కోల్‌కతా: తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుకు సంబంధించి కోల్‌కతా పోలీస్‌లు జారీ చేసే సమన్లను విస్మరించాలని పశ్చిమబెంగాల్ గవర్నర్ సివి ఆనందబోస్ రాజ్‌భవన్ సిబ్బందిని ఆదివారం ఆదేశించారు. గవర్నర్‌పై రాజ్‌భవన్ ఉద్యోగిని చేసిన ఫిర్యాదుపై కోల్‌కతా పోలీస్‌లు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన తరువాత గవర్నర్ నుంచి సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి.రాజ్యాంగం లోని ఆర్టికల్ 361 (2) మరియు (3) ప్రకారం రాష్ట్ర పోలీస్‌లు ఎట్టి పరిస్థితుల్లోను ఎలాంటి విధానాల ద్వారా నైనా గౌరవ ప్రదమైన గవర్నర్‌పై దర్యాప్తు చేసే అధికారం లేదని గవర్నర్ ఆనందబోస్ తన ఎక్స్ ఖాతా ద్వారా వివరించారు.
గవర్నర్ లేదా రాష్ట్రపతిపై వారి పదవీకాలంలో నమోదైన నేరారోపణలపై ఏ కోర్టులోనూ విచారణ చేపట్టే అధికారం లేదని పేర్కొన్నారు. అలాగే ఎలాంటి అరెస్ట్‌లు చేయరాదని ఆయన పేర్కొన్నారు. మీడియా కథనాలు మాత్రం ఈ విషయంలో పోలీస్‌లు దర్యాప్తు చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. రాజ్‌భవన్ సిబ్బందిని వారు విచారిస్తారు. దర్యాప్తు బృందం రాజ్‌భవన్ నుంచి సిసిటివి పుటేజీని సేకరించాలని ప్రయత్నిస్తోంది. రాజ్యాంగం కల్పించిన రక్షణ మేరకు గవర్నర్‌ను పోలీస్‌లు దర్యాప్తు చేయవచ్చా అన్నది ప్రశ్నార్థకమే. దర్యాప్తులో భాగంగా కొన్ని రోజుల్లో కోల్‌కతా పోలీస్‌లు సాక్షులను విచారించే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు సిసిటివి పుటేజీ వివరాలను అందించాలని రాజ్‌భవన్ సిబ్బందిని పోలీస్‌లు అభ్యర్థించారు.
రాజ్యాంగ రక్షణ కలిగిన గవర్నర్‌పై ఎలా దర్యాప్తు చేస్తారని అడగ్గా, ఏదైనా ఫిర్యాదు ముఖ్యంగా మహిళ నుంచి ఫిర్యాదు వస్తే దర్యాప్తు ప్రారంభించడమన్నది క్రమంగా జరుగుతున్న ప్రక్రియ అని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. గవర్నర్ కార్యాలయంలో నియామకమైన ముగ్గురు రాజ్‌భవన్ అధికారులు, పోలీస్ అధికారికి హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్లు సమన్లు జారీ చేశారు. రాజ్‌భవన్ అధికారులు ఎవరూ ఈ దర్యాప్తుకు హాజరు కారు. కేవలం పోలీస్ అధికారి మాత్రమే హాజరవుతారు. వారిని మళ్లీ సోమవారం హాజరు కావాలని తాము కోరామని పోలీస్ అధికారి చెప్పారు. అప్పటివరకు దర్యాప్తు అన్న ప్రసక్తే లేదన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలను గవర్నర్ అసంబద్ధ డ్రామాగా వ్యాఖ్యానించారు. అవినీతిని బహిర్గతం చేయడం, హింసను అరికట్టడం తదితర తన కర్తవ్యం నుంచి ఎవరూ దూరం చేయలేరని గవర్నర్ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ బాస్‌లకు శాంతింప చేయడానికి దర్యాప్తు ముసుగులో అనధికార, అక్రమ బూటకాలు సాగించాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్ లోకి పోలీస్‌ల ప్రవేశాన్ని నిషేధించారు.