దుబాయ్ నుంచి అక్రమంగా 14.2 కిలోల బంగారాన్ని తీసుకొస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు(34)ను ఈ వారం కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఆమెను మూడు రోజుల కస్టడీ కోసం రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్(డిఆర్‌ఐ)కి అప్పగించింది. ఆమెను విచారించేందుకు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోర్టును డిఆర్‌ఐ కోరింది. విచారణ సందర్భంగా నటి నుంచి సేకరించిన స్టేట్‌మెంట్‌ను డిఆర్‌ఐ కోర్టుకు సమర్పించింది. రన్యా రావు తన పాస్‌పోర్టులో హర్సవర్ధిని రన్యగా పేర్కొందని, ఆమె గత ఆరు నెలల్లో దుబాయ్‌కు 27సార్లు వెళ్లొచ్చిందని పరిశోధకులు కోర్టుకు వివరించారు.
ఆమెను అరెస్టు చేశాక ఆమె దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపింది. ఇదిలావుండగా రన్యా రావు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ కోర్టు ఆ విషయంపై నిర్ణయాన్ని వాయిదావేసి, డిఆర్‌ఐ కస్టడీ వినతిని మన్నించింది. ఆమె దుబాయ్ నుంచి తెచ్చిన బంగారు కడ్డీలు రూ. 12.56 కోట్ల విలువ చేస్తుంది. ఆ తర్వాత ఆమె ఇంట్లో సోదా చేయగా రూ. 2.06 కోట్ల విలువచేసే నగలు, రూ. 2.67 కోట్లు విలువచేసే భారత కరెన్సీ నగదు లభించింది. రన్యా రావు తరచూ దుబాయ్‌కు ఎందుకు వెళుతుందన్న దానిపై పరిశోధకులు నిఘాపెట్టి మరీ పట్టుకున్నారు. ఆమె బెంగళూరు విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ దాటేందుకు విఐపి ఛానెల్స్‌ను ఉపయోగించేదని ఆరోపణ.
ఉబ్బిన కళ్లు, ముఖంపై గాయాలు
రన్యా రావు ఉబ్బిన కళ్లు, ముఖంపై గాయాలున్న చిత్రాలు బాగా సర్యూలేట్ అయ్యాయి. దాంతో చాలా మంది అరెస్టు చేశాక ఆమెను కొట్టి ఉంటారని ఊహించుకుంటున్నారు. ఇదిలావుండగా కర్నాటక మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి ఆమె ఎలాంటి అధికారిక ఫిర్యాదు చేయనందున ఎలాంటి దర్యాప్తును చేపట్టలేదన్నారు. రన్యా రావు ఐపిఎస్ అధికారి రామచంద్ర రావు మారు కూతురు(స్టెప్ డాటర్). ‘ఒకవేళ ఆమె మహిళా కమిషన్‌కు లేఖ రాస్తే కలుగజేసుకుంటాం, సంబంధిత అధికారులకు రాసి ఆమెకు సాయపడమని కోరుతాం, దర్యాప్తు సక్రమంగా జరిగేలా చూస్తాం’ అని నాగలక్ష్మి తెలిపారు. మహిళ కానీ, మరెవరైనా కానీ.. వారిపై అధికారులు చేయిచేసుకోవడం అన్నది సరైనది కాదని నాగలక్ష్మి స్పష్టం చేశారు.