ఆన్‌లైన్ బెట్టింగ్ మాయాజాలంలో ఎన్నో కుటుంబాలు బలైపోతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్‌లను వ్యసనంగా మార్చుకుని అధిక వడ్డీలకు అప్పులు చేసిన భారీ మొత్తంలో కూరుకుపోతున్నారు. మొబైల్ ఓపెన్ చేస్తే చాలు వన్ ఎక్స్‌బెట్, మెగాపరి, మోస్ట్‌బెట్, పరిపీన, పరిమ్యాచ్, 10 సిఆర్‌ఐసి, మెల్‌బెట్, మేట్‌బెట్, 1 ఎక్స్‌బెట్, బిసి డాట్ గేమ్, 22 వైట్, రాజా బెట్, స్టేక్ డాట్ కమ్, డఫ్పాబెట్ వంటి ఎన్నో అఫీషియల్, అనఫీషియల్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. యూట్యూబ్ సోషల్ మీడియా, పలు వెబ్‌సైట్లలో రూ. 100 పెడితే రూ. 1000 ఇస్తామంటూ బెట్టింగ్ యాప్స్ యాడ్ పేరుతో మోసం చేస్తున్నారు. కొత్త కస్టమర్లకు మొదట్లో రూ. 100 కు రూ. 200, 1000 కు రూ. 2000, రూ. 3000 ఇస్తూ మెల్లగా యువతను ఈ ఊబి లోకి దింపుతున్నారు. ప్రస్తుతం యువత పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలూ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌లో కూరుకుపోతున్నారు.
గతంలో ఈ వ్యసనం కొంతమంది యువతకే పరిమితం కాగా, ఇప్పుడు అది ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, బ్యాంకర్లు, ఇలా తేడాలేకుండా ప్రతి ఒక్కరూ బెట్టింగులు ఆడుతున్నారు. అయితే ఈ బెట్టింగులు ఆడేవారిలో 99 శాతం మంది చేతులు కాల్చుకుని ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీగా సంపాదించవచ్చని అనుకుంటున్నారు. అప్పులు తీర్చే అవకాశం లేక కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందో పోలీసులు దర్యాప్తులు చేస్తున్నారు. అసలు ఇంత జరిగినా పోలీసులను ఎందుకు బాధితులు ఆశ్రయించడం లేదన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సైబర్ మోసాలు, బెట్టింగ్‌ల్లో దురాశ ఉన్నచోటే ఎదురుదెబ్బ తగులుతుంది. డబ్బులకు ఆశపడి స్తోమతకు మించి డబ్బులు పెడుతూ భారీగా మోసపోతున్నారు. రూ. 10 వేలు అయితే అదృష్టం కలిసి వస్తుందని రూ. లక్ష బెట్టింగ్ కడుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది యువకులు కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించడం కన్నా అడ్డదారులు తొక్కడం లేదా బెట్టింగ్‌ద్వారా డబ్బులను సంపాదించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇందులో విజయం సాధిస్తే సరి. లేకపోతే చివరకు వారి జీవితాలే అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి.
ఉదాహరణకు ఖమ్మం ఖానాపురం హవేలీకి చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నా, ఆన్‌లైన్, ఆఫ్‌లైన బానిసై రూ. 20 లక్షల వరకు అప్పులు చేశాడు. తండ్రి సుమారు రూ. 5 లక్షల వరకు అప్పు తీర్చినా, మిగతా అప్పులు తీర్చాలని ఒత్తిళ్లు రావడంతో భరించలేక ఫిబ్రవరి 17 వతేదీ అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. కామారెడ్డిలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ. 80 లక్షలకు పైగా కోల్పోయి, అప్పుల బాధలో మునిగిపోయిన సాఫ్ట్‌వేర్‌ఉద్యోగి చివరికి ఫిబ్రవరి 18న ఆత్మహత్య చేసుకున్నాడు. గత ఏడాది అక్టోబరులో తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో ఆన్‌లైన్ జూదం కోసం కొడుకు చేసిన రూ. 30 లక్షల అప్పులు తీర్చలేకపోవడంతో తల్లిదండ్రులతోపాటు కుమారుడు ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకుని 25 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండవుతాపురం గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు పబ్జి గేమ్ ద్వారా, ఆన్‌లైన్ గేమ్ ద్వారా మూడు లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వర్ధన్నపేట మండలంలో గత ఏడాది రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు యువకులు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైపోవడం దయనీయం. ఇలాంటి విషాదాంత సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. దేశంలో 1867లో పబ్లిక్ గాంబ్లింగ్ యాక్ట్ వచ్చింది. దీని ప్రకారం పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. అయితే ఈ చట్టంలో గాంబ్లింగ్ నిర్వచనంపై గందరగోళం నెలకొంది. ఇందులో గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్ అనే నిర్వచనాలు వేర్వేరుగా ఉన్నాయి. గేమ్ ఆఫ్ స్కిల్ పరిధి లోకి చదరంగం వంటి వ్యూహాత్మకమైన, మేధాశక్తి సామర్ధంతో కూడిన క్రీడలు వస్తాయి. దీనికి విరుద్ధంగా డైస్ లేదా లాటరీలు, పూర్తిగా అదృష్టంపై ఆధారపడేవి గేమ్స్ ఆఫ్ ఛాన్స్ కేటగిరిలోకి వస్తాయి. నైపుణ్యానికి, అదృష్టానికి మధ్య రేఖ అస్పష్టంగా ఉంది. ఈ సంక్లిష్టతను అనుకూలంగా మార్చుకుని ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ గాంబ్లింగ్ దేశంలో చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇవన్నీ స్కిల్ గేమ్స్ కిందనే పరిగణించడం పరిపాటి అయింది.
చాలా కేసుల్లో ఈ కంపెనీలకు వెనుక చైనా పెట్టుబడుల మద్దతు ఉంటోంది. ఈ విధంగా విదేశీ నిధుల బానిసత్వం మన యావత్ భారతదేశాన్ని చుట్టివేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఈనాటి ఆన్‌లైన్ గాంబ్లింగ్‌ను సమర్ధంగా నియంత్రించగలిగేలా చట్టాలను రూపొందించవలసి ఉంది. బెట్టింగ్‌కు డబ్బు ఖర్చుపెట్టడాన్ని అడ్డుకోవాలి. అయితే ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా తీసుకోవడం లేదు. ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం టాక్సులు విధించడం ద్వారా దీని మార్గాన్ని చట్టబద్ధత చేస్తోంది. కేవలం ఆదాయం తెచ్చే పరిశ్రమగా చూస్తూ ఉండకుండా విధానకర్తలు దీని చీకటి కోణాన్ని కూడా పరిశీలించాలి. డ్రగ్స్ కన్నా గాంబ్లింగ్ అన్నది అధ్వాన మైన వ్యవసనమని మహాత్మా గాంధీ ప్రబోధించారు. ఎందుకంటే గాంబ్లింగ్ వల్ల వచ్చే హాని శాశ్వతం. ఇది కుటుంబాన్ని సమాజాన్ని గుల్లచేస్తుంది. నేడు ఈ సామాజిక రుగ్మత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా అందంగా ప్రత్యక్షమవుతోంది. దీన్ని ఎలాగైనా మనం నియంత్రించక తప్పదు.