Saturday, December 21, 2024

డాక్టర్ కోటు వేసుకుని ఆస్పత్రిలో కిలేడీ బంగారం చోరీ..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలోకి డాక్టర్ వేషంలో తెల్లకోటు వేసుకుని వచ్చి ఇద్దరు మహిళా రోగుల నుంచి బంగారం చోరీ చేసి ఉడాయించిన ఒక 35 ఏళ్ల మాయలాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో వివేక్‌నగర్‌లోని సెయింట్ ఫిలోమినా ఆస్పత్రిలోకి తెల్లకోటు ధరించి, చేతిలో స్టయిలిష్ బ్యాగ్‌తో ప్రవేశించిన ఆ మహిళ నేరుగా మొదటి అంతస్తులోని బి వార్డులోకి వెళ్లింది.

అక్కడ 7వ నంబర్ గదిలో శ్వాసకోశ సమస్యలకు చికిత్స పొందుతున్న 72 ఏళ్ల జి సరస్ అనే వృద్ధురాలి వద్దకు ఆమె వెళ్లింది. తనను తాను డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఆమె రోగిని పరీక్షించాలని చెప్పి అటెండెంట్‌గా ఉన్న సరస్ కుమారుడు 34 ఏళ్ల రమేష్ కుమార్‌ను బయటకు వెళ్లాలని కోరింది. 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన ఆ కిలేడీ రోగికి అంతా నార్మల్‌గా ఉందని, ఆమెను డిస్టర్బ్ చేయవద్దని చెప్పి వెళ్లిపోయింది.

కొద్ది సేపటి తర్వాత నర్సు వచ్చి రోగికి రక్త నమూనాలు తీసుకోవాలని చెప్పడంతో రమేష్ కంగారు పడ్డాడు.. ఇంతకు ముందు వచ్చిన మహిళ గురించి చెపడంతో ఆమె ఎవరో తెలియదని నర్సు తెలిపింది. రోగి వద్దకు వెళ్లి చూడగా ఆమె మెడలోని 41 గ్రాముల బంగారు చెయిన్, 5 గ్రాముల బంగారు ఉంగరం కనిపించలేదు. ఇంతలో మరో గదిలో చికిత్స పొందుతున్న కోమల అనే 58 ఏళ్ల రోగికి చెందిన బంగారు చెయిన్ కూడా మాయమైనట్లు తెలిసింది. ఆ రోగి వద్దకు కూడా కిలేడీ వెళ్లినట్లు బయటపడింది. రమేష్ ఇచ్చిన ఫిర్యాదుపై అశోక్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిసి టివి ఫుటేజ్ ఆధారంగా ఆ కిలేడీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News