Monday, January 20, 2025

బిఆర్‌ఎస్‌కు ఉప్పల్ మాజీ ఎంఎల్‌ఎ షాక్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీని ముఖ్యనేతలు వీడుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు కారు దిగేశారు. కొందరు కాంగ్రెస్ లోకి, మరికొందరు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఉన్న కొద్దీమంది నేతలు కూడా లోక్‌సభ ఎన్నికలకు ముందు వెళ్లిపోవాలని నిశ్చయించు కున్నారు. తాజాగా ఉప్పల్ మాజీ ఎంఎల్‌ఎ బేతి సుభాష్‌రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌కు పంపారాయన. మాజీ ఎంఎల్‌ఎ బేతి సుభాష్‌రెడ్డి రాజీనామా వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మల్కాజ్‌గిరి ఎంపి టికెట్ విషయంలో పార్టీ హైకమాండ్ ఎవరినీ సంప్రదించకుండానే లక్ష్మారెడ్డికి కేటాయించడమే కారణం. తన రాజీనామాకు కారణాలు వివరిస్తూ సుభాష్ రెడ్డి ఓ లేఖను కెసిఆర్‌కు పంపారు. ’నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఆశయాలకు అనుగుణంగా పార్టీ అభివృద్దికి కోసం పాటుపడ్డాను. నాపై ఎటువంటి మచ్చలేకున్నా, గత ఎన్నికల్లో నన్ను కాదని బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు.

అయినా మీ మీద విశ్వాసంతో పార్టీకి విధేయుడిగా ఉంటూ ఆయన గెలుపు కోసం కృషి చేశారు. ఎంపి ఎన్నికల్లోనైనా అవకాశం వస్తుందని ఆశించాను. మాటమాత్రం చెప్పకుండా, ఎటువంటి చర్చ లేకుండానే రాగిడి లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. బిజెపి మాత్రం నా తోటి ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్‌కు టికెట్ ఇచ్చింది. బిఆర్‌ఎస్ అవకాశవాద ఎంపిలను గెలిపించటం కంటే, ఉద్యమ సహచరుడు, బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. కావునా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా.’ అని సుభాష్ రెడ్డి సదరు లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత కనీసం నియోజకవర్గాల నేతలను సంప్రదించకుండా సొంతంగా నిర్ణయం తీసుకోవడంపై ఆయన కాసింత ఆగ్రహంగా ఉన్నారు. దీనికితోడు ముఖ్యనేతలంతా కారు దిగిపోవడంతో ఇక ఆ పార్టీ పనైపోయిందని భావించారు. చివరకు రాజీనామా ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు. బిజెపి తీర్థం పుచ్చుకునేందుకు మాజీ ఎంఎల్‌ఎ బేతి సుభాష్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకున్నారు.

2018లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎంఎల్‌ఎగా గెలిచిన సుభాష్‌రెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ టికెట్ ఇవ్వలేదు. చివరి నిమిషం వరకు ప్రయత్నించినా, ఆయనకు నిరాశే దక్కింది. బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వటంతో అప్పట్నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీని వీడుతారని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతుండగా తాజాగా గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు.ఉద్యమ కారుడు ఈటెల రాజేందర్‌కు కమలం పార్టీ టికెట్ ఇచ్చిందని, ఆయనను గెలిపించేందుకు నిర్ణయించు న్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. బేతి బాటలోనే మరికొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో మరికొందరు నేతలు కారు దిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News