Monday, December 23, 2024

ఇక చివరి నిమిషంలోనూ రైళ్లలో బెర్త్ కన్ఫర్మ్

- Advertisement -
- Advertisement -

Berth confirm even at last minute through HTTp

హెచ్‌హెచ్‌టి పరికరం ద్వారా టిటిఇలు ఎప్పటికప్పుడు ఖాళీలు తెలుసుకునే వీలు
ఖాళీ బెర్త్‌ల కేటాయింపులో ఆర్‌ఎసి, వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు ప్రాధాన్యత
నాలుగు నెలలుగా ప్రతి రోజూ దాదాపు 7,000 మందికి లభిస్తున్న బెర్త్‌లు

న్యూఢిల్లీ: రిజర్వేషన్ లేకుండా రైళ్లలో ప్రయాణం చేయడం ఎంత కష్టమో అది అనుభవించిన వారికి మాత్రమే తెలుసు. ఒక వేళ రిజర్వ్ చేసుకున్నా కన్‌ఫర్మ్ కాక ఆర్‌ఎసి, వెయింటిగ్ లిసులో ఉన్నా తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు సీటు లేదా బెర్త్ కోసం ప్రయాణికులు పడే పాట్లు అంతా ఇంతా కాదు. రైళ్లలో ఉండే టికెట్ చెకింగ్ సిబ్బంది( టిటిఇ)ని రకరకాలుగా బ్రతిమాలుకోవడం మనం ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాము. అయితే ఇకపై ఆ ఇబ్బంది ఉండదు. రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన చేతిలో పట్టుకునే పరికరం( హెచ్‌హెచ్‌టి)ల ద్వారా చివరి నిమిషంలో సైతం ఖాళీగా ఉన్న బెర్త్, లేదా సీటును ఇలాంటి వారికి కేటాయించడానికి వీలవుతోంది. నాలుగు నెలల క్రితం ప్రవేశపెట్టిన ఈ పరికరం ద్వారా ప్రతి రోజూ రైళ్లలో సగటున దాదాపు 7,000 మంది కన్ఫర్మ్ కాని టికెట్ హోల్డర్లు బెర్త్‌లు, సీట్లు పొందగలుగుతున్నారు. ఒక ఐపాడ్ సైజులో ఉండే ఈ హెచ్‌హెచ్‌టిలో రైళ్లకు సంబంధించిన ప్రయాణికుల రిజర్వేషన్ చార్టులు అంతకు ముందే లోడయి ఉంటాయి.

గతంలో మాదిరి పేపర్ రిజర్వేషన్ చార్టులను చెక్ చేయడానికి బదులు టిటిఇలు ఈ పరికరాల ద్వారా ఎప్పటికప్పుడు బుకింగ్స్ పరిస్థితిని తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ పరికరాలు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ సెంట్రల్ సర్వర్‌కు కనెక్ట్ అయి ఉంటాయి. ఒక వేళ రిజర్వ్‌డ్ టికెట్ ఉన్న ప్రయాణికుడెవరైనా రాకపోయినా, చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నా ఖాళీ అయిన బెర్త్ ఈ పరికరంలో డిస్‌ప్లే అవుతంది. దీనివల్ల టిటిఇ ఆ సీటును రైల్లో ఉన్న వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికుడికో లేదా ఆర్‌ఎసిలో ఉన్న ప్రయాణికుడికో కేటాయించడానికి వీలవుతుంది. ఖాళీగా ఉన్న బెర్త్‌ల వివరాలను అలాంటి ప్రయాణికులు ఈ పరికరం ఉండే టిటిఇ వద్ద చెక్ చేసుకోవచ్చు కూడా. దీనివల్ల నడిచే రైళ్లలో బెర్త్‌ల కేటాయింపులో పారదర్శకత కూడా ఉంటుంది. పిటిఐ సంపాదించిన డేటా ప్రకారం నాలుగునెలల క్రితం ప్రారంభించిన ఈ ప్రాజెక్టు కింద దాదాపు 1,390 రైళ్లలోని టిటిఇలు ప్రతి రోజూ దాదాపు 10,745 హెచ్‌హెచ్‌టిలు తీసుకెళుతున్నారు.

గత నాలుగు నెలల్లో సగటున ప్రతి రోజూ 5,448 మంది ఆర్‌ఎసి ప్రయాణికులు,2,759 మంది వెయిటింగ్ లిస్టులోని ప్రయాణికులకు స్పష్టమైన బెర్త్‌లను కేటాయించడం జరుగుతుందని ఆ గణాంకాలను బట్టి తెలుస్తోంది. రాబోయే మూడు నెలల్లో అన్ని దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలోని టిటిఇలకు ఈ పరికరాలను ఇవ్వడం జరుగుతుందని అధికారులు చెప్పారు. అంతేకాకుండా డిజిటల్ పేమెంట్ ఆప్షన్ల ద్వారా ప్రయాణికులనుంచి అధిక టికెట్ చార్జీలు, పెనాల్టీలు, ఇతర చార్జీలను కూడా వీటి ద్వారా టిటిఇలు వసూలు చేయవచ్చు. రాబోయే రోజుల్లో ఇందుకు రసీదులు జారీ చేయడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చని ఆ అధికారులు తెలిపారు. ఈ హెచ్‌హెచ్‌టి పద్ధతిని ప్రవేశపెట్ట్టిన తర్వాత ఆర్‌ఎసి, లేదా వెయిటింగ్ లిస్టులో ఉండే ప్రయాణికులకు ప్రాధాన్యత లభించేలా చూడగలుగుతున్నట్లు వారు చెప్పారు. అంతేకాదు గతంలో జరిగే ఖాళీగా ఉన్న బెర్త్‌లను ఇతరులకు కేటాయించడం లాంటి అవినీతిని అడ్డుకట్ట వేయగలుగుతున్నట్లు వారు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News