Saturday, November 16, 2024

అమిత్ షా కీలుబొమ్మలా ఇసి వేషాలు: మమత

- Advertisement -
- Advertisement -

అమిత్ షా కీలుబొమ్మలా ఇసి వేషాలు: మండిపడ్డ టిఎంసి అధినేత్రి మమత
బెంగాల్‌లో రెండో దశ ఘర్షణాత్మకం, రికార్డు స్థాయిలో 80శాతం పోలింగ్

కొల్‌కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్‌లో రెండో విడత పోలింగ్ దశలో గురువారం బిజెపి కిరాయి గూండాలు భయానక పరిస్థితిని కల్పించారని టిఎంసి అధినేత్రి, సిఎం మమత బెనర్జీ విమర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం బిజెపి చేతిలో పావుగా మారి వ్యవహరించిందని మమత బెనర్జీ మరింత తీవ్రస్థాయిలో తలపడ్డారు. బిజెపి ఆగడాలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం నిమ్మకునీరెత్తినట్లుగా ఉందని, గురువారం నాటి పోలింగ్ ఇందుకు అద్దం పట్టిందని ఆమె మండిపడ్డారు. రెండో దశ పోలింగ్‌లో మమత పోటీ చేస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గం కూడా ఉండటంతో ఈ పోలింగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ఇక్కడ టిఎంసి మాజీ లెఫ్టినెంట్, ఇప్పుడు బిజెపి నేత అయిన సువేందు అధికారి మమతతో ఢీకొన్నారు. పలు విడతల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో రెండో దశ పోలింగ్‌లో అక్కడక్కడ చెదరుమదరు హింసాత్మక ఘటనలు జరిగాయి. వివిధ నియోజకవర్గాలలో ప్రత్యర్థి వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నందిగ్రామ్‌లో కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ ఉదయమే ఎన్నికల సంఘానికి ఒకటి కాదు రెండు కాదు 63 ఫిర్యాదులు చేశామని కోపోద్రిక్తురాలైన మమత తెలిపారు. అయితే ఎన్నికల సంఘం ఏ విధంగా కూడా స్పందించలేదన్నారు.

