కేంద్ర సంస్థల దుర్వినియోగం అనుచితం
బెంగాల్ అసెంబీలో తీర్మానం ఆమోదం
మోడీ ప్రమేయం లేదన్న మమత
కొందరు బిజెపి నేతలతోనే ఇదంతా
కోల్‌కతా : కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం జరుగుతోందని పేర్కొంటూ, ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఓ తీర్మానం ఆమోదించింది. కేంద్రంలోని ఇప్పటి ప్రభుత్వం నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తోంది. దర్యాప్తు సంస్థల దూకుడు కన్పిస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్నామని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని బిజెపి వ్యతిరేకించింది. తరువాత జరిగిన ఓటింగ్‌లో తీర్మానం ఆమోదం పొందింది. తీర్మానంపై ముఖ్యమంత్రి మమత బెనర్జీ మాట్లాడుతూ ఈ తీర్మానం ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదని అయితే పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోన్న కేంద్ర దర్యాప్తు సంస్థల తీరును ఎండగట్టేందుకు దీనిని తీసుకువచ్చామని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుత వివాదాస్పద అంశంపై స్పందించాల్సి ఉందని , కేంద్ర ప్రభుత్వ అజెండా, అధికార పార్టీ అయిన బిజెపి ప్రయోజనాలు రెండూ మిళితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థల ఆగడాలకు ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యులని తాము భావించడం లేదని , అయితే బిజెపి నేతలలో ఓ వర్గం తమ స్వార్థ చింతనతో వీటిని దుర్వినియోగపరుస్తున్నాయని అనుకోవల్సి వస్తోందని మమత వ్యాఖ్యానించారు. సభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీర్మానాన్ని వ్యతిరేకించారు. సిబిఐ లేదా ఇడి వంటి సంస్థలపై తీర్మానం తీసుకురావడం అసెంబ్లీ నిబంధనలకు విరుద్ధం అన్నారు. బిజెపి దీనిని వ్యతిరేకిస్తోందని తెలిపారు. తరువాత జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 189 వ్యతిరేకంగా 69 ఓట్లు రాగా ఇది నెగ్గిందని ప్రకటించారు.
Bengal Assembly passes resolution against Central Agencies