కోల్‌కతా: షాపింగ్‌మాల్‌లో తాను చాక్లెట్లు దొంగిలించడం సోషల్ మీడియాలో బట్టబయలు కావడంతో అవమానంతో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమబెంగాల్ అలిపుర్దుయార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మృతురాలు డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. సెప్టెంబర్ 29న విద్యార్థిని తన చెల్లెలుతో కలిసి షాపింగ్‌మాల్‌కి వెళ్లింది. చాక్లెట్లు దొంగతనం చేస్తూ దొరికిపోవడంతో షాపు యజమానికి క్షమాపణలు చెప్పి బిల్లు చెల్లించి వచ్చేసింది. కానీ ఈ సంఘటన సోషల్ మాధ్యమంలో వైరల్ అయిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. దీంతో ఈ అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ఆవేదన వెలిబుచ్చాడు. జైగావ్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని సుభాష్ పల్లిలోని ఆమె ఇంటి నుంచి మృతదేహాన్ని ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్‌కు పంపారు. ఈ సంఘటనను షాపు వారు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయించారని జైగావ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ఆఫీసర్ ప్రభీర్ దత్తా వెల్లడించారు. దీనిపై షాపింగ్ మాల్ బయట స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. వీడియో ఎవరు తీసి వైరల్ చేయించారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bengal Student Suicide after viral of Chocolate Steal