న్యాయమూర్తుల్లో కొందరి పక్షపాత పోకడలను తట్టుకోలేక భారత్ రిపబ్లిక్ ఏర్పడిన 11 ఏండ్లకే 1961లోనే ఒక ముఖ్యమంత్రి స్వయంగా ప్రధాన మంత్రికి, కేంద్ర హోం మంత్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. 1960 తొలి సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ఉన్నారు. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ చంద్రారెడ్డి, న్యాయమూర్తులుగా జస్టిస్ జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ సత్యనారాయణ రాజు ఉండేవారు. న్యాయమూర్తుల నియామకాల్లో, తీర్పులలో యువ న్యాయవాదులను ప్రోత్సాహించడం లో వీరు ఏమాత్రం తడుముకోకుండా కుల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీంతో 1961 నవంబర్ 4వ తేదీనాడు ఈ ముగ్గురు న్యాయమూర్తులపై ప్రధాని నెహ్రూకు, హోం మంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి పి సిన్హా లకు సిఎం సంజీవయ్య లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పాలగాని చంద్రారెడ్డి కులతత్వవాది. నియామకాల విషయంలో ఆయన కులపక్షపాతం చూపుతున్నారు. తన తీర్పుల్లో కూడా పరోక్షంగా వివక్ష పాటిస్తున్నారు. కొన్ని కొన్ని కేసులను తనకు నచ్చిన న్యాయమూర్తులకు కేటాయిస్తూ కొన్ని కులాలవారికే అనుకూలంగా తీర్పు వచ్చేలా కూడా వ్యవహరిస్తున్నారని, తన కులానికి చెందిన కొందరు న్యాయవాదులను బాహాటంగా ప్రోత్సహిస్తున్నారని సంజీవయ్య తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇది ఇతర న్యాయవాదులలో తీవ్ర ఆవేదన కలిగిస్తున్నదని తెలిపారు. న్యాయ వ్యవస్థలో ఉన్నత స్థానంలో ఉండే వారే కొన్ని కులాలకు, వర్గాలకు లబ్ధి చేకూరుస్తూ పోతే ఈ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం ఎలా నిలుస్తుందని ప్రశ్నించారు. జస్టిస్ చంద్రారెడ్డితో పాటు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ సత్యనారాయణ రాజు కూడా కుల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జస్టిస్ చంద్రారెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుండి మరొక చోటకు వెంటనే బదిలీ చేయాలని లేకపోతే న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ ఘోరంగా దెబ్బ తింటుందని వ్రాశారు. వీరి ప్రవర్తన వల్ల హైకోర్టుకు రాజకీయాలు ప్రాకి కులాలవారీగా గ్రూపులు ఏర్పడ్డాయి. వైషమ్యాలు పెరుగుతున్నాయి. జస్టిస్ చంద్రారెడ్డిని బదిలీ చేయటం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అని తెలిపారు. పెద్దలైన మీరు ఈ ముగ్గురిపై చర్యలు తీసుకుని మా రాష్ట్రాన్ని ప్రజలను కాపాడండి’ అని ప్రధానమంత్రి నెహ్రూ, హోం మంత్రి శాస్త్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిపి సిన్హా లను తన ఫిర్యాదులో అభ్యర్థించారంటే ముఖ్యమంత్రి సంజీవయ్య ఎంత వేదన చెంది ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956 నుండి 1980 వరకు అనగా 24 ఏండ్ల కాలంలో 12 ఏండ్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఒక్క సామాజిక వర్గం వారే ఉన్నారు. మిగతా కాలంలో ఒకటి రెండు ఇతర అగ్రవర్ణాల పాత్ర నడిచింది. 70% పైగా హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఆ ఒక్క సామాజికవర్గం వారే. 1969 -71 మధ్యకాలంలో ఏడాదిన్నర పాటు మాత్రం బిసి కులానికి చెందిన జస్టిస్ కుమరయ్య ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఇక 1974 నుండి 1985 వరకు ఎస్‌సి సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఇదే సమయంలో అనగా 1974 లో బిసి కులానికి చెందిన పుంజాల శివశంకర్ అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
కానీ అప్పటికి రెండేళ్లుగా న్యాయమూర్తి పదవికి ఆయన పేరు సిఫారసు కావటం చిన్న వయసు అనే సాకుతో ముందే చెప్పిన గుత్త పెత్తందార్ల కుల వివక్ష కారణంగా ఆయనకు ఆ పదవి దక్కకపోవడం జరుగుతూ వస్తున్నది. మూడోసారి జస్టిస్ ఓబుల్ రెడ్డి పట్టుపట్టి మళ్ళీ శివశంకర్ పేరును మొదటగా పేర్కొంటూ నాలుగు పేర్లను సిఫారసు చేస్తే అదే కుల వివక్ష కాటుకు ఆయన పేరు నాలుగో స్థానానికి దిగజారింది. అది కూడా అదనపు న్యాయమూర్తిగా. ఈ పదవి చేపట్టడానికి ఆయన విముఖత వ్యక్తం చేస్తే మళ్ళీ ఓబుల్ రెడ్డి గారే పట్టుపట్టి శివశంకర్ చే పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. అప్పటికి ఆయన వయసు 44 ఏండ్లు. కానీ రేపటితో ఏడాది పూర్తయి పూర్తి స్థాయి న్యాయమూర్తిగా ఉత్తర్వులు అందుకోనున్న సమయాన తన అదనపు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు.
