Wednesday, January 22, 2025

బేటీ బచావో బేటీ పడావో!

- Advertisement -
- Advertisement -

హక్కులు, ఆరోగ్యం, సామాజిక ఎదుగుదల వైపు నడిపించి బాలికలను రక్షించాలి. విద్యలో నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారితీస్తున్నందున బాలికలను చదివించాలి. అన్ని రంగాల్లో ఆరితేరి విద్యతో వికసించే బాలిక అందిరావడం వల్ల సమాజం పురోగతి చెందగలుగుతుంది. హుందాగా జీవించడానికి, తన హక్కుల గురించి తెలుసుకోవడానికి, ఉపాధి బాటలో నడవడానికి బాలికను రక్షించి, చదివించడం తల్లిదండ్రులు తమ కర్తవ్యంగా ఎంచుకోవాలి. స్త్రీ పురుష నిష్పత్తిలో ఆందోళనకరమైన తేడా కనిపిస్తున్న నేపథ్యంలో ఆడపిల్లను రక్షించడం విధిగా భావించాలి. బాలికల పట్ల సమాజం వివక్ష చూపుతున్నా దేశం పరువును అన్నిరంగాల్లో నిలబెడుతున్నది ఆడపిల్లలే.

అలాంటి అమ్మాయిలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తే తమ సత్తా చాటుకుంటారు. లింగ సమానత్వం కోసం భ్రూణ హత్యలు, పౌష్టికాహార లోపాలు, అనారోగ్యం, అవిద్య బాల్య వివాహాలు, అక్రమ రవాణా వంటి సమస్యలపై చిత్తుశుద్ధితో పనిచేయాలి.శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక, రాజకీయ, క్రీడారంగాల్లో కీలకపాత్ర పోషించేలా తీర్చిదిద్దాలి. ఆర్థిక స్వేచ్ఛ, ఉపాధి కల్పన కోసం బాలికల నైపుణ్యాలను మెరుగుపరచాలి. స్పర్శలో మంచి, చెడులను గుర్తించడం, అనుచిత ప్రవర్తనపై బాలికలకు అవగాహన కలిగించాలి. ఈమేరకు ‘బాలికలను రక్షిద్దాం బాలికలను చదివిద్దాం’అనే ప్రచారాన్ని బాలికల కోసం బాలికల చేత రెండేళ్ల క్రితం అహ్మదాబాద్‌లో 6000 మంది పాఠశాల విద్యార్థినులతో బృంద్య నృత్యం చేశారు. ఇది కాస్త ప్రపంచ రికార్డుగా నమోదైంది.మన దేశంలో అమ్మాయిలకు అవకాశాల సంగతి పక్కనపెడితే, పుట్టుకలోనూ సమానత్వం కొరవడిన దుస్థితి నెలకొంది.

అబ్బాయిలతో పోలిస్తే ఏడాదిలోపు అమ్మాయిల మరణాలు అత్యధికంగా ఉంటున్నాయి. ఆడపిల్ల గుండెల మీద కుంపటి అనే భావన సమాజంలో తీవ్రంగా ఉంది. గతంతో పోలిస్తే ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలోలేదు. కడుపులో ఉన్నది ఆడశిశువని తెలియగానే గర్భం తీయించుకుంటున్న తల్లిదండ్రులు ఇప్పటికీ ఉన్నారు. దేశ వ్యాప్తంగా రెండు దశాబ్దాలుగా (2000 2019) మధ్యకాలంలో 90 లక్షల భ్రూణ హత్యలు జరిగాయి. ఇవన్నీ ఆడశిశువులవే కావడం బాధాకరం. మరోపక్క అబ్బాయిలే కావాలనే ఆకాంక్ష క్రమంగా తగ్గుతుండడం సంతోషకర పరిణామం. దేశ వ్యాప్తంగా ప్రతి వంద మంది అమ్మాయిలకు 108 మంది అబ్బాయిలు ఉన్నట్లు ‘ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 201921’ వెల్లడించింది. 2011లో ప్రతి వంద మంది అమ్మాయిలకు 111 మంది అబ్బాయిలుండేది. ఈమేరకు లింగ నిష్పత్తి కొంత మేరకు మెరుగుపడినట్లే. 2010లో 4.80 లక్షల మంది ఆడశిశువులు జన్మించగా, 2019 నాటికి ఆ సంఖ్య 4.10 లక్షలకు పరిమితమైంది.

దేశంలో అతి పెద్ద జనాభా ఉన్న హిందువుల్లో ఆడశిశువుల సంఖ్య తగ్గిపోతోంది. సిక్కు మహిళల్లో 1998 99 మధ్య కాలంలో అబ్బాయిలు కావాలనే భావన ఎక్కువగా ఉండగా, ప్రస్తుతం అది 9 శాతానికి తగ్గిపోయింది. హిందు, ముస్లిం మహిళల్లో 34 మంది తమకు కొడుకే పుట్టాలన్న కోరిక ఉండగా, ప్రస్తుతం అది కాస్త 15 శాతానికి తగ్గింది. అలాగే క్రైస్తవ మహిళల్లో 20 శాతం మగబిడ్డ కావాలనే ఆసక్తితో ఉండగా, ప్రస్తుతం ఈ శాతం 12కు తగ్గింది. స్థితిమంతులు, చదువుకున్న మహిళలంతా కొడుకు కావాలన్న ఆసక్తిని పెద్దగా చూపకపోవడం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే స్పష్టం చేసింది. ఈ పరిణామం అమ్మాయిల సంఖ్య పెరగడానికి అవకాశముండగా, వారిని రక్షించుకోవడం బాధ్యతగా స్వీకరిస్తున్న భావన కలుగజేస్తోంది. కలలు కనే స్వేచ్ఛా, కన్నవారి కలలను నిజం చేసే స్వాతంత్య్రం, రక్షణ, గౌరవం బాలికలకు ఈ సమాజంలో చేకూరాలనే ఆశావహ దృక్పథం తల్లిదండ్రుల్లో కనిపిస్తుండడం శుభ సూచకం.

