ఎంతో ఉత్కంఠ రేపిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గురించి ముందుగా ముచ్చటించకుండా ఉండడం సబబు కాదు. మిగతా నాలుగు శాసన సభల ఎన్నికల తీర్పులపై సునాయాసంగా జోస్యం చెప్పిన ఎగ్జిట్ ఫలితాలు బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఇంత ఘన విజయం సాధిస్తుందని చెప్పలేకపోయాయి. అది గెలిచినా అతి తక్కువ ఆధిక్యతనే నిరూపించుకుంటుందని అంచనా వేశాయి. కాని బెంగాల్ ఓటర్లు ఆ పార్టీకి, దాని సారథి మమతా బెనర్జీకి వరుసగా మూడోసారి అప్పగించడంతో ఆగలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 211 స్థానాలకు అదనంగా మూడు సీట్లు కలిపి కట్టబెట్టారు. ఆ విధంగా ఆమె నాయకత్వం పట్ల తమకున్న అపరిమితమైన మక్కువను చాటుకున్నారు. గత ఐదేళ్ల ఆమె పాలనలో వచ్చిన అవినీతి ఆరోపణలను కూడా లెక్క చేయలేదు. ముస్లిం మైనారిటీలకు చెందిన ఓట్లతో పాటు బెంగాలీ భూమి పుత్రిక అనే అభిమానం పెల్లుబికి మమతా బెనర్జీని అల్లంత ఎత్తున నిలబెట్టి మళ్లీ అధికారంలోకి తెచ్చాయి. ప్రచారంలో అవధులు మీరి ఎగిరెగిరి ప్రవర్తిస్తే ఏమి జరుగుతుందో కమల కంఠీరవా (ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా) లిద్దరికీ తెలిసి వచ్చేలా చేశారు.
పోలింగ్‌ను ఎనిమిది దశలుగా విభజించడం నుండి మమతా బెనర్జీని ప్రచార రంగం నుంచి ఒక రోజు బహిష్కరించడం వరకు ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించిందనే అభిప్రాయానికి కేంద్ర ఎన్నికల సంఘం తావు కలిగించింది. దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ క్రూర కోరల నుంచి కాపాడే అంశానికి అమిత ప్రాధాన్యమివ్వవలసిన గురుతర బాధ్యతను కూడా పక్కన పెట్టి బెంగాల్‌లో అధికారాన్ని చేజిక్కించుకోడమే తమ జీవిత పరమావధి అనే రీతిలో మోడీ, షా లు ప్రచారాన్ని మోతెత్తించారు. అయినా మమత ప్రతాపం ముందు కళ్లు తేలవేసి పరాజయం పాలు కాక తప్పలేదు. బెంగాల్ ఎన్నికలు బిజెపికి, ప్రధాని మోడీ పాలనకు రెండు విధాలైన అనర్థాన్ని తెచ్చి పెట్టాయి. ఒకటి అక్కడ చవిచూసిన పరాజయమైతే రెండోది బెంగాల్‌లో తిష్ఠ వేసుకు కూచోడం ద్వారా అత్యంత క్లిష్టమైన కరోనా కల్లోలంలో దేశ పాలనను నిర్లక్షం చేశారనే అపఖ్యాతి. అయితే బెంగాల్ గత అసెంబ్లీ ఎన్నికల నాటి మూడు స్థానాల ఒకే అంకె బలం నుంచి ఈసారి ఎకాఎకీ 75 సీట్లు గెలుచుకొని తృణమూల్‌కు ఏకైక ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి ఎదగ గలిగింది.
