డార్జీలింగ్‌లో ఘోర రైలు ప్రమాదం
కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌లోకి దూసుకుపోయిన గూడ్స్ రైలు
15 మంది దుర్మరణం, 60 మందికి గాయాలు
మృతులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా: ప్రధాని మోడీ ప్రకటన
న్యూ జల్పాయిగురి/ కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ డార్జీలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం సుమారు 9 గంటలకు ఆగి ఉన్న కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ను ఒక గూడ్స్ రైలు ఢీకొనగా ఎక్స్‌ప్రెస్ వెనుకు బోగీలు మూడు పట్టాలు తప్పిన తరువాత కనీసం 15 మంది ప్రయాణికులు దుర్మరణం చెందినట్లు, మరి 60 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అగర్తలా నుంచి బయలుదేరిన కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ సీల్డా వెళ్లవలసి ఉంది.
బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు స్థానికులతో కలసి రాష్ట్ర, కేంద్ర సంస్థలు యుద్ధ ప్రాతిపదికపై పని చేస్తున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మృతుల్లో గూడ్స్ రైలు పైలట్, కో పైలట్ కూడా ఉన్నట్లు సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రులను ఉత్తర బెంగాల్ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఉత్తర బెంగాల్ న్యూ జల్పాయిగురిస్టేషన్ నుంచి దాదాపు 30 కిలో మీటర్ల దూరంలోని రంగపాని స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఇంజన్ ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి ఢీకొన్న ప్రభావంతో మూడు వెనుక బోగీలు పట్టాలు తప్పినట్లు సీనియర్ రైల్వే అధికారి తెలిపారు.
‘పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం విషాదకరం. తమ ప్రియతములను కోల్పోయినవారికి సంతాపం తెలియజేస్తున్నా’ అని ప్రధాని నరేంద్ర మోడీ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. అధికారులతో మాట్లాడి, పరిస్థితిని తెలుసుకున్నా. బాధితులకు రక్షణ, సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రమాద స్థలానికి వెళుతున్నారు’ అని మోడీ తెలిపారు. మృతులు ఒక్కొక్కరి సమీప బంధువులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ. 50 వేలు ఇవ్వనున్నట్లు కూడా ప్రధాని ప్రకటించారు. రైలు ప్రమాదం నేపథ్యంలో సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోమవారం పశ్చిమ బెంగాల్‌కు బయలుదేరి వెళ్లారు.
రైల్వే అధికారుల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రయాణికుల రైలు పట్టాలపై ఆగి ఉండగా వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొన్నది. ఆ తీవ్ర ప్రభావానికి కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ వెనుక బోగీలు రెండు వెంటనే పట్టాలపై నుంచి ఎగిరిపడగా, మరొక బోగీ గూడ్స్ రైలు ఇంజన్ కింద చిక్కుకుని వేలాడుతోంది. ఆ ప్రాంతంలో అననుకూల వాతావణం సహాయ కార్యక్రమాలకు మరొక అవరోధంగా తయారైందని అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రైలు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం పర్యవసానంగా ఉత్తర బెంగాల్, దేశంలోని ఈశాన్య ప్రాంతం నుంచి దూర ప్రాంత రైలు సర్వీసులకు అంతరాయం వాటిల్లింది.
తెల్లవారు జామున 5.50 నుంచి సరిగ్గా పని చేయని సిగ్నల్
ఇది ఇలా ఉండగా, పశ్చిమ బెంగాల్‌లోని రాణిపత్రా రైల్వే స్టేషన్, ఛత్తర్ హాట జంక్షన్ మధ్య ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ సోమవారం తెల్లవారు జామున 5.50 నుంచి సరిగ్గా పని చేయడం లేదని రైల్వే శాఖ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ‘రైలు నంబర్ 13174 (సీల్డా కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్) ఉదయం 8.27 గంటలకు రంగపాని స్టేషన్ నుంచి బయలుదేరి, తెల్లవారు జామున 5.50 నుంచి ఆటోమేటిక్ సిగ్నలింగ్ వైఫల్యం వల్ల రాణిపత్రా రైల్వే స్టేషన్, ఛత్తర్ హాట్ మధ్య నిలిచిపోయింది’ అని ఆ ప్రతినిధి వివరించారు. మరొక రైల్వే అధికారి ప్రకారం, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ విఫలమైనప్పుడు స్టేషన్ మాస్టర్ ‘టిఎ 912’ అనే లిఖిత అధికార పత్రంజారీ చేస్తారు.
సిగ్నలింగ్ వ్యవస్థ లోపం కారణంగా ఆ సెక్షన్‌లోని అన్ని ఎర్ర సిగ్నల్స్‌ను దాటివెళ్లేందుకు డ్రైవర్‌కు అది అధికారం ఇస్తుంది. ‘రాణిపత్రా స్టేషన్ మాస్టర్ రైలు నంబర్ 13174 (సీల్డా కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్)కు టిఎ 912 జారీ చేశారు’ అని ఆ ప్రతినిధి తెలిపారు. ‘అదే సమయంలో ఒక గూడ్స్ రైలు జిఎఫ్‌సిజె ఉదయం 8.42కు రంగపాని నుంచి బయలుదేరి 13174 రైలును వెనుక నుంచి ఢీకొన్నది. ఫలితంగా గార్డు బోగీ, రెండు పార్సిల్ బోగీలు, ఒక జనరల్ సీటింగ్ బోగీ పట్టాలు తప్పాయి’ అని ఆయన వివరించారు. వేగంగా లోపభూయిష్ట సిగ్నల్స్‌ను దాటి వెళ్లేందుకు గూడ్స్ రైలుకు కూడా టిఎ 912 ఇచ్చారా లేక లోపభూయిష్ట సిగ్నల్ నిబంధనను ఉల్లంఘించింది లోకో పైలటా అన్నది దర్యాప్తులోనే తేలగలదని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.
రెండవదానిని పరిగణనలోకి తీసుకునేటట్లయితే, డ్రైవర్ ప్రతి లోపభూయిష్ట సిగ్నల్ వద్ద ఒక నిమిషం సేపు రైలును నిలిపి గంటకు 10 కిమీ వేగంతో సాగవలసి ఉంటుంది. కాగా, ఎర్ర సిగ్నల్‌ను డ్రైవర్ ఉల్లంఘించారన్న రైల్వే ప్రకటన పట్ల లోకో పైలట్ల సంఘం ఆక్షేపణ తెలియజేసింది. ‘లోకో పైలట్ మరణించినప్పుడు, సిఆర్‌ఎస్ దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు అతనిని బాధ్యునిగా ప్రకటించడం అత్యంత అభ్యంతరకరం’ అని భారతీయ రైల్వే లోకో రన్నింగ్‌మెన్ సంఘం (ఐఆర్‌ఎల్‌ఆర్‌ఒ) కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ పాంధి అన్నారు. రైల్వే బోర్డ్ చైర్‌పర్సన్ జయ వర్మ సిన్హా ప్రకటన ప్రకారం, ఒక గూడ్స్ రైలు సిగ్నల్‌ను బేఖాతరు చేసి, అగర్తలా నుంచి సీల్డా వెళుతున్న కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న కారణంగా ప్రమాదం సంభవించింది.