Saturday, January 25, 2025

కొడుకును చంపిన సిఇఒ… బ్యాగ్‌లో శవంతో గోవా నుంచి కర్ణాటకకు

- Advertisement -
- Advertisement -

కర్ణాటకలో నిందితురాలిని అరెస్ట్ చేసిన గోవా పోలీస్‌లు
ఆరు రోజులపాటు రిమాండ్ విధించిన కోర్టు

పనాజి( గోవా ): బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ మహిళా సీఈవో తన నాలుగేళ్ల కుమారుడిని నిర్దాక్షిణ్యంగా హత్య చేయడమే కాకుండా ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఆ పసివాడి మృతదేహాన్ని బ్యాగ్‌లో దాచిపెట్టి గోవా నుంచి కర్ణాటక వరకు ట్యాక్సీలో ప్రయాణించింది. ఈ దుర్ఘటన గురించి గోవా పోలీస్‌లు ఆరా తీసి చివరకు కర్ణాటక లోని చిత్రదుర్గలో సోమవారం రాత్రి అరెస్ట్ చేయగలిగారు. మంగళవారం ఆమెను గోవాకు తీసుకు వచ్చారు. మాపుసా టౌన్ లోని కోర్టు ఆమెకు ఆరు రోజులపాటు రిమాండ్ విధించింది.

కన్నకొడుకును ఆమె ఎందుకు హత్య చేసిందో దర్యాప్తులో తెలియాల్సి ఉందని నార్త్‌గోవా ఎస్‌పి నిధిన్ వల్సాన్ పేర్కొన్నారు. పోలీస్‌ల వివరాల ప్రకారం….బెంగళూరుకు చెందిన సుచనా సేత్ ‘మైండ్‌ఫుల్ ఎఐ ల్యాబ్ ’ అనే స్టార్టప్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. 2021లో ఆమె టాప్ ‘100 బ్రిలియంట్ ఉమెన్ ఇన్ ఎఐ ఎథిక్స్’గా గుర్తింపు పొందారు. సుచనా సేథ్ తన కుమారునితోపాటు జనవరి 6న నార్త్ గోవా లోని కాండోలిమ్ పట్టణంలో రెంటెడ్ సర్వీస్ అపార్ట్‌మెంట్ తీసుకున్నారు. అక్కడ రెండు రోజుల పాటు ఉన్న తరువాత బెంగళూరులో కొంత పని ఉందని, వెళ్లడానికి టాక్సీ ఏర్పాటు చేయాలని ఆమె అపార్ట్‌మెంట్ సిబ్బందికి చెప్పారు.

టాక్సీని అద్దెకు తీసుకోవడం కన్నా విమానంలో తక్కువ ఖర్చుతో బెంగళూరు వెళ్లవచ్చని సిబ్బంది చెప్పినప్పటికీ , తాను టాక్సీ లోనే వెళ్తానని నిందితురాలు చెప్పడంతో సిబ్బంది జనవరి 8న టాక్సీ ఏర్పాటు చేశారు. ఆరోజు ఆమె ఉదయాన్నే బయలుదేరారు. ఆమె వెళ్లిన తరువాత అపార్టుమెంట్ గదిని శుభ్రం చేయడానికి సిబ్బంది వెళ్లగా టవల్‌పై రక్తం మరకలు కనిపించాయి. అపార్ట్‌మెంట్ యాజమాన్యం వెంటనే కాలంగూటే పోలీస్‌లకు తెలియజేశారు. పోలీస్‌లు వచ్చి వాకబు చేశారు. అపార్టుమెంట్ విడిచి ఆమె వెళ్లినప్పుడు ఆమె కుమారుడు కనిపించలేదని సిబ్బంది పోలీస్‌లకు చెప్పారు. ఆమె తనతో చాలా పెద్ద బ్యాగ్ మోసుకెళ్లినట్టు తెలిపారు.

పోలీస్‌లు నిందితురాలికి కాల్ చేసి రక్తపు మరకలు గురించి, కుమారుడి మిస్సింగ్ గురించి ఆరా తీశారు. రక్తపు మరకలు తన నెలసరికి సంబంధించినవని, తన కుమారుడు దక్షిణ గోవా లోని మార్గావో టౌన్ లోగల తన స్నేహితునితో ఉన్నాడని ఆమె బదులిచ్చింది. మార్గావో సమీపాన గల ఫటోర్డా పోలీస్‌ల సాయంతో గోవా పోలీస్‌లు వాకబు చేయగా, ఆమె ఇచ్చిన స్నేహితుని అడ్రస్ వట్టిదేనని తేలింది. దీంతో బెంగళూరు వెళ్తున్న టాక్సీ డ్రైవర్‌తో అనుమానం రాకుండా పోలీస్ ఇన్‌స్పెక్టర్ మాట్లాడారు.

ఆ సమయంలో కర్ణాటక లోని చిత్రదుర్గ జిల్లాకు టాక్సీ చేరుకుంది. సమీపాన గల పోలీస్ స్టేషన్‌కు నిందితురాలిని తీసుకెళ్లాల్సిందిగా టాక్సీ డ్రైవర్‌కు పోలీస్ ఇన్‌స్పెక్టర్ సూచించారు. చిత్రదుర్గ లోని పోలీస్‌లు ఆమె బ్యాగ్‌ను తనిఖీ చేయగా పిల్లవాడి మృతదేహం బయటపడింది. కాలంగూటే పోలీస్‌లు చిత్రదుర్గం వెళ్లి ఆమెను అదుపు లోకి తీసుకున్నారు. నిందితురాలు పశ్చిమబెంగాల్‌కు చెందిన వ్యక్తి కాగా, భర్త కేరళ వాసి. ఆయన ప్రస్తుతం జకర్తా (ఇండోనేసియా)లో ఉంటున్నారు. అయితే తాము విడిపోయామని, విడాకులు తీసుకుంటున్నామని ఆమె చెప్పిందని ఎస్‌పి పేర్కొన్నారు. జకర్తాలో ఉన్న ఆమె భర్తకు ఈ హత్య గురించి పోలీస్‌లు తెలియజేశారు. గోవా పోలీస్‌లు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News