Thursday, January 23, 2025

ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం.. బెంగాల్ మంత్రి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Bengal minister arrested in Teacher recruitment scam

 

కోల్‌కతా : ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమబెంగాల్ మంత్రి పార్ధా చటర్జీని శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. దీనికి ముందు కోల్‌కతా లోని మంత్రి నివాసంలో అధికారులు 23 గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. అయితే విచారణ సమయంలో ఆయన సహకరించలేదని దాంతో ఆయనను అరెస్టు చేశామని ఈడీ వెల్లడించింది. మంత్రి అనుచరురాలు అర్పితా ముఖర్జీ నివాసంలో శుక్రవారం రూ.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ అరెస్టు చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆమెను ఈడీ అదుపు లోకి తీసుకుంది. పార్థా ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై శుక్రవారం ఈడీ అధికారులు మంత్రి, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ, విద్యామంత్రి ప్రకాశ్ అధికారి, ఎమ్‌ఎల్‌ఎ , రాష్ట్ర ప్రాథమిక విద్యామండలి మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య, మరికొందరి నివాసాల పైనా ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

పార్థా విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన పికె బందోపాధ్యాయ్, వ్యక్తిగత కార్యదర్వి సుకాంతా ఆచార్జీ తదితరుల ఇళ్ల లోనూ సోదాలు జరిగాయి. అర్పితా ఇంట్లో రూ.20 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించిందేనని భావిస్తున్నట్టు ఈ డీ ఒక ప్రకటనలో పేర్కొంది. శనివారం కూడా అర్పిత నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. పలు ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు, రూ. 50 లక్షల విలువైన బంగారు, వజ్ర ఆభరణాలు స్వాధీనం చేసుకున్న వాటిలో ఉన్నాయి.

ఇది ట్రైలర్ మాత్రమే : బీజేపీ
ఈడీ దాడుల నేపథ్యంలో బీజేపీ రెండు ఫోటోలు షేర్ చేసి , తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆ ఫోటోల్లో బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, మంత్రి ఛటర్జీతో అర్పిత దర్శనమిచ్చారు. ఇది ట్రైలర్ మాత్రమే. అసలు చిత్రి ముందుందంటూ బీజేపీ నేత సువేందు అధికారి ఈ చిత్రాలను పోస్టు చేశారు. ఇదిలా ఉండగా అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కోల్‌కతాలో టీఎంసీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఆ మరుసటి రోజే ఈడీ దాడులు చేయడం వెనుక తమ నాయకులను వేధించాలన్నదే ఈడీ వ్యూహంగా కనిపిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News