ఆ రాష్ట్రాన్ని ఆరు దశాబ్దాలకు పైగా పాలించిన కాంగ్రెస్, వామపక్షాలు కొత్త అసెంబ్లీలో శూన్యస్థితికి పతనమయ్యాయి. అక్కడ ఆనవాయితీ కాని మత, కుల ఓటు బ్యాంకులను సృష్టించడం ద్వారా బిజెపి ఆ రాష్ట్రంలో తన ఉనికిని గట్టి పరచుకున్నది. ఈ ఫలితాలు మమతా బెనర్జీని బెంగాల్ పరిధులను దాటించి మొత్తం దేశంలోనే బిజెపిని ఢీ కొని జాతీయ స్థాయి ప్రత్యామ్నాయాన్ని నిర్మించగల నేతగా ముందుకు తెచ్చాయనడం అతిశయోక్తి కాదు. అయితే మూడోసారి ముఖ్యమంత్రిగా ఆమె అడుగులు ఎలా పడతాయి, కేంద్రంతో సర్దుబాటు చేసుకొని పరిపాలనను సాఫీగా సాగించుకోడానికే ప్రాధాన్యత ఇచ్చి జాతీయ రాజకీయాలకు ఆమె దూరంగా ఉంటారా? లేక బిజెపితో సమరాన్ని ఇంతే సునిశితంగా కొనసాగిస్తారా అనేది చూడవలసి ఉంది. తమిళనాడులో కరుణానిధి అనంతర డిఎంకెకి తిరుగులేని అధినేతగా స్టాలిన్ ఆ పార్టీని ఘన విజయ తీరాలకు చేర్చారు. పదేళ్ల వ్యవధి తర్వాత దానిని తిరిగి అధికార అందలమెక్కించారు. అందులో తమిళ ప్రజల ప్రత్యేకత మరోసారి ప్రస్ఫుటమైంది.
పటిష్ఠమైన తెర వెనుక పాత్ర పోషిస్తూ ఎఐఎడిఎంకెను ముందుంచి తమిళనాడును తన చెప్పుచేతల్లో పూర్తిగా పెట్టుకోడానికి బిజెపి ప్రయోగించిన పాచికలను వారు చిత్తుగా ఓడించారు. అదే సమయంలో జయలలిత పట్ల భక్తి గౌరవాలతోనో లేక ఆమె వారస ముఖ్యమంత్రి పళనిస్వామి పరిపాలన ఎడల సానుకూలతతోనో ఎఐఎడిఎంకెకి కూడా 80కి పైగా సీట్లు కట్టబెట్టి గౌరవప్రదమైన ప్రతిపక్ష స్థానాన్ని ప్రసాదించారు. బెంగాల్‌లో మమత ఘనత లాంటిదే కేరళలో సిపిఐ(ఎం) సారథ్యంలోని వామపక్ష కూటమి (ఎల్‌డిఎఫ్) గెలుపు బావుటా, ముఖ్యంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ మోగించిన విజయ ఢంకా అసాధారణమైనది. అనేక సంక్షోభాల్లో ఆ రాష్ట్రాన్ని ఆయన ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకున్న తీరు ఇటీవలి స్థానిక ఎన్నికలలో గాని, ఇప్పటి అసెంబ్లీ ఓట్ల సమరంలో గాని విజయన్‌కు ఈ ఘనతను సాధించి పెట్టిందని చెప్పుకోవాలి. కేంద్రంలో విశేషాధికారాలు అనుభవిస్తున్న పార్టీగా బిజెపి తనకే గల అనుకూలాంశాలతో అసోంలో రెండో సారి అధికారంలోకి రాగలిగింది.
పుదుచ్చేరిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్‌తో కలిసి తన కూటమని గెలిపించుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ మరింత దయనీయ స్థితికి దిగజారిపోయింది. ప్రధాని మోడీ జనాకర్షణ శక్తికి చెప్పనలవికానంత గండి పడింది. తనకు ఉనికి లేని రాష్ట్రాలను కూడా ఆక్రమించుకొని యావద్భారత పార్టీగా నిరూపించుకోవాలన్న బిజెపి విస్తరణ దాహానికి ఈ ఎన్నికలు హద్దులు చూపించాయి.