కోల్‌కతా : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రి డాక్టర్‌పై హత్యాచారం కేసులో దోషికి మరణ శిక్ష విధించాలని కోరుతూ అప్పీల్ దాఖలు చేసేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం హైకోర్టు నుంచి అవసరమైన అనుమతిని సంపాదించింది. ఈ కేసులో దోషి సంజయ్ రాయ్‌కు మరణించేంత వరకు జీవిత ఖైడు విధిస్తూ సీల్డా కోర్టు జారీ చేసిన ఉత్తర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలన్న తన తలంపును ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించి 24 గంటలు కూడా కాకుండానే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
సీల్డాలోని అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి అనిర్బన్ దాస్ సోమవారం జారీ చేసిన ఉత్తర్వును సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేయడానికి కోర్టు అనుమతి కోరుతూ అడ్వొకేట్ జనరల్ కిశోర్ దత్తా మంగళవారం ఉదయం న్యాయమూర్తులు దేబాంగ్సు బసక్, మహమ్మద్ షబ్బార్ రషీదితో కూడిన ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ‘ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించి, అప్పీల్ దాఖలుకు కోర్టు అనుమతి సంపాదించింది’ అని అధికారి ఒకరు తెలియజేశారు. అప్పీల్ దాఖలు ప్రక్రియ వెంటనే పూర్తి అయినట్లయితే కేసుకు సంబంధించిన న్యాయ ప్రక్రియ ఈ వారంలోనే మొదలు కాగలదని హైకోర్టు వర్గాలు సూచించాయి. ‘అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే మరణ శిక్ష విధించాలని సుప్రీం కోర్లు పదే పదే ఉద్ఘాటించింది’ అని సీల్డా కోర్టు న్యాయమూర్తి దాస్ సోమవారం తన తీర్పులో తెలియజేశారు.
సీల్డా కోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి సోమవారం అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కేసును కోల్‌కతా పోలీసులు దర్యాప్తు చేసి ఉన్నట్లయితే మరణ శిక్ష పడి ఉండేదే అని అన్నారు. ‘మేమంతా మరణ శిక్ష కోరాం. కానీ కోర్టు మరణించేంత వరకు జీవిత ఖైదు విధించింది& కేసును మా వద్ద నుంచి లాక్కున్నారు. ఇది (కోల్‌కతా) పోలీసుల అధీనంలో ఉండినట్లయితే. అతనికి మరణ శిక్షపడేలా మేము చూసి ఉండేవారం’ అని మమత విలేకరులతో చెప్పారు. ఆ తరువాత ఆమె తన ‘ఎక్స్’ పోస్ట్‌లో మరింత విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీల్డా కోర్టు తీర్పును సవాల్ చేస్తుందని, కలకత్తా హైకోర్టును ఆశ్రయిస్తుందని మమత తెలియజేశారు. ‘ఆర్‌జి కర్ హత్యాచారం ఘటనలో నిందితునికి మరణ శిక్ష కోరుతూ వచ్చాను. ఒకరు అంత రాక్షసంగా, కిరాతకంగా వ్యవహరిస్తే సమాజం ఎలా మానవత్వంతో కొనసాగుతుంది? మహిళలపై అటువంటి క్రూర నేరాలకు పాల్పడినవారికి మరణ శిక్ష విధించే నిబంధనలతో మేము అపరాజిత బిల్లును ఆమోదించాం. కానీ కేంద్రం దానిపై కాలయాపన చేస్తోంది’ అని మమత మంగళవారం మాల్డాలో బహిరంగ సభలో చెప్పారు.