అవినీతి వ్యవస్థాగతమైంది
బెంగాల్ పరివర్తన్ ర్యాలీలో బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా
నాబాద్‌విప్: బెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని బిజెపి ముమ్మరం చేసింది. శనివారం నదియా జిల్లాలోని నాబాద్‌విప్‌లో ‘పరివర్తన్ యాత్ర’ను బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రారంభించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మమతాబెనర్జీ ప్రభుత్వానికి వీడ్కోలు పలకాలని బెంగాల్ ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయంగా మార్చిందని, పోలీస్ వ్యవస్థను నేరమయం చేసిందని, అవినీతిని వ్యవస్థాగతం చేసిందంటూ టిఎంసి ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు.
టిఎంసి నినాదాలైన మా, మట్టి, మనుష్‌ను నియంతృత్వం, అపహరణలు, (ఓటర్ల)బుజ్జగింపులుగా మార్చారని ఆయన ఎద్దేవా చేశారు. మమత హయాంలో కేవలం టిఎంసి నేతలు మాత్రమే లాభపడ్డారని ఆయన అన్నారు. అంఫాన్ తుపాన్ నిధుల్ని కూడా టిఎంసి ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని ఆయన ఆరోపించారు. జై శ్రీరామ్ నినాదాన్ని మమత ఎందుకు అసహ్యించుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. దేశ సంస్కృతితో అనుసంధానమైన ఆ నినాదాన్ని ఓటుబ్యాంక్ రాజకీయాల కోసం వ్యతిరేకిస్తున్నారంటూ మమతపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ నెలలోనే మరో రెండు రథయాత్రల్ని హోంమంత్రి అమిత్‌షా ప్రారంభిస్తారని నడ్డా తెలిపారు.