రాజస్థాన్ ప్రముఖ జాట్‌నేత
బిజెపి పార్లమెంటరీ భేటీలో ఖరారు
వెంకయ్యకు మరోఛాన్స్ లేదు
న్యూఢిల్లీ :ఎన్‌డిఎ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌ఖర్ ఎంపిక అయ్యారు. ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నారు. జగదీప్ ధన్‌ఖర్‌ను ఉప రాష్ట్రపతి అభ్యర్థికి ఎంపిక చేస్తూ శనివారం ఇక్కడ జరిగిన బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు పదవీకాలంలో ముగియనుంది. కొత్త ఉప రాష్ట్రపతి ఎంపికకు బిజెపి పలు దఫాలుగా కసరత్తు జరిపి చివరికి బెంగాల్ గవర్నర్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించింది. ధన్‌ఖర్ అధికార ఎన్‌డిఎ తరఫున ఉప రాష్ట్రతి అభ్యర్థిగా ఉంటారని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని బిజెపి అధ్యక్షులు జెపి నడ్డా వెల్లడించారు. ఆయన రైతుబిడ్డ, పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా తమ సేవలతో ప్రజల గవర్నర్‌గా పేరు తెచ్చుకున్నారని నడ్డా కితాబు ఇచ్చారు. బిజెపిపిపి భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ, ప్రముఖ నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ , నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు.
ధన్‌ఖర్ పరిపాలనాదక్షులు, రాజ్యాంగ విషయపరిజ్ఞానులు, చట్టసభల వ్యవహారాలతో సముచిత అనుభవజ్ఞులుగా ఉన్నారని, ఆయన అభ్యర్థిత్వానికి తమ మద్దతు అని ప్రధాని మోడీ ట్వీటు వెలువరించారు. రాజ్యసభ నిర్వాహక బాధ్యతల్లో ఆయన రాణిస్తారని ఈ నమ్మకం తనకు ఉందని తెలిపారు. జాతీయ ప్రగతి దిశలో సాగే పయనానికి ఆయన తమ వంతు సాయం అందిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 2017లో సీనియర్ పార్లమెంటేరియన్ , తెలుగువాడు అయిన వెంకయ్యనాయుడును బిజెపి ఉపరాష్ట్రపతిగా ఎంచుకుంది. నాయుడు పదవీకాలం వచ్చే నెల 10తో ముగుస్తుంది. ధన్‌ఖర్ రాజస్థాన్‌కు చెందిన జాట్ నేత, తరచూ కాఫీతాగే కాఫీ ప్రియుడు. ఆయనకు జాట్ తిరుగులేని నేత దేవీలాలే రాజకీయ గురువుగా నిలిచారు. యువ లాయర్ తరువాత ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది. పివి నరసింహరావు ప్రధానిగా ఉన్న దశలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. తరువాత రాజస్థాన్ రాజకీయాలలో కాంగ్రెస్‌లో అశోక్ గెహ్లోట్ తిరుగులేని నేత కావడంతో బిజెపిలోకి చేరారు.
సిఎం మమతతో టగాఫర్ గవర్నర్
71 సంవత్సరాల జగదీప్ రాజస్థాన్‌లోని జుంజూన్‌లో 1951 మే నెల 18వ తేదీన కుగ్రామం కితానాలో జన్మించారు. రాజస్థాన్ నుంచి బిజెపి ఎంపిగా ప్రాతినిధ్యం వహించారు. అంతకు ముందు జనతాదళ్ ఎంపిగా ఉన్నప్పుడు ఆయన చంద్రశేఖర్ ప్రధానిగా ఉన్న దశలో కేంద్ర సహాయ మంత్రిగా కూడా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా 2019లో బాధ్యతలు చేపట్టారు. సిఎం మమతకు, ఆమె పార్టీ టిఎంసికి గవర్నర్‌గా ఆయన పలుసార్లు కీలక సవాళ్లు విసిరారు. ఈ విధంగా వివాదాలు భగ్గుమన్నాయి. ధన్‌కర్ మతతత్వవాది అని టిఎంసి ఆరోపించింది. అయితే మమత ప్రభుత్వం అరాచకవాద ప్రభుత్వం అని , కొన్ని వర్గాలను మచ్చిక చేసుకునే రకం అని, మాఫియా సిండికేట్లను ప్రోత్సహించి బలవంతపు వసూళ్లకు దిగుతోందని గవర్నర్ ఎదురుదాడికి దిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రధాని మోడీకి , మమత బెనర్జీకి రాజకీయ వైరం పూర్తి స్థాయిలో ఉన్న దశలో బెంగాల్ గవర్నర్‌ను దేశపు ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం జరిగింది.