Monday, January 20, 2025

నగరంలో బెగ్గింగ్ మాఫియా ఆగడాలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. వృద్ధులతో నగరంలోని పలు సెంటర్లలో బెగ్గింగ్ చేయిస్తున్న ముఠా చిన్న పిల్లలపై కన్నెసింది. ఫుట్‌పాత్‌లపై నిద్రించేవారు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు వస్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుని పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు. దీని కోసం గంటల తరబడి రెక్కీ నిర్వహిస్తున్నారు. గతంలో సికింద్రాబాద్‌కు చెందిన ఓ బాలికను నిజామాబాద్‌కు చెందిన నిందితుడు కిడ్నాప్ చేసి తనతో తీసుకుని వెళ్లాడు. ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలిక కన్పించకపోవడంతో పరేషాన్ అయిన బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సిసిటివిల ఫుటేజ్‌ను పరిశీలించగా పాత నేరస్థుడిగా తేలింది. వెంటనే బాధితుడిని పట్టుకుని బాలికను రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. హుస్సేనీ ఆలంకు చెందిన సమ్రీన్ భిక్షమెత్తుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఈ క్రమంలోనే ఫరూక్‌నగర్‌కు చెందిన రఫియాసుల్తానా ఆస్పత్రిలో చూపించుకునేందుకు వెళ్లింది.

ఆమె కుమారుడు షేక్‌అబ్దుల్ వాహీబ్(4) ఆస్పత్రి ఎదుట మిగతా పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. కొద్ది సేపటి తర్వాత చూసేసరికి బాలుడు కన్పించలేదు. వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు సమ్రీన్‌ను అరెస్టు చేశారు. చిన్న పిల్లాడితో కలిసి భిక్షమెత్తుకుంటే ఎక్కువగా డబ్బులు వస్తాయని కిడ్నాప్ చేసినట్లు ఒప్పుకుంది. మరో కేసులో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న భిక్షమెత్తుకుంటున్న మహిళ రాత్రి సమయంలో తన కుమారుడితో కలిసి ఫుట్‌పాత్‌పై నిద్రించింది. అర్ధరాత్రి చూసేసరికి తన కుమారుడు కన్పించలేదు. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా ఒక మహిళ, పురుషుడు కలిసి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ఇద్దరు నిందితులు ఎంజిబిఎస్‌లో బస్సు ఎక్కి మహబూబ్‌నగర్ వైపు వెళ్లినట్లు గుర్తించి దర్యాప్తు చేశారు. వారిని గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేసి బాలుడిని తల్లికి అప్పగించారు.

తాజాగా జరిగిన సంఘటన మెదక్‌కు చెందిన వ్యక్తి తన కుమారుడు(మానసిక వికలాంగుడు)తో కలిసి తిరుపతి దైవ దర్శనానికి వెళ్లాడు. తన కుమారుడు ఆరోగ్యంగా ఉండాలని దేవుడికి మోక్కి వారం రోజులు అక్కడే ఉన్నాడు. తిరిగి వస్తుండగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తెల్లవారుజామున 5గంటలకు రైలు దిగాడు. మెదక్‌కు వెళ్లేందుకు రైళ్లు లేకపోవడంతో స్టేషన్‌లోనే ఉండిపోయాడు. అక్కడే బ్యాగు, కుమారుడితో పడుకున్నాడు, తెల్లవారిన తర్వాత 6గంటలకు టాయిలెట్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి బాలుడు, బ్యాగు కన్పించలేదు, దీంతో కంగారుపడిన బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ఓ మహిళ, పురుషుడు కలిసి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. ఇద్దరు బెగ్గింగ్ మాఫియాకు చెందిన వారుగా, బాలుడు మానసిక వికలాంగుడు కావడంతో బెగ్గెంగ్‌కు బాగా ఉపయోగపతాడని నిందితులు గుర్తించారు.

ఇద్దరు నిందితులు గంటల తరబడి రైల్వే స్టేషన్‌లో బాలుడి తండ్రిని గమనిస్తు ఉన్నారు. ఎప్పుడు అవకాశం చిక్కితే అప్పుడే బాలుడిని కిడ్నాప్ చేయవచ్చని సమయం కోసం వేచి చూశారు. ఈ క్రమంలోనే బాలుడి తండ్రి టాయిలెట్‌కు వెళ్లాగానే బ్యాగు, బాలుడిని తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దర్యాప్తు చేసిన పోలీసులు బ్యాగులో బాలుడి తండ్రి మొబైల్ ఫోన్ ఉండడంతో దాని సిగ్నల్స్ ఆధారంగా మాదాపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. బాలుడి కిడ్నాప్ విషయం మీడియాలో వైరల్ కావడంతో కిడ్నాపర్లు మాదాపూర్ ఫ్లైఓవర్ వద్ద ఉన్న చెట్లలో బాలుడిని వదిలేసి వెళ్లారు. పోలీసులు వెత్తుకుంటు వెళ్లి బాలుడిని గాంధీ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించి తల్లిదండ్రులకు అప్పగించారు.

డబ్బుల కోసం తెగింపు….
హైదరాబాద్‌లో భిక్షగాళ్లు లేకుండా చేసేందుకు ప్రభుత్వం గతంలోనే వారికి షెల్టర్లు ఏర్పాటు చేసి మూడు పూటలా భోజనం పెడుతున్నారు. రోడ్లు, జంక్షన్లపై బెగ్గింగ్ చేయకుండా చేశారు, కానీ ఇప్పుడు అసలైన్ భిక్షగాళ్లు లేకున్నా కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి పిల్లలు, పెద్దలతో బెగ్గింగ్ చేయిస్తున్నారు. వచ్చిన దాంట్లో వారికి రోజు రూ.500, రూ.1,000 ఇచ్చి మిగతా డబ్బులను ముఠా నాయకుడు తీసుకుంటున్నారు. ఇలా పిల్లలను కిడ్నాప్ చేసి బెగ్గింగ్ చేయించి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. చిన్న పిల్లలను చూసి చాలామంది ఎక్కువగా డబ్బులు వేస్తారని చెప్పి కిడ్నాప్‌లకు తెగిస్తున్నారు. అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న పిల్లలను వికలాంగులను చేసి మరీ బెగ్గింగ్ చేయిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News