Monday, December 23, 2024

రికార్డు స్థాయిలో బీర్ల విక్రయాలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటుగా బీర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత నెల ఏప్రిల్ 01వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కేవలం 17 రోజుల వ్యవధిలో ఏకంగా కోటి కాటన్ల బీర్లను మద్యం ప్రియులు తాగేయగా, ప్రస్తుతం మే 1వ తేదీ నుంచి 18వ తేదీల మధ్య రాష్ట్రంలో 4.23 కోట్ల బీరు సీసాలు అమ్ముడయ్యాయి. ఈ 18 రోజుల్లో బీర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 582.99 కోట్ల ఆదాయం రాగా, మరో రెండు వారాల్లో బీర్ల విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని, మే చివరి నాటికి బీర్ల విక్రయం రూ.1,000 కోట్లు దాటుతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

ఇక ఈ మద్యం అమ్మకాలను చూసుకుంటే మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌లే ముందంజలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాలో కలిపి ఏప్రిల్ 01వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 86,175 బీర్ల కేసులు అమ్ముడు కాగా, సగటున రోజుకు 6 లక్షల బీర్లు అమ్ముడుపోయాయి. ఏప్రిల్ 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో 1,94, 351 కేసుల బీర్లు, రంగారెడ్డిలో 5,59,746, మేడ్చల్ జిల్లాలో 92,078 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా ఎక్సైజ్ శాఖ ఏప్రిల్ నుంచి మద్యం దుకాణాల్లో బీర్ల కొరత రాకుండా చర్యలు చేపట్టింది.
18 రోజుల్లో 35,25,247 కాటన్ బీర్ల విక్రయాలు
అయితే గతనెల ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరగ్గా, ఈనెల ప్రారంభం నుంచి 18 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 19 డిపోల ద్వారా 35 లక్షల 25వేల 247 కాటన్ల బీర్ బాటిళ్లు అమ్ముడయ్యాయి. ఒక్కో కాటన్‌లో 12 బీర్ల చొప్పున సగటున రోజుకు 23,50,164 బీరు సీసాలు ఖాళీ అయ్యాయి. ఈ లెక్కన 18 రోజుల్లోనే 4,23,02,964 బీరు సీసాలను మద్యం ప్రియులు ఖాళీ చేశారు. ఈ 18 రోజుల్లో బీర్ల విక్రయాల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కరీంనగర్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లాలో రూ.48.14 కోట్ల విలువైన 3 లక్షల 364 కాటన్ల బీర్ల విక్రయాలు జరగడం గమనార్హం.
18 రోజులు…. రూ.904.47 కోట్ల ఆదాయం
మరో వైపు లిక్కర్ విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. ఈ జిల్లాలో 1,20,334 కాటన్ల లిక్కర్ సేల్ కాగా రూ. 78.42 కోట్ల ఆదాయం వచ్చింది. నల్గొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. మొత్తం ఈ 18 రోజుల్లో లిక్కర్ విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ. 904.47 కోట్ల ఆదాయం వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News