Saturday, November 9, 2024

మరో 2500 అడుగులేయి చాలు..

- Advertisement -
- Advertisement -

లండన్ : మనిషి పరిపూర్ణ ఆరోగ్యానికి నడకను మించిన దివ్యౌషధం లేదని బ్రిటన్‌కు చెందిన యుకె బయోబ్యాంక్ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పుడు మీరు సాగిస్తున్న నడకకు అదనంగా 2500 అడుగులు జతచేసి నడవండని, దీనితో మనిషికి కావాల్సిన శారీరక వ్యాయామం సంపూర్ణం అవుతుందని తేల్చారు. ఇటీవలి కాలంలో పెరుగుతున్న స్థూలకాయ సంబంధిత కాలేయ సమస్యలు ఇతరత్రా జబ్బులకు నడకే నాలుగు విధాలుగా మేలు అని స్పష్టం చేశారు. తీవ్రస్థాయి జబ్బులకు మందులు మాకులు, ఆపరేషన్లు , సుదీర్ఘ చికిత్సలు అవసరం లేదని, పైగా అసలు ముందుగానే జబ్బులు కొనితెచ్చుకోకుండా ఉండాలంటే ముందు నడక ఆరంభించి క్రమేపీ నడక పెంచాలని సూచించారు. శారీరక వ్యాయామం పెరిగితే కాలేయ సమస్యలు రాకుండా ఉంటాయి.

నాన్ ఆల్కహాలిక్ ఫాటీ లివర్ వ్యాధులు ( ఎన్‌ఎఎఫ్‌ఎల్‌డి) లేదా కాలేయ జబ్బులు రాకుండా చూసుకోవచ్చునని తేల్చారు. ఇటీవలి యాంత్రికతతో మనిషిలో నడక దాదాపుగా ఆగిపోతోంది. అయితే అదనంగా అడుగులు పడితే దాదాపుగా సగానికి సగం వరకూ కాలేయ ఇతరత్రా జబ్బులు రాకుండా ఉంటాయని అధ్యయనంలో తెలిపారు. అదే విధంగా గుండె, మెదడు, ఊపిరితిత్తులు కూడా సవ్యంగా పనిచేస్తాయి. దీనితో నడకతో కేవలం కాలేయ సమస్యలే కాకుండా హృద్రోగ మరణాలు, బ్రెయిన్ స్ట్రోక్స్, ఊపిరితిత్తుల వ్యాధులు నివారించుకోవచ్చు. ఈ విధంగా మనిషి తనకు తానే డాక్టరు అయి, రోగాలు దరిచేరకుండా చూసుకోవచ్చునని తేల్చారు. ఇప్పుడు పడే అడుగులకు మరో 2500 అడుగులు కలిపి పడితే కాలేయం నిక్షేపంగా ఉంటుందని తెలిపారు.

నడక బాగుంటే ఇప్పుడు తలెత్తుతున్న కాలేయ వ్యాధులలో ఏకంగా 44 శాతం వరకూ తగ్గుదల ఉంటుందని యుకె బయోబ్యాంక్ విశ్లేషణలో వెల్లడైంది. బ్రిటన్‌లో దాదాపు లక్ష మంది నడక అలవాట్లు పరిశీలించుకుని ఈ అధ్యయనం సాగింది. అయితే ఇది విశ్వజనీన పరిణామం అని, నడకతో కేవలం ముందుకు పోవడమే కాదు నవ్వుతూ జీవితంలో ముందుకు సాగవచ్చునని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News