ఇదిలా వుండగా, దేశీయంగా 16 రాష్ట్రాల్లో అబ్బాయిలతో పోలిస్తే స్త్రీ, శిశు మరణాల రేటు గతంలో అధికంగా ఉండేది. 2011 నుంచి అది క్రమంగా తగ్గుతూ వస్తోంది. గ్రామాల్లో స్త్రీ, పురుష శిశు మరణాల్లో వ్యత్యాసం తగ్గినా, అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల మరణాల రేటు కొద్ది అధికంగానే ఉంది. ప్రసవాల సమయంలో మహిళల భద్రత, పిల్లల ఆరోగ్యాన్ని తరచూ పరీక్షించడం, గర్భిణులకు మెరుగైన ఆహారం అందించడం, శిశు సంరక్షణకు పాలకులు సరైన చర్యలు తీసుకోవడం వల్ల ఈ శాతాన్ని తగ్గించుకోవచ్చు. విద్య విషయానికొస్తే బాలికను చదివించడంలో నిర్లక్ష్యం భారీ మూల్యానికి దారితీస్తోంది. వారిని విద్యావంతులను చేయకపోవడం, పాఠశాల స్థాయిలోనే వారి చదువుకు స్వస్తి పలకడం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు రూ. 30 లక్షల కోట్ల మేరకు నష్టం జరుగుతున్నట్లు 2018 లో ప్రపంచ బ్యాంకు తన నివేదికలో బహిర్గతం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 89 శాతం మంది బాలికలు వారి ప్రాథమిక విద్యనుపూర్తి చేసుకుంటుండగా, 77శాతం మంది బాలికలు మాత్రమే ఉన్నత స్థాయి విద్యను అభ్యసిస్తున్నారని నివేదికలో వివరించింది. ఉన్నత స్థాయి విద్యనభ్యసించిన మహిళలు వారికంటే తక్కువ చదువుకున్న వారితో పోల్చితే ఎక్కువ పని చేస్తున్నారని, దాదాపు రెండింతలు ఆర్జిస్తున్నారని తెలిపింది.

విద్యనభ్యసించకపోవడం వల్ల 13 కోట్ల మంది బాలికలు ఇంజినీర్లు, జర్నలిస్టులు, సిఇఒలు కాలేకపోతున్నారని మలాలా ఫండ్ కో ఫౌండర్, నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యాసఫ్‌జాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ట్రిలియన్లలో నష్టం కలుగుతున్నదని, దానితో ప్రజా ఆరోగ్యం, స్థిరత్వాన్ని బలోపేతం చేయొచ్చని తెలిపారు. మెరుగైన ప్రపంచాన్ని నిర్మించాలని భావిస్తే బాలికకు ఉన్నతస్థాయి విద్య అవసరమన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 6 నుంచి 17 ఏళ్ల వయస్సున్న 13.2కోట్ల మంది బాలికలు పాఠశాలకు వెళ్లడంలేదని, వారిలో 75 శాతం మంది కౌమారదశ పిల్లలున్నట్లు వెల్లడైంది. విద్యలో లింగ అసమానత తీవ్ర సమస్యగా పరిణమించకూడదని, దాని వల్ల ప్రపంచానికి భారీస్థాయిలో నష్టం చేకూరుతుందన్నారు. లింగ అసమానత, భేదానికి ముగింపుపలికి, బాలబాలికలకు సమాన అవకాశాలు కల్పించాలని నాలుగేళ్ల క్రితం మలాలా యాసఫ్‌జాయ్ స్పష్టం చేసినప్పటికీ, విద్యలో బాలికల వెనుకబాటు కనిపిస్తోంది. బాలికల్లో జ్ఞానం పెంచడం, తమను తాము రక్షించుకోవడంపై అవగాహన కల్పించడం, నైపుణ్యాలతో సాధికారిత దిశగా నడిపించడం, పలురకాల ప్రయోజనాలను అందించడంవంటి లక్ష్యాలతో కేంద్రప్రభుత్వం 2015 జనవరి 2న ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ పథకం ప్రారంభంలో తీసుకున్న జాతీయ సగటు 918 కంటే 12 జిల్లాల్లో (తెలంగాణ రాష్ర్టం) తక్కువగా జననరేటు ఉన్నట్లు జాతీయ ఆరోగ్య సమాచారం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు సగటు 952 ఉంటే, మన రాష్ర్టంలోని 26 జిల్లాల్లో అంతకన్నా తక్కువగా ఉంది. జాతీయ స్థాయిలో ఇదే పరిస్థితి నమోదు కావడంతో ఆడపిల్లల రక్షణ, సాధికారతతోపాటు జనన రేటు పెంచేందుకు బేటీ బచావో బేటీ పడావో పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఆడపిల్లల జననరేటు ఏటా 2 పాయింట్లు పెరగడం, ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడడం, రుతుక్రమ పరిశుభ్రత అవగాహన పెంచడం, బాల్య వివాహాలు నిరోధించడం తదితర లక్ష్యాలతో పథకానికి కొత్తరూపు తీసుకొచ్చారు. దీంతో బాలికల రక్షణ, చదువులో మంచి ఫలితాలు వస్తాయని ఆశిద్దాం.

కోడం పవన్‌కుమార్
9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News