Wednesday, January 22, 2025

హింసాయుత పంచాయతీ!

- Advertisement -
- Advertisement -

ఎన్నికలు జరపడమంటే హింసకు లైసెన్సు ఇచ్చినట్టు కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న బెంగాల్ పంచాయతీ ఎన్నికల హింసపై విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్య ప్రజాస్వామ్య చరిత్రలోనే ప్రముఖంగా నిలిచిపోతుంది. ఎన్నికలలో గెలిచి పదవిని చేపట్టడానికి మించిన ఐశ్వర్యం, అదృష్టం వుండవని, కనీసం వార్డు సభ్యులుగా గెలిచినా ఓ కోటి రూపాయలు వెనకేసుకోవచ్చని భావిస్తున్న ఈ రోజుల్లో హింస రాజకీయానికి పర్యాయ పదం కావడం విశేషమూ కాదు, విడ్డూరమూ కాదు. కాని ప్రజాస్వామ్యం వర్ధిల్లవలసిన చోట హింసకు తావుండరాదని జస్టిస్ నాగరత్న పలికిన పలుకులు శిరోధార్యమైనవి. ‘కింది స్థాయి వరకు ప్రజాస్వామ్య వ్యవస్థ గల రాష్ట్రాలలో మీది ఒకటి, అందుకే కూకటి వేళ్ళ వరకు ఎన్నికలు జరుగుతున్నాయి. అటువంటి సమయంలో హింస తలెత్తకూడదు.

నామినేషన్ దాఖలు చేయలేకపోడం, చేసిన తర్వాత వారి ప్రాణాలు మిగలకపోడం జరుగుతున్న చోట స్వేచ్ఛాయుతమైన, స్వచ్ఛమైన ఎన్నికలకు చోటెక్కడిది?’ అని కూడా జస్టిస్ నాగరత్న ఉద్వేగంతో అన్నారు. జులై 8వ తేదీన జరగవలసిన వున్న పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 9 నుంచి 15 వరకు నామినేషన్లు దాఖలయ్యాయి. అవతలి వారి నామినేషన్ అడ్డుకోడానికి చెలరేగిన హింసకు ఇంత వరకు ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒక తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త కూడా వున్నారని వార్తలు చెబుతున్నాయి. బెంగాల్‌లో 2003 ఎన్నికల్లో ఘర్షణలు చెలరేగి 70 మంది దుర్మరణం పాలయ్యారు. 2008లో 36 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ రెండు రక్తపాతాలు వామపక్ష పాలనలోనే జరిగాయి. 2011 జనవరిలో అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ మిడ్నపూర్‌లో జరిగిన ఘర్షణల్లో 14 మంది చనిపోయారు. 34 ఏళ్ళు పరిపాలించిన వామపక్ష కూటమితో మమతా బెనర్జీ నిత్యం తలపడ్డారు. ఘర్షణలు తరచూ జరుగుతూ వుండేవి. బుద్ధదేవ్ భట్టాచార్య సంస్కరణలకు తెరలేపినప్పుడు 2007లో నందీగ్రామ్‌లో జరిగిన ఘర్షణల్లో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మమతా బెనర్జీ వరుసగా మూడోసారి ఆ రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఇప్పుడు అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు కేంద్ర పాలక పక్షమైన బిజెపికి మధ్య పరస్పర హింస చోటుచేసుకొంటున్నది. ఈ పంచాయతీ ఎన్నికల్లో మొదట్లోనే పెచ్చరిల్లిన హింసాకాండ నేపథ్యంలో ఒక పిటిషన్‌కు స్పందిస్తూ కేంద్ర బలగాలను పిలిపించాలని బెంగాల్ హైకోర్టు ఆదేశించింది. దీనిపై మమతా బెనర్జీ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్ళగా అక్కడ వారికి చుక్కెదురైంది.

జులై 8న జరిగే పంచాయతీ ఎన్నికలకు కేంద్ర బలగాలను పిలిపించాలన్న హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు ఆమోదించింది. అందులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 61,639 పోలింగ్ బూతులుంటాయి. మొత్తం 75 వేల స్థానాలకు పోలింగ్ జరగనున్నది.ఇప్పటి హింస కూచ్‌బిహార్, ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, ముర్షిదాబాద్, తూర్పు మిడ్నపూర్, తూర్పు బుర్దాన్ మున్నగు జిల్లాల్లో సంభవిస్తున్నది. ఇతర రాష్ట్రాల నుంచి బలగాలను రప్పించుకొనే బదులు కేంద్ర బలగాలను తెచ్చుకోవాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశం న్యాయమైనదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. కేంద్ర బలగాల ఖర్చు కేంద్రమే భరిస్తుందని కూడా చెప్పారు. అయితే కేంద్రాన్ని పాలిస్తున్న బిజెపి ఈ ఎన్నికల్లో తనకు ప్రత్యక్ష ప్రత్యర్థి కాబట్టి అక్కడి నుంచి బలగాలను రప్పించుకోడం మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఇష్టం లేదని భావించవలసి వస్తున్నది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ ఎన్నికల కోసం బీహార్, జార్ఖండ్, ఒడిశా, తమిళనాడు, పంజాబ్‌ల నుంచి బలగాలను కోరింది. అందుచేత కేంద్ర బలగాలు వద్దంటున్నది. హైకోర్టు, సుప్రీంకోర్టు దానితో అంగీకరించలేదు. అల్లర్లను నిరోధించడంలో కేంద్ర బలగాలకున్న చాకచక్యాన్ని కూడా దృష్టిలో వుంచుకోవాలని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది.ఎన్నికల్లో హింస చెలరేగడానికి డబ్బు కూడా ఒక కారణమని తెలుస్తున్నది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో 3317 గ్రామ పంచాయతీ స్థానాలకు, 63,229 పంచాయతీ సమితులకు, 928 జిల్లా కౌన్సిళ్ళకు ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే ఐదేళ్ళలో ఒక్కొక్క జిల్లా కౌన్సిల్ అభివృద్ధి కార్యక్రమాలపై రూ. 500 కోట్లు ఖర్చు చేస్తుంది. ప్రతి సంవత్సరం గ్రామీణ అభివృద్ధి కోసం రాష్ట్రానికి కేంద్రం రూ. 4 వేలు కోట్లు ఇస్తుంది. ఈ డబ్బుపై దృష్టితోనే ఎలాగైనా ఆయా పదవులకు ఎన్నిక కావాలనే పట్టుదలలు పెరిగి హింసకు దారి తీస్తున్నాయి. ప్రజాస్వామ్యం అంటే హింస కానేకాదన్న చైతన్యం, అహింసనే ఆయుధం చేసుకొన్న గాంధీ నేలలో ఇప్పటికీ కలగకపోడం బాధాకరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News