలేకరులకు తెలిపారు.
పొగమంచు పడుతున్న కారణంగా తాను కారును నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నానని, కారుకు అడ్డుగా వచ్చిన ఆ ఆఇద్దరు వ్యక్తులు రాయితో దాడి చేశారని ఆమె చెప్పారు. రాయి దాడికి కారు ముందు అద్దం పగిలిపోయిందని, గాజు ముక్కలు తన మీద పడ్డాయని ఆమె చెప్పారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి తాను కిందకు దిగానని, ఆ ఇద్దరు వ్యక్తులు తన వద్దకు వచ్చి బీరు బాటిళ్లతో తనపై దాడి చేశారని ఆమె తెలిపారు. జేబులో ఉన్న నగదును తీసుకున్నారని, సెల్‌ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించగా తాను ప్రతిఘటించానని ఆమె చెప్పారు. తాను గట్టిగా కేకలు వేయగాదుండగులు పారిపోయారని ప్రియాంక తెలిపారు. తన మెడ, చేతులపై 10 కుట్లు పడ్డాయని ఆమె చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.