Wednesday, January 15, 2025

త్వరలో రూ.10 నుంచి రూ.20లు బీరు ధరలు పెరిగే అవకాశం

- Advertisement -
- Advertisement -

ధరల పెంపుపై ఈనెలాఖరులోగా స్పష్టత వచ్చే అవకాశం
కింగ్ ఫిషర్ బీర్ల నిల్వలను జాగ్రత్తగా వాడుకోవాలి
ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల సూచన
ఒక్క షాపునకే అన్ని కాటన్‌లు పంపించవద్దని ఆదేశం
ఈ నెలాఖరు వరకే కింగ్ ఫిషర్ బీర్ల నిల్వలు…
మిగతా బీర్ల బ్రాండ్లను మద్యం డిపోల్లో అందుబాటులో ఉంచాలని
ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల సూచన
మనతెలంగాణ/హైదరాబాద్:  కింగ్ ఫిషర్ బీర్ల కొరతను అధిగమించేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. అందులో భాగంగా మిగతా 5 బీర్ల కంపెనీలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే యూబీఎల్ (యునైటెడ్ బ్రేవరేస్ లిమిటెడ్) ఉత్పత్తి చేసే కింగ్‌ఫిషర్, కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్, కింగ్‌ఫిషర్ అల్ట్రా, కింగ్‌ఫిషర్ అల్ట్రా మ్యాక్స్‌లు మినహా మిగతా బీర్లను డిపోల్లో అందుబాటులో ఉంచాలని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు బ్రేవరేజెస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది.

దీంతోపాటు కింగ్ ఫిషర్ బీర్లు మరో 10 నుంచి 15 రోజులకు సరిపడా నిల్వలు ఉండడంతో వాటిని జాగ్రత్తగా మద్యం షాపులకు కేటాయించాలని, ఒక్క షాపుకే అన్ని కాటన్‌లను పంపించకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని షాపులకు వాటిని సరఫరా చేసే విధంగా చర్యలు చేనట్టాలని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సూచించినట్టుగా తెలిసింది. అంతలోపే ఈ సమస్య సద్దుమణిగే అవకాశం ఉండడంతో ఆ దిశగా చర్యలు చేపట్టాలని ఎక్సైజ్ భావిస్తోంది. కింగ్ ఫిషర్ బీర్లు సరఫరాను నిలిపివేస్తున్నట్లు 10 రోజుల క్రితమే యూబీఎల్ కంపెనీ ప్రకటించింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవటం, ధరలు పెంచాలన్న కంపెనీ నిర్ణయానికి ప్రభుత్వం అంగీకరించకపోవటంతో బీర్ల సరఫరాను ఆ కంపెనీ నిలిపివేసింది.
మంజీరానీటితో చేసే బీర్లకు భారీ డిమాండ్

అయితే, ఈ కంపెనీతో ప్రభుత్వం కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ధరల పెంపునకు సంబంధించి రూ.10 నుంచి రూ.20ల వరకు పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఆ దిశగా చర్చలు ఫలించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనరాష్ట్రంలో బీర్ల ధరలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కచ్చితంగా ధరలు పెంచాలని ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వంతో పేర్కొన్నట్టుగా సమాచారం. మిగతా రాష్ట్రాల్లో ఉన్న ధరల పట్టికను మన దగ్గర ఉన్న ధరల పట్టికలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ముందు ఉంచినట్టుగా తెలిసింది.

అయితే ధరల పెంపుపై కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అది ఈ నెలాఖరులోగా స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వీటితో పాటు మరికొన్ని కొత్త బీర్లు కూడా రాష్ట్రంలోకి తీసుకురావాలని ఎక్సైజ్ శాఖ భావిస్తున్నట్టుగా తెలిసింది. గత ప్రభుత్వంలోనూ కొత్త కంపెనీలకు అవకాశం ఇవ్వగా ప్రస్తుతం ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వాలని పలు కంపెనీలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్టుగా సమాచారం.

గత ప్రభుత్వంలో రూ.20లు పెంచి రూ.10లకు తగ్గించి….

