Friday, November 22, 2024

విమానం హైజాక్ వ్యూహంతో జర్నలిస్టు అరెస్టు

- Advertisement -
- Advertisement -

Belarus forces diverts plane to arrest Journalist

బెలారస్: ప్రభుత్వ విధానాలను తూర్పార పట్టిన జర్నలిస్టు దేశం విడిచి పారిపోయినా ప్రభుత్వం ఊరుకోలేదు. అతను విమానంలో వెళ్తున్నాడని తెలిసిన వెంటనే చాకచక్యంగా యుద్ధ విమానాన్ని పంపింది. అతను ప్రయాణిస్తున్న విమానాన్ని తమ దేశానికి బలవంతంగా దారి మళ్లించి చివరికి అరెస్టు చేసింది. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్న జర్నలిస్టు అరెస్టు కోసం బెలారస్ ప్రభుత్వం అనుసరించిన వ్యూహంపై ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెలారస్‌లో గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో అక్రమంగా గెలిచారన్న ఆరోపణలపై భారీ ఎత్తున ప్రజాందోళనలు జరిగాయి. ఆ ఆందోళనల్లో నలుగురు చనిపోయారు. అయితే, ఆందోళనల వెనుక కొందరు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఉన్నారన్న అనుమానంతో అరెస్టులకు పాల్పడ్డారు. ఉగ్ర కార్యకలాపాల పేరుతో కొందరిపై అక్రమంగా కేసులు బనాయించారు. ఈ ఆందోళనల్లో కీలకమైన వ్యక్తిగా ఉన్న 26 ఏళ్ల జర్నలిస్టు రోమన్ ప్రొటాసెవిచ్ తోపాటు మరి కొందరు దేశం విడిచి పారిపోయారు. అప్పటి నుంచి ప్రొటా సెవిచ్ పోలాండ్‌లో ఉంటున్నాడు.

అయితే ఆదివారం ప్రొటాసెవిచ్ ఏథెన్స్ నుంచి విల్సియస్‌కు ర్యాన్ ఎయిర్ విమానంలో వెళ్తున్నాడని బెలారస్ ప్రభుత్వానికి తెలిసింది. ఆ విమానంపైకి బెలారస్ యుద్ధ విమానాన్ని పంపారు. ర్యాన్ ఎయిర్ విమానంలో బాంబు ఉందని వదంతి పుట్టించి బలవంతంగా విమానం దారి మళ్లించారు. బెలారస్ రాజధాని మింక్ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని దింపించారు. రోమన్‌ను అదుపులోకి తీసుకుని విమానాన్ని పంపించి వేశారు. విమానాన్ని బెలారస్ మళ్లిస్తున్నారని సిబ్బంది ప్రకటించగా సీట్లో కూర్చుని ఉన్న రోమన్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ దేశంలో తాను మరణశిక్ష ఎదుర్కొంటున్నానని చెబుతూ భయపడ్డాడని తోటి ప్రయాణికులు తెలిపారు. ఆ విమానంపైకి యుద్ధ విమానాన్ని పంపి దారి మళ్లించాలని అధ్యక్షుడు లుకా షెంకోవే ఆదేశించినట్టు బెలారస్ ప్రభుత్వం తమ టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రకటించడం గమనార్హం.
అంతర్జాతీయ సమాజం ఆగ్రహం
ఈ సంఘటనకు అమెరికాతోపాటు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. విమానంలోని 120మంది ప్రయాణికులను ప్రమాదంలో పెట్టి బెలారస్ అధ్యక్షుడు ప్రవర్తించిన తీరు దిగ్భ్రాంతి కరమని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా హైజాకింగ్, ఉగ్రవాద చర్యే అని పొలాండ్ ప్రధాని మండిపడ్డారు. లిధుమేనియా తదితర కొన్ని దేశాలు బెలారస్ గగనతలాన్ని నిషేధించాయి.

Belarus forces diverts plane to arrest Journalist

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News