ఇలా హైకోర్టు న్యాయమూర్తి పదవి వద్దని రాజీనామా చేసిన తొలి వ్యక్తిగా శివశంకర్ నిలిచారు. ఇంత అనుభవాన్ని మూటకట్టుకున్న శివశంకర్ కేంద్ర న్యాయశాఖ మంత్రి అయ్యాక ప్రతిభ సామర్థాలు ఉండి కుల పక్షపాతం కారణంగా ఉన్నత స్థానాలు అందుకోలేకపోయిన బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు న్యాయమూర్తులకు, న్యాయవాదులకు బాసటగా, వెన్నుదన్నుగా నిలిచారు. న్యాయ వ్యవస్థలో తీవ్ర సంస్కరణలు తెచ్చారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రిగా శివశంకర్ బాధ్యతలు చేపట్టిన 1980 నాటికి దేశంలోని వివిధ హైకోర్టులలో న్యాయమూర్తుల సంఖ్య దాదాపు 400. వీళ్ళలో ఎస్‌సిలు ఆరుగురు. ఎస్‌టిలు లేరు. ఇతర వెనుకబడిన తరగతులవారు వేళ్లపై లెక్కించదగిన సంఖ్యలో మాత్రమే ఉన్నారు. ఇది ధర్మమూ రాజ్యాంగబద్ధ్దమూ కాదని భావించిన శివశంకర్ దీనికి పరిష్కారం ఈ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం ఒక్కటే మార్గమని కేంద్ర న్యాయశాఖ మంత్రిగా నిర్ణయించారు. ఆ మార్పుల్లో (1) ఏ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్న వ్యక్తికైనా ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కలిగితే ఆ వ్యక్తి ఆ రాష్ట్రంలో తప్ప ఏ ఇతర రాష్ట్రానికైనా ప్రధాన న్యాయమూర్తిగా వెళ్ళాలి. (2) ఏ హైకోర్టులోనైనా సరే మూడో వంతు మంది న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు చెందినవారై ఉండాలి. వీటి వల్ల ఇతర రాష్ట్రాల న్యాయమూర్తులకు తాము పని చేయాల్సిన రాష్ట్రంలోని కుల వ్యవస్థతో పరిచయం గాని, అవగాహన గాని ఉండదు.
దాంతో వారు ఆయా రాష్ట్రాల అగ్రవర్ణ లాబీల్లో పాల్గొనరు. ఫలితంగా ఆ రాష్ట్రాల న్యాయమూర్తుల ఎంపికలో, వారిచ్చే తీర్పుల్లో కుల వివక్షకు, పక్షపాతానికి అవకాశం ఉండదు. ఏ హైకోర్టు న్యాయమూర్తి కూడా స్వంత రాష్ట్రంలో ప్రధాన న్యాయమూర్తిగా నియామకం పొందడు. దీని వల్ల కులాల ఆధిపత్య జాడ్యం నుండి న్యాయ వ్యవస్థకు విముక్తి లభించింది. ఈ సంస్కరణలు బిసి, ఎస్‌సి, ఎస్‌టి న్యాయవాదులకు ఎంతో ఊరట నిచ్చాయి. న్యాయమూర్తులుగా వారి నియామక సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ సంస్కరణల పై ఈశాన్య రాష్ట్రాల సిఎం లు మినహా అన్ని రాష్ట్రాల సిఎం లకు న్యాయశాఖ మంత్రి శివశంకర్ 1981 మార్చి 18 న లేఖలు వ్రాసి వాటి ప్రతులను ఆయా రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులకు పంపారు. ఈ లేఖపై నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ (నేటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తండ్రి) అభ్యంతరం తెలిపారు. దీంతో శివశంకర్ ‘కుల దురభిమానం, పక్షపాత వైఖరి పెరిగిపోతున్న న్యాయ వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాలని తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అవరోధాలు సృష్టిస్తున్నారు’ అని బాహాటంగానే అన్నారు.
ఎ జి నూరాని అనే న్యాయ నిపుణుడు ఈ సంస్కరణలు రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. కాగా ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అభ్యంతరంతో ఆ లేఖ సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం ముందుకెళ్ళింది. ఆ ధర్మాసనానికి జస్టిస్ పిఎన్ భగవతి అధ్యక్షత వహించారు. 1981 జులై 20న విచారణ మొదలై అదే ఏడాది డిసెంబర్ 30న తీర్పు వచ్చింది. తీర్పులో 4 -3 తేడాతో ‘కేంద్ర న్యాయ శాఖ మంత్రి విడుదల చేసిన లేఖ సరైనదే. కొత్తగా నియమితులయ్యే జడ్జీలకు సంబంధించిన విషయం కనుక ఆ లేఖలో ఏ తప్పూ లేదు’ అని స్పష్టంగా తెలిపారు. ఇంకొంచెం గతంలోకి వెళ్లి చూస్తే అసలు హైకోర్టు న్యాయమూర్తులుగా ఏ వ్యక్తీ సొంత రాష్ట్రంలో కాక ఇతర రాష్ట్రాలలోనే పని చేయాలనే ప్రతిపాదనను 1958 లోనే తొలి లా కమిషన్ సిఫారసు చేసింది.
ఆ కమిషన్ చైర్మన్ న్యాయ శాస్త్రాన్ని కాచివడబోసిన వానిగా ప్రతిష్ఠ ఉన్న మోతిలాల్ చమన్ లాల్ సెతల్వాద్. న్యాయకోవిదులైన పాల్కివాలా, చాగ్లా సభ్యులు. ఇక 1980లో తెచ్చిన సంస్కరణల ఫలితంగా అప్పటి వరకు తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఎస్‌సి వర్గానికి చెందిన జస్టిస్ అప్పాజీ వరదరాజన్ 1980లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. సుప్రీంలో మొదటి ఎస్‌సి న్యాయమూర్తి ఇతనే. అలాగే కేరళకు చెందిన 40 ఏళ్ల వయసున్న చురుకైన న్యాయవాది కెజి బాలకృష్ణన్ 198 లో ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావటంలో శివశంకర్ సహాయపడ్డారు. ఆ తరువాత బాలకృష్ణన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగి ఆ పదవిలో మూడేళ్లు పని చేసి 2010 మే లో పదవీ విరమణ చేశారు.
న్యాయ వ్యవస్థలో ఈ స్థాయికి చేరుకున్న తొలి ఎస్‌సి ఇతనే. మళ్ళీ అదే ఏడాది జూన్‌లో ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అయ్యారు. ఇక అత్యంత బలహీన వర్గాలకు చెందిన బి సి రే 1985లో, కె రామస్వామి 1989లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులయ్యారు. ఇక వెనుకబడిన తరగతులకు చెందిన తమిళనాడు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రత్నవేల్ పాండ్యన్, అసోంకు చెందిన కె ఎన్ సైకియా ఒకే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్‌వారు ప్రచురించిన ‘భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు (1950-1989)‘ అనే పుస్తకంలో 1980-89 మధ్యకాలంలో షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన వర్గాలు సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యాన్ని సాధించాయి.
ఇందుకు కారణం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పని చేసిన పి శివశంకర్ ప్రభావం. మంత్రి పదవి నుండి దిగిపోయాక కూడా న్యాయమూర్తుల నియామకాల్లో ఆయన తన ప్రభావాన్ని చూపిస్తూనే వచ్చారు అని పుస్తక రచయిత జార్జ్ గ్యాడ్ బోయ్స్ జూనియర్ వ్రాశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా శివశంకర్ తీసుకొచ్చిన సంస్కరణలు న్యాయవ్యవస్థలో కుల పక్షపాతం తగ్గుదలకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గీయలు న్యాయమూర్తులు కావటానికి ఎంతగానో దోహదపడ్డాయి. అప్పటి వరకు నియామకాల్లో పదోన్నతుల్లో ఆ వర్గాలకు మూసుకుని ఉన్న తలుపులు సంస్కరణల వల్ల తెరుచుకున్నాయి. ఒకసారి కొందరు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు ఒకేసారి ఒక ఇంటర్వూలో ‘కుల పక్షపాతం దేశమంతా వ్యాపించి ఉన్న రుగ్మత. ఇది ఒక్క న్యాయ వ్యవస్థకే పరిమితం కాదు కాబట్టి ఈ రుగ్మతకు మూలమైన సమస్యను తొలగించటానికి ప్రభుత్వమే పూనుకోవాలి’ అని చెప్పారు. అంటే న్యాయ వ్యవస్థను ఈ కుల జాడ్యం అంటిపెట్టుకుని ఉన్నదని పరోక్షంగా అంగీకరించటమే కదా.
కెఎస్‌ఎన్ ప్రసాద్
9492522089