Monday, December 23, 2024

ఎముక మజ్జ మార్పిడితో పాక్ బాలికను రక్షించిన బెంగళూరు డాక్టర్లు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : అరుదైన ఇన్‌ఫాంటైల్ ఆస్టియోపెట్రోసిస్ (శిశు బోలు ఎముకల వ్యాధి) అనే వ్యాధితో బాధపడుతున్న 11 నెలల పాక్ బాలికను బెంగళూరు లోని ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్లు అసమాన వైద్య చికిత్సతో రక్షించగలిగారు. సమవియా అనే ఈ 11 నెలల పసికందుకు జన్యులోపంతో బోలు ఎముకల వ్యాధి సంక్రమించింది. ఎముకల మజ్జ మార్పిడి చికిత్స ద్వారా నారాయణ హెల్త్ సిటీ డాక్టర్లు ఆ బాలికకు ప్రాణాపాయం తప్పించ గలిగారు. ఈ వ్యాధిని పాలరాయి ఎముకల వ్యాధి అని కూడా పిలుస్తారని డాక్టర్లు చెప్పారు. అయితే ఈ వ్యాధితో పాటు ఎముకల పటుత్వం క్షీణించడం, దృష్టి లోపించడం, వినికిడి దెబ్బతినడం, ఎముకల మజ్జ క్షీణించిపోవడం తదితర తీవ్ర సమస్యలు ఏర్పడ్డాయి.

ఆమెకు ఎముక మజ్జ దానం చేసే దాతలు ఆమె కుటుంబంలో కానీ బయటివారు కానీ ఎవరూ లేరని, డాక్టర్లు చెప్పారు. ఈ వ్యాధి మొదట బయటపడినప్పుడు ఈ బాలిక వయసు కేవలం ఐదు నెలలే. అప్పటినుంచి బాలికకు దాతలు ఎవరైనా ఎముకమజ్జ దానం చేయగలరా అన్న ప్రయత్నం జరుగుతోంది. చివరకు ఆమె తండ్రి నుంచి మే 16 న మూలకణాలను సేకరించి ఎముకమజ్జగా మార్పిడి చేయడానికి ప్రయత్నించారు. పూర్తిగా కాకపోయినా కొంతవరకు సరిపోవడంతో డాక్టర్లు వైద్య చికిత్స ప్రారంభించారు. మొదట కపాలం ఒత్తిడి తగ్గించి కంటిచూపును రక్షించగలిగారు. చివరకు బాలిక రక్తంలో నూటికి నూరుశాతం దాత కణాలు పుంజుకున్నాయి. ఈ వ్యాధి నుంచి బాలిక పూర్తిగా కోలుకోగలిగింది. తిరిగి స్వదేశానికి బయలుదేరుతోందని డాక్టర్ సునీల్ భట్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News