Sunday, December 22, 2024

గొడవలకు అడ్డాలుగా బెల్ట్ షాపులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/బోనకల్ : నాలుగు రోజుల క్రితం ఓ యువకుడు మద్యం మత్తులో బోనకల్ మండల కేంద్రంలోని సినిమా హాలు సెంటర్‌లో రోడ్డుపై కర్రతో వీరంగం సృష్టించాడు. బెల్టుషాపు వద్ద జరిగిన ఈ ఘర్షణలో ఒక వ్యక్తిని తలపగుల గొట్టడంతో కొంతమంది ఆ యువకుడిని చెట్టుకు కట్టేసి కర్రలతో తీవ్రంగా కొట్టారు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్తితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. మండలంలోని అనేక గ్రామాలలో బెల్టు షాపుల వద్ద నిత్యం గొడవలు మామూలుగా మారాయి. దీంతో బెల్టు షాపులు గొడవలకు అడ్డాలుగా మారాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మద్యం షాపులను గ్రామానికి దూరంగా నిర్జన ప్రదేశంలో ఏర్పటు చేయాలని నిబందన విదించింది.

అమలులో దీనిని బాగానే అమలు చేస్తున్న మద్యం దుకాణాల యజమానులు బెల్టుషాపులను మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేయించి అధిక ధరకు మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. బోనకల్ మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుకు రెండువైపుల అర్దరాత్రి వరకు యదేచ్చగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. దీంతో మద్యం షాపులు అడ్డాగా ఘర్షణలు, గొడవలు, దాడులకు తెగబడటం మామూలైపోయింది. ఎంఆర్‌పీ ధర కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మకూడదని ఆబ్కారి చట్టం స్పష్టంగా చెబుతున్నా పట్టించుకొనే వారు లేకపోవటంతో మందుబాబులను నిలువునా దోచుకొంటున్నారు. ప్రస్తుతం వేసవిలో బీర్లకు మంచి డిమాండు ఉంది.

ఇదే అదనుగా బావించిన బెల్టు షాపులవారు బీరును ఎమ్మార్పీ రూ 160 ఉంటే రూ. 220కి పైగా విక్రయిస్తున్నారని బీరు ప్రియులు వాపోతున్నారు. అదేవిధంగా చిప్ లిక్కర్‌ను సైతం ఎమ్మార్పీ కంటే 30 రూపాయలు అధికంగా అమ్ముతున్నారు. అదేంటని అడిగితే ప్రధాన దుకాణాలలోనే ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్ముతున్నారని అందుకోసమే తాము ఎక్కువకు అమ్మాల్సి వస్తున్నదని బెల్ట్ షాపుల యజమానులు తెలిపారు. మండలానికి మంజూరైన నాలుగు ప్రధాన మద్యం దుకాణాల యజమానులు సిండికేట్ గా ఏర్పడి మద్యాన్ని ఎమ్మార్పీ కంటే ఎక్కువగా విక్రయిస్తున్నారని సమాచారం. మండలంలో ప్రతి గల్లీలో బెల్టు షాపులు ఉన్నాయి. ఏనాడు ఆబ్కారి శాఖాధికారులు మద్యం అమ్మకాలను పరిశీలించలేదని దీంతో మద్యం ధరలకు రెక్కలొచ్చాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బెల్టు షాపులను రద్దు చేయాలి
పేదలను పీల్చి పిప్పి చేస్తున్న బెల్టు షాపులను వెంటనే రద్దు చేయాలని సీపీఐ ఎంఎల్ పార్టీ వైరా సబ్ డివిజన్ కార్యదర్శి ముత్తారపు గిరి డిమాండుచేశారు. మద్యం మత్తులో ఉన్న దళిత యువకుడిని బోనకల్‌లో దారుణంగా కొట్టారని ఇటువంటి సంఘటనలు జరుగుకుండా ఉండాలంటే రోడ్డుపక్కన బెల్టు దుకాణాలను మూసివేయాలని అన్నారు. ఆబ్కారి శాఖాదికారులు స్పందించి ఎమ్మార్పి ధర కంటే ఎక్కువ అమ్మితే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News