గత ప్రభుత్వంలో రూ.20లు పెంచి రూ.10లను తగ్గించింది. 2019 నుంచి బీర్ల ధరలను ప్రభుత్వం పెంచలేదు. ఈ నేపథ్యంలోనే తమకు నష్టం వస్తుందని యూబీఎల్ కంపెనీ ప్రభుత్వంతో పేర్కొంది. దీంతోపాటు లేఖ కూడా రాసింది. అందులో భాగంగానే కింగ్‌ఫిషర్ బీర్ల ఉత్పత్తిని ఆపివేసింది. ప్రస్తుతం ఈ కంపెనీ సంగారెడ్డిలో ఉండగా మంజీరా నీటితో ఈ బీర్లను ఆ సంస్థ తయారు చేస్తోంది. మిగతా రాష్ట్రాల్లోనూ ఈ కంపెనీ కింగ్‌ఫిషర్ బీర్ల తయారీ కంపెనీలు ఉన్నా ఇక్కడి మంజీరా నీటితో తయారు చేసే బీర్లకు భారీగా డిమాండ్ ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఆరు కంపెనీలు…15 బ్రాండ్‌ల ఉత్పత్తి…

ప్రస్తుతం బీర్లను సరఫరా చేసే కంపెనీలు రాష్ట్రంలో ఆరు ఉండగా, ఆ కంపెనీలు 15 రకాల బీర్లను ఉత్పత్తి చేస్తుంటాయి. అందులో యూబీఎల్ (యునైటెడ్ బ్రేవరేస్ లిమిటెడ్) 75 శాతం వాటా కలిగి ఉండగా, మిగతా 5 కంపెనీలది 25 శాతం వాటా ఉంది. యూబీఎల్ కంపెనీ కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్, కింగ్‌ఫిషర్ అల్ట్రా, కింగ్‌ఫిషర్ అల్ట్రా మ్యాక్స్‌లను ఉత్పత్తి చేస్తుండగా, మిగతా 5 కంపెనీలు బడ్‌వైజర్, నాక్‌ఔట్, రాయల్ ఛాలెంజ్, కార్లస్బెర్గ్, హైవార్డ్, టుబర్గ్, కరోనా బీర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. నెలకు 40 లక్షల కేసుల బీర్లను ఎక్సైజ్ శాఖ ఆయా కంపెనీల నుంచి కొనుగోలు చేస్తోంది. మార్కెట్‌లో రూ.150లు బీరు ధర ఉంటే అందులో 80 శాతం ప్రభుత్వానికి, 20 శాతం డబ్బును ఆయా కంపెనీలకు ఎక్సైజ్ శాఖ చెల్లిస్తోంది. అమ్మిన 45 రోజుల తరువాత ప్రభుత్వం ఆయా కంపెనీలకు ఈ సొమ్మును చెల్లిస్తుంది.

గత ప్రభుత్వంలో యునైటెడ్ బ్రేవరేస్ లిమిటెడ్‌కు రూ.600 కోట్లు బకాయిలు పడగా, ఈ ప్రభుత్వంలో రూ.100 కోట్ల బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో 6 శాతంగా రెండుసార్లు బీర్ల ధరలను పెంచింది. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా 10 శాతం ధర పెంచాలని యూబీఎల్ డిమాండ్ చేస్తోంది. బీర్లకు అధిక డిమాండ్ ఉంటే కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వాటిని దిగుమతి చేసుకుంటారు.

రాష్ట్రంలో బీరు ప్రియులు ఇష్టపడే బ్రాండ్‌లలో ప్రధానంగా బడ్‌వైజర్, నాక్‌ఔట్, రాయల్ ఛాలెంజ్, కింగ్‌పిషర్, కార్లస్బెర్గ్, హైవార్డ్, టుబర్గ్, కరోనా తదితర రకాలు ఎక్కువ అమ్ముడు పోతుంటాయి. రాష్ట్రంలో రోజుకు రెండు లక్షలు మేర బీర్లు ఉత్పత్తి అవుతుంది. కానీ, డిమాండ్‌ను బట్టి ఇక్కడ ఉత్పత్తిని పెంచుకోవడం, బయట నుంచి దిగుమతి చేసుకోవడం లాంటి ముందస్తు చర్యలు అబ్కారీ శాఖ తీసుకుంటోంది. వేసవికాలంలో అయితే రాష్ట్రంలోని 17 మద్యం డిపోల్లో వాటి సామర్థ్యాన్ని బట్టి కనీసం రెండు లక్షల బీర్లకు తక్కువ లేకుండా 20 లక్షల బీర్ల వరకు ఎక్సైజ్ శాఖ నిల్వ చేసుకుంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News