Thursday, January 23, 2025

టీచర్ల రిక్రూట్‌మెంట్ కేసు.. బెంగాల్ సర్కారుకు ఊరట

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో టీచర్స్ రిక్రూట్‌మెంట్ కేసులో కొల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సోమవారం తాత్కాలికంగా నిలిపివేసింది. దీనితో రాష్ట్రంలోని మమత బెనర్జీ నాయకత్వపు టిఎంసి ప్రభుత్వానికి ఊరట దక్కింది. బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామకాల విషయంలో ప్రభుత్వ అధికారుల పాత్రపై విచారణ జరగాలని, 2016 నాటి నియామకాల ప్రక్రియ చెల్లనేరదని హైకోర్టు ఇటీవలే సంచలనాత్మక తీర్పు వెలువరించింది. దీనికి వ్యతిరేకంగా మమత ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారించింది.

ప్రస్తుతానికి హైకోర్టు ఆదేశాలపై స్టే ఇస్తున్నట్లు ప్రకటించిన అత్యున్నత ధర్మాసనం కేసు తదుపరి విచారణను మే 6వ తేదీకి వాయిదా వేసింది. టీచర్స్ రిక్రూట్‌మెంట్ల వ్యవహారంపై సిబై దర్యాప్తునకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే వర్తిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. టీచర్ల నియామకం చెల్లనేరదని హైకోర్టు పేర్కొనడం, మొత్తం ప్రక్రియకు గండికొట్టడం దారుణం, ఏకపక్ష విషయం అని బెంగాల్ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదించారు. కొన్ని అక్రమాలు జరిగి ఉండవచ్చు, అయితే మొత్తం నియామకాలను రద్దు చేసే విధంగా ఆదేశాలు వెలువరించడం వల్ల తలెత్తే పరిణామాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నట్లుగా లేదని మమత ప్రభుత్వం తెలియచేసుకుంది.

ఉన్నట్లుండి అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని పక్కకు పెట్డడం, ప్రభుత్వానికి సరైన ప్రత్యామ్నాయ చర్యలకు అవకాశం ఇవ్వకుండానే తీర్పు వెలువరించడం వల్ల విద్యారంగానికి ముప్పు ఏర్పడుతోందని ప్రభుత్వం తెలిపింది. విద్యావ్యవస్థ గురించి పట్టించుకోవల్సిన బాధ్యత అందరికీ ఉందని మమత సర్కారు పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో దాదాపుగా 24,650 ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించింది.

2016లో జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 23 లక్షల మంది హాజరయ్యారు. ఈ క్రమంలో పరీక్షల తరువాత 25వేల మందికి నియామకాల ఉత్తర్వులు వెలువరించారు. వీరు అప్పటి నుంచి ఉద్యోగాలలో ఉన్నారు. అయితే అధికార టిఎంసి నేతలు అధికారుల ప్రమేయంతో ఈ టీచర్ల, ఇతరత్రా పోస్టుల భర్తీకి భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నారని, ఈ క్రమంలో వారి వారికే ఉద్యోగాలు వచ్చాయని ఆరోపణలు వెలువడ్డాయి. హైకోర్టు వరకూ వెళ్లిన కేసు విచారణల క్రమంలో నియామకాలకు బ్రేక్ వేస్తూ తీర్పు వెలువడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News