Friday, December 20, 2024

తొట్టతొలి 3డి పోస్టాఫీసు ఆరంభం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : దేశంలోనే తొట్టతొలి అత్యంత అధునాతన త్రిడి ప్రింటెడ్ పోస్టాఫీసు అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులోని నివాసిత ప్రాంతం కేంబ్రిడ్జి లేఔట్‌లో నిర్మించిన ఈ పోస్టాఫీసుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం ప్రారంభించారు. నిర్మాణ వినూత్న సాంకేతిక విశిష్టతలను వినియోగించుకుని కంప్యూటరైజ్డ్ 3డి మోడల్ డ్రాయింగ్ పద్ధతిలో ఈ తపాలా కార్యాలయాన్ని నిర్మించారు. సాధారణ పద్ధతులలో కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలలు పట్టే నిర్మాణ ప్రక్రియ ఈ 3 డి టెక్నాలజీలో రోబోటిక్ ప్రింటర్ పద్ధతిలో కేవలం 45 రోజులలో పూర్తి చేశారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ లార్సన్ అండ్ టౌబ్రో (ఎల్ అండ్ టి) లిమిటెడ్ ఈ నిర్మాణం చేపట్టింది. కాగా ఐఐటి మద్రాసు విద్యార్థుల నుంచి అవసరం అయిన సాంకేతిక పరిజ్ఞానం అందింది. దేశ ఆత్మనిర్భర్ భారత్‌కు ఈ నిర్మాణం ఓ ప్రతీక అని కేంద్ర మంత్రి తెలిపారు. ఆయన రైల్వేశాఖతో పాటు కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖలు కూడా నిర్వహిస్తున్నారు.

బెంగళూరులో 3 డి పోస్టాఫీసు దేశ స్వయం సమృద్ధికి తార్కాణం అని ప్రధాని మోడీ ట్వీటు వెలువరించారు. బెంగళూరులో వెలిసిన ఇటువంటి పోస్టాఫీసు దేశ సృజనాత్మకతకు , ప్రగతికి తిరుగులేని ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణం అవుతుందన్నారు. కాగా నిర్మాణ విశేషాలను స్థానిక అధికారులు వివరించారు. ఇక్కడి కేంబ్రిడ్జి లేఔట్‌లో 1021 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని రూపొందించారు. ఇది చూడటానికి ముచ్చటైన నిర్మాణం అయింది. కాంక్రీటు గుణాలకు , 3 డి ప్రింటింగ్‌కు మధ్య అత్యంత కుదురైన సమన్వయం కీలకం అని దీనితోనే ఈ నిర్మాణానికి సరైన సమర్థతత, తగు విధంగా ఫినిషింగ్ ఏర్పడిందని వివరించారు. పైగా సాధారణ నిర్మాణ ప్రక్రియతో పోలిస్తే ఈ పద్ధతిలో నిర్మాణం కూడా తక్కువే. అంతేకాకుండా ఖర్చు కూడా తగ్గుతుంది.

కేంద్ర మంత్రి ఈ పోస్టాఫీసును ప్రారంభించడంతో ఇది ఇక ప్రజల సేవకు సిద్ధమైందని తపాల శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ త్రిడి టెక్నాలజీ నిర్మాణ ప్రక్రియ ఆరంభం అయిందని, ఇది పూర్తిస్థాయిలో ప్రధాన స్రవంతిలో అందరికి అందుబాటులోకి రాగానే ఈ పద్ధతిలో మరిన్ని నిర్మాణాలు ఉంటాయని కేంద్ర మంత్రి విలేకరులకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News