Sunday, December 22, 2024

ర్యాపిడో బైక్‌పై ప్రయాణించిన యువతి.. డ్రైవర్ బైక్ నడుపుతూ హస్తప్రయోగం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కొందరు సైకోల కారణంగా మహిళలు ఏదో ఒక రూపంలో వేధింపులకు గురికావడం పరిపాటిగా సాగుతోంది. తాజాగా బెంగళూరులో జరిగిన సంఘటన ఆందోళన కలిగిస్తోంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న తరువాత ఇంటికి వెళ్లడానికి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న యువతికి డ్రైవర్ అసభ్య ప్రవర్తన తీవ్ర గగుర్పాటు కలిగించింది. దీనిపై చివరికి ఆమె ఫిర్యాదుతో పోలీస్‌లు ఆ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. బెంగళూరులో యువతిని బైక్‌పై ఎక్కించుకున్న ర్యాపిడో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. వెనుక యువతిని కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తూ ఒక చేత్తో డ్రైవ్ చేయడం ప్రారంభించాడు. మరో చేతితో హస్త ప్రయోగం చేశాడు. దీంతో ఆ యువతి భయంతో కపించిపోయింది.

చివరకు నిందితుడిని పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఎలక్ట్రానిక్ సిటీలో ఉంటున్న అథిర పురుషోత్తమన్ జులై 21న ఈ సంఘటన గురించి వివరించారు. బెంగళూరు టౌన్‌హాల్‌లో మణిపూర్ హింసాకాండకు నిరసన తెలిపే కార్యక్రమానికి హాజరైన తరువాత ఇంటికి వెళ్లడానికి యాప్‌లో ర్యాపిడో ఆటోలను బుక్ చేసుకున్నారు. కానీ చాలా సార్లు ర్యాపిడో ఆటోలు క్యాన్సిల్ కావడంతో చివరకు ర్యాపిడో బైక్‌ను బుక్ చేసుకున్నారు.

ఓ యువకుడు ర్యాపిడో తో రిజిస్టర్ అయిన బైక్ కాకుండా మరో బైక్‌పై వచ్చాడు. ఆమె అనుమానంతో తాను బుక్ చేసుకున్నది ఇది కాదని ప్రశ్నించగా, తన బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చానని, తాత్కాలికంగా ఈ బైక్ వినియోగిస్తున్నానని నమ్మ బలికాడు. తాను చేసిన బుకింగ్‌ను ధ్రువీకరించుకున్నాక ఆమె బైక్ ఎక్కింది. కానీ బైక్ డ్రైవర్ దారి మధ్యలో చుట్టూ ఇతర వాహనాలు లేని ఏకాంత ప్రాంతంలో ఒక చేత్తో బైక్ నడుపుతూ మరో చేతితో హస్తప్రయోగం చేయడం ప్రారంభించాడు. అథిర భయంతో ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయింది.

తన ఇంటి అడ్రస్ తెలియకుండా ఉండడానికి 200 మీటర్ల దూరం లోనే బైక్‌ను ఆపించి దిగిపోయింది. కానీ డ్రైవర్ అంతటితో ఆగలేదు. తరచూ కాల్ చేస్తూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతూ వేధించాడు. ఫోన్ నంబర్ బ్లాక్ చేసినా వేరే నంబర్లతో ఫోన్ చేయడం ప్రారంభించాడు. వాట్సాప్ చాట్‌లో డ్రైవర్ హార్ట్, ముద్దుల ఎమోజీలను ఉపయోగించాడు. ఆ మహిళలకు లవ్‌యూ అని చెప్పాడు. దీంతో ఆమె తన ట్విటర్‌లో ఈ సంఘటనను వివరించింది. ఆ మెసేజ్‌ల స్క్రీన్ షాట్ కూడా అప్‌లోడ్ చేసింది. జులై 22న బెంగళూరు పోలీస్‌లు దీనిపై స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News