Saturday, November 23, 2024

మళ్లీ ఉగ్ర కలకలం

- Advertisement -
- Advertisement -

కర్నాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం జరిగిన బాంబు పేలుడుతో ఆ నగరమే కాకుండా దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవలి కాలంలో దేశంలో చాలా వరకు బాంబు పేలుళ్ల ఘటనలు లేని నేపథ్యంలో తాజా ఘటన రాష్ట్రాల్లో పోలీసు యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. ఎన్‌ఐఎ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. సాధారణంగా దేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద ఘటన జరిగినా దాని మూలాలు హైదరాబాద్‌లోనే ఉంటున్న నేపథ్యంలో నగర పోలీసులు కూడా హైఅలర్ట్ ప్రకటించారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు సహా జనం రద్దీ ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాల్లోనూ నిఘాను పెంచారు. అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జరిగిన బెంగళూరు పేలుళ్ల ఘటన వెనుక ఏదయినా ఉగ్రవాద కుట్ర దాగి ఉందా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. 15 ఏళ్ల క్రితం ముంబయి మహానగరంలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండను గుర్తుకు తెచ్చే విధంగా ఈ పేలుడు జరిగిన తీరు ఉండడమే ఈ అనుమానాలకు కారణం అవుతోంది. ఇదే సమయంలో ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సీనియర్ కమాండర్ అజామ్ చీమా శుక్రవారం పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో గుండెపోటుతో మరణించినట్లు వచ్చిన వార్తలు రావడం ..

రెండూ ఒకే రోజు జరగడం కాకతాళీయమే అయినా అప్పటి ఈ మారణకాండ గాయాలను మరోసారి కెలికినట్లయింది. అమెరికా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు జాబితాలో ఉన్న చీమా ముంబయిలో దాడులకు తెగబడిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్లు అమెరికా నిఘా వర్గాల సమాచారం. ముంబయి ఉగ్ర దాడులకు పాల్పడిన వారు, మారణకాండకు పథక రచన చేసిన వారు అందరూ కూడా ఇప్పటికీ పాకిస్తాన్‌లోనే సురక్షితంగా ఉన్నారు. వారిని తమకు అప్పగించాల్సిందిగా భారత్ ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా పాక్ పెడచెవిన పెడ్తూ వస్తూనే ఉంది. రెండేళ్ల క్రితం ఇదే రాష్ట్రంలోని మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు పేలుడుకు, దీనికి చాలా పోలికలున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దానికి, దీనికి ఏమయినా సంబంధం ఉందా అనే కోణం లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మంగళూరు, షిమోగా పోలీసు అధికారులు కూడా నగరానికి చేరుకుని బెంగళూరు పోలీసు అధికార్ల దర్యాప్తుకు సహకారం అందిస్తున్నారు. బస్సు దిగిన అనుమానితుడు హోటల్ వైపు వస్తున్న దృశ్యాలు సిసి టివి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారంగా అనుమానితుడి ముఖంపై ఉండే ముసుగును తొలగించి ఫోటోల ఆధారంగా అతడిని గుర్తించే పనిలో బెంగళూరు నగర నేరపరిశోధన విభాగం ఉంది. కాగా నిందితుడిని దాదాపుగా గుర్తించామని,

త్వరలోనే అతడిని పట్టుకుంటామని ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ చెప్తున్నారు. బెంగళూరు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని శివకుమార్ భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు, ధార్వాడ్, హుబ్లీలకు చెందిన నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన బిజెపి, కాంగ్రెస్ మధ్య రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారి తీస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అప్పుడే ఉగ్రవాద దాడులు మొదలయ్యాయని రాష్ట్ర బిజెపి ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న బుజ్జగింపు రాజకీయాల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కమలం పార్టీ అంటోంది. అయితే బిజెపి ఆరోపణలపై అటు సిఎం సిద్ధరామయ్య, ఇటు ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ఘాటుగానే స్పందించారు. బిజెపి హయాంలోనూ బాంబు పేలుళ్ల ఘటనలు జరిగాయని, అప్పుడు ఆ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడిందా? అని శివకుమార్ ప్రశ్నించారు. ఎవరినీ కాపాడే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. వాళ్లు తమకు సహకరిస్తే మంచిదని,

రాజకీయాలు చేయాలనుకున్నా తమకు అభ్యంతరం లేదని తెగేసి చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగించాలని తాము పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని కూడా చెప్పారు. ఏదిఏమయినా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ ఆరోపణలకు దిగడం కన్నా కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించడంతో పాటుగా అలాంటి ఘటనలు పురావృతం కాకుండా చర్యలు తీసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించడం అవసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News