దేశంలో బాగా పాతుకుపోయిన లింగ వివక్షను నిర్మూలించడానికి, బాలికల మనుగడ స్థిరంగా వృద్ధి చెందడానికి, వారికి తగిన భద్రత కల్పించడానికి, వారికి చదువులు కొనసాగించడానికి వీలుగా 2015లో కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పడావో పథకాన్ని అమలులోకి తెచ్చింది. వాస్తవానికి ఈ పథకం పరిధి తక్కువే అయినప్పటికీ, బహిష్ఠు ఆరోగ్యం తదితర సమస్యలను పరిష్కరించడం, క్రీడారంగంలో బాలికలకు భాగస్వామ్యం కల్పించడం తదితర ప్రయోజనాలతో విస్తరించింది. గత పదేళ్లుగా అమలవుతున్న ఈ పథకం ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ పథకానికి నిధుల కేటాయింపు తగినంతగా లేదని, కేటాయించిన నిధులు కూడా సరిగ్గా వినియోగం కావడం లేదని కాగ్ ఆక్షేపించింది.
అలాగే మహిళా సాధికారత కమిటీ (2021)కూడా ఈ పథకానికి కేటాయిస్తున్న నిధులు చాలా తక్కువగా ఉంటున్నాయని, 2016 2019 మధ్యకాలంలో ఈ పథకానికి రూ. 446.7 కోట్లను కేటాయించగా, అందులో 80 శాతం కేవలం మీడియా ప్రచారానికే వెచ్చించారని ఆక్షేపించింది. ఇటీవల ఈ పథకం అమలుపై 161 జిల్లాల్లో అధ్యయనం చేయగా ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయని బయటపడింది. పథకం మంచిదే కానీ ఫలితమే సరిగ్గా అందడం లేదు. గత పదేళ్లలో ఈ పథకం వల్ల వస్తున్న మార్పులు అంతంత మాత్రమే. తల్లిదండ్రుల మనస్తత్వాల్లో విప్లవాత్మకమైన మార్పులు రావలసి ఉంది. దేశంలో జననాల్లోనూ లింగ నిష్పత్తి అబ్బాయిలకు అనుకూలంగా, వక్రంగానే ఉంటోంది. అమ్మాయిల కన్నా అబ్బాయి పుడితేనే గొప్పగా భావించడం పరిపాటిగా వస్తోంది. కూతుళ్లు కన్నా కొడుకులకే అన్నిటిలోనూ ప్రాధాన్యత కల్పిస్తుంటారు. ఆదాయం, అక్షరాస్యత రేటు పెరిగినా, సంతాన రేటు పతనమవుