Sunday, December 22, 2024

బెంగళూరు కెఫే పేలుడు కేసు దర్యాప్తు ఎన్‌ఐఎకు అప్పగింత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్ లోని రామేశ్వరం కెఫే పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు హోం శాఖ సోమవారం అప్పగించింది. ఈనెల 1న సంభవించిన ఈ పేలుడులో 10 మంది గాయపడ్డారు. అవసరమైతే ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు తమ ప్రభుత్వం అప్పగిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించిన మరునాడే ఈ కేసును ఎన్‌ఐఎకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు కర్ణాటక పోలీస్‌లు ఎన్‌ఐఎ, నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ (ఎన్‌ఎస్‌జి), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) సహకారంతో ఈ కేసు దర్యాప్తు సాగించారు. నిందితుడు ఏ మార్గంలో కెఫెలోకి వచ్చాడు, బాంబు అమర్చిన తరువాత ఎలా వెళ్లిపోయాడు అనే అంశంపై పోలీస్ దర్యాప్తు బృందాలు దృష్టి పెట్టాయి.

అనుమానితుడు టోపీ, కళ్లద్దాలు పెట్టుకుని ముఖాన్ని కర్చీఫ్‌తో కవర్ చేసుకున్నట్టు ఆ ప్రాంతం దుకాణాల్లో అమర్చిన సీసీ కెమెరాల రికార్డుల ద్వారా గుర్తించారు. అతడు కెఫే సమీపం లోని రూట్ నంబర్ 500 డి బస్సు దిగినట్టు సీసీ కెమేరా దృశ్యాల్లో రికార్డయింది. పేలుడుకు దాదాపు గంట ముందు 12.56 సమయంలో అతడి కదలికలను గుర్తించారు. శనివారమే కెఫే లోని ఉన్న డిజిటల్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఐఇడి సాధనం ద్వారా ఈ పేలుడు జరిగిందని అనుమానిస్తున్నారు. పేలుడుకు సంబంధించి దాదాపు 50 వరకు దృశ్యాలను సేకరించినట్టు కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. వ్యాపార విభేదాలు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నగరంపై దాడి, తదితర పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News