దీనిపై తాము న్యాయస్థానానికి వెళ్లుతామన్నారు. బూత్‌ల స్వాధీనం, బోయల్‌లో భారీ స్థాయిలో బోగస్ ఓట్లు పడటం వంటి పరిణామాలు జరిగాయని మమత తెలిపారు. అక్రమాలు, బెదిరింపుల మధ్య ఎన్నికల నిర్వహణ ఏం పద్ధతి? దీనిని తాము ఆమోదించేది లేదన్నారు. ఎన్నికల సంఘం ఇప్పుడు హోం మంత్రి అమిత్ షా చేతిలో కీలుబొమ్మగా మారిందని, ఆయన చెప్పినట్లు చేస్తున్నారని విమర్శించారు. బోయల్‌లోని బూత్ నెంబర్ 7 వెలుపల మమత తమ బృందంతో భైఠాయించినప్పుడు విలేకరులతో మాట్లాడారు. పలువురు ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు వేయలేకపొయ్యారని స్థానిక టిఎంసి కార్యకర్తలు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గూండాలు గొడవలకు దిగుతున్నారని, ఇదేం తీరు అని మమత ప్రశ్నించారు. రెండో దశలో గురువారం పూర్బా, పశ్చిమ మేధినిపూర్ జిల్లాల్లో 9 చొప్పున, బంకూరాలో 8, సౌత్ 24 పరగణా జిల్లాలో నాలుగు స్థానాలకు పోలింగ్ జరిగింది. పశ్చిమ బెంగాల్‌లో గురువారం హింసాత్మక ఘటనల నడుమ రెండో విడత పోలింగ్ జరిగింది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్‌లో సాయంత్రం ఆరుగంటల వరకూ రికార్డు స్థాయిలో 80 శాతానికి పైగా ఓటింగ్ జరిగింది.
గవర్నర్‌కు, ఇసికి మమత ఫోన్
నందిగ్రామ్ ఇతర ప్రాంతాలలో రిగ్గింగ్ జరుగుతోందని రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌కు సిఎం మమత బెనర్జీ ఫోన్‌లో తెలిపారు. పరిస్థితి దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సిఎం వ్యక్తం చేసిన విషయాలను తాము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆ తరువాత గవర్నర్ కార్యాలయం ట్వీటు వెలువరించింది. సిఎం తెలియచేసిన అంశాలపై తగు విధంగా స్పందించినట్లు, ఎవరైనా చట్టానికి అనుగుణంగా నడుచుకునేలా చేస్తామని తాము హామీ ఇచ్చినట్లు గవర్నర్ తెలిపారు. అంతా సముచిత స్ఫూర్తితో చిత్తశుద్థితో వ్యవహరిస్తారని తాను ఆశిస్తున్నట్లు, ప్రజాస్వామ్యం విలసిల్లేలా పాటుపడాలని కోరుతున్నట్లు గవర్నర్ తెలిపారు. గవర్నర్‌కు ఎన్నికల సంఘం సీనియర్ అధికారికి మమత ఫోన్ చేసి పరిస్థితిని తెలిపారు. టిఎంసి మద్దతుదార్లు ఓట్లు వేయకుండా బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారని వారికి వివరించారు. ఎన్నికల సంఘం పరిశీలకుడితో తాను విడిగా మాట్లాడినట్లు మమత చెప్పారు. వారితో ఏమేమీ మాట్లాడిందీ తాను పూర్తి స్థాయిలో చెప్పలేనన్నారు.
పోలింగ్ బూత్ వద్ద మమత ధర్నా
నందిగ్రామ్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బోయల్ గ్రామంలో పోలింగ్ దశలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నందిగ్రామ్‌లో పూర్తి స్థాయి నిషేధాజ్ఞలు అమలులో ఉన్నా హింసాత్మక ఘటనలు జరిగాయి. బోయల్‌లో టిఎంసి మద్దతుదార్లపై దౌర్జన్యాల గురించి తెలియగానే మమత బెనర్జీ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.అక్కడ ఆమెకు బిజెపి కార్యకర్తలు జైశ్రీరాం నినాదాలతో తమదైన రీతిలో స్వాగతం పలికారు. తమను బెదిరిస్తున్నారని టిఎంసి కార్యకర్తలు ఆరోపించారు. దీనిని బిజెపి ఖండించింది. పరాజయం తప్పదనే ఈ విధంగా తప్పుడు ఫిర్యాదులకు దిగుతూ,మమత బెనర్జీ బూత్ నెంబర్ 7 ఎదుట ధర్నాతో డ్రామాకు దిగారని రాష్ట్ర బిజెపి అధ్యక్షులు దిలీప్ ఘోష్ విమర్శించారు. ఆమె ఓటమిని ముందుగానే అంగీకరించినట్లు ఉందన్నారు. గ్రామంలోని బూత్ నెంబర్ 7లో రీపోలింగ్‌కు టిఎంసి డిమాండ్ చేయడం హాస్యాస్పదం అన్నారు. ఈ ప్రాంతంలో పరిస్థితి చేజారిపోకుండా ఉండేందుకు పోలీసు, ఆర్‌ఎఎఫ్ బలగాలు హుటాహుటిన చేరాయి.
సిఆర్‌పిఎఫ్ బలగాలతో అధికారి పర్యటన
నందిగ్రామ్ నియోజకవర్గంలో పలు చోట్ల బిజెపి అభ్యర్థి సువేందు అధికారి, టిఎంసి నేత మమత బెనర్జీ పరిస్థితిని తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వారి వెంబడి అనుచరులు కూడా ఉండటంతో పలు చోట్ల నిషేధాజ్ఞలు బేఖాతరు అయ్యాయి. నందిగ్రామ్ బ్లాక్ 1లో నిరసనకారులు రోడ్డును దిగ్బంధం చేశారు. కేంద్ర బలగాలు తమను ఓటు వేయకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. సువేందు అధికారి వెంబడి ఉంటున్న సిఆర్‌పిఎఫ్ సిబ్బంది తాము ముందుకు వెళ్లకుండా బెదిరిస్తున్నారని తెలిపారు. సువేందు కారుపై రాళ్లు పడ్డ ఘటనలు జరిగాయి. టకాపురా, సతెన్‌గబరి ప్రాంతాలలో సువేందు కారును టిఎంసి కార్యకర్తలు చుట్టుముట్టారు. ఓ చోట ఆయన కారుపై రాళ్లు విసిరారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలకు దిగారు. వారిని భద్రతా బలగాలు చెదరగొట్టాయి. టిఎంసి గూండాలు నిరసనలకు దిగుతున్నారని , వారు మమత బేగం శిష్యులని , ఎన్నికల ఫలితాలు వచ్చే మే 2వరకూ వారు ఏమైనా చేసుకోవచ్చునని సువేందు మార్గమధ్యంలో విలేకరులతో చెప్పారు. టిఎంసి తాటాకు చప్పుళ్లు తనకు కొత్త కాదన్నారు. కేశ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి తన్మయ్ ఘోష్ వాహనంపై దాడి జరిగింది. కొందరిని అరెస్టు చేశారు.
ఫిర్యాదులపై పరిశీలన ః ఇసి
నందిగ్రామ్‌లో ఎన్నికల తీరుపై ఫిర్యాదులు అందాయని ఎన్నికల సంఘం నిర్థారించింది. వీటిపై తాము పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇక మధ్యాహ్నం 1 గంట వరకూ మొత్తం 30 స్థానాలలో సగటున చూస్తే 58 శాతం పోలింగ్ జరిగిందని ప్రకటించారు. తరువాత సాయంత్రంఆరుగంటలకు పోలింగ్ వివరాలను అందించారు. దీని మేరకు మొత్తం మీద దాదాపు 81 శాతం వరకూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా బంకూరాలో 82.78 శాతం, పశ్చిమ మేధినిపూర్‌లో 78 శాతం, పూర్బ మేధ్నిపూర్‌లో 81.23 శాతం, సౌత్ పరగణా జిల్లాలో 79.66 శాతం పోలింగ్ జరిగింది. ఇక సిఎం మమత, బిజెపి అభ్యర్థి సువేందు తలపడుతున్న నందిగ్రామ్‌లో 80.79 శాతం పోలింగ్ రికార్డు అయిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

Bengal 2nd Phase poll: Mamata Banerjee slams EC

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News