పాక్షిక లాక్‌డౌన్…పూర్తి స్థాయి టెస్టులు
నిశ్శబ్దం అయిన రణగొణధ్వనుల నగరం
జనం కదలికలపై ఆరోగ్య నిఘా
బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్ ఇప్పుడు కరోనా ఉపజన్యువు ఒమిక్రాన్ ప్రభావంతో తిరిగి లాక్‌డౌన్లు, ఆంక్షల వలయంలోకి వెళ్లింది. ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు బీజింగ్ ఇప్పుడు సెమి లాక్‌డౌన్‌అయింది. బుధవారం పలు మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే లక్షణపు ఒమిక్రాన్ నుంచి రక్షణ దీని నిర్ధారణకు అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. రోజువారి టెస్టుల సంఖ్యను పెంచారు. బీజింగ్ , శివారు ప్రాంతాలలోని దాదాపు రెండు కోట్ల మందికి పైగా ప్రజలకు పెద్ద ఎత్తున వైరస్ నిర్థారణ పరీక్షలు ఇప్పటి ఒమిక్రాన్ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారని అధికారులు తెలిపారు. ఇప్పటికే మరో పెద్ద నగరం షాంఘైలో ఒమిక్రాన్ దెబ్బతో నెలరోజులకు పైగా జనజీవితం స్తంభించింది. బీజింగ్‌లో గడిచిన 24 గంటల్లో 53 వరకూ కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాజధాని పరిధిలో కరోనా కేసుల సంఖ్య 500కు చేరుకుంది.
ఈ పరిణామాన్ని లెక్కలోకి తీసుకుని ఇక్కడ విద్యాసంస్థలను మూసివేశారు. ఇతరత్రా పలు ఆంక్షలను తీసుకవచ్చి వైరస్ వ్యాప్తి నిరోధానికి చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం బీజింగ్‌లో 40కు పైగా సబ్‌వే స్టేషన్లను మూసివేశారు. పలు ప్రాంతాలలో మెట్రో రైలు సర్వీసులు నిలిపివేశారు. కిండర్‌గార్టెన్స్, ప్రైమరీ మిడిల్ క్లాసులు ఇతరత్రా విద్యాసంస్థలను తదుపరి ప్రకటనల వరకూ క్లోజ్ చేస్తున్నట్లు తెలిపిన అధికారులు పరీక్షలను వాయిదా వేశారు. రెండు మూడు వారాల వరకూ పరిస్థితిని గమనించి తరువాత ఓ నిర్ణయం తీసుకుంటారు. కొవిడ్ పరిస్థితిని బట్టి విద్యార్థులను అనుమతించేది ఆధారపడి ఉంటుంది. బీజింగ్ వదిలి వెళ్లాలనుకునే వారు తప్పనిసరిగా పలు కొవిడ్ పరీక్షల తరువాత జారీ చేసే సర్టిఫికెట్లు చూపాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టులు, ప్రధాన రైల్వేస్టేషన్ల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. వైరస్ లేదని నిర్థారణ అయిన తరువాతనే వారిని ప్రయాణాలకు అనుమతిస్తున్నారు.
రాదారి మార్గంలో దూర ప్రాంతాలకు వెళ్లే వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతనే బయటకు పంపిస్తున్నారు. బీజింగ్ లోపలికి రావాలన్నా బయటకు వెళ్లాలన్ని ఖచ్చితంగా అన్ని రకాల కట్టుబాట్లను పాటించాల్సిందే. సరైన గ్రీన్ హెల్త్ కోడ్‌ను పొందుపర్చలేని వారిని వెంటనే ఇంటికి లేదా చికిత్సలకు వారి వారి ఏరియాలలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. వచ్చే మూడురోజులలో నగరంలో ప్రతిరోజు యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తు ప్రజలకు వైరస్ పరీక్షలు జరుపుతారు. ఇందుకు సరైన ఏర్పాట్లు జరిగాయి. టెస్టుల కోసం నిర్ధేశిత చెకప్ కేంద్రాల వద్దకు జనం బారులు తీరి నిలబడుతున్నారు. ప్రజలు ఒమిక్రాన్ భయాలతో ఇళ్లకే పరిమితం కావడంతో ఇప్పుడు ఈరద్దీ రణగొణధ్వనుల బీజింగ్ ఇప్పుడు దాదాపు నిర్మానుష్యంగా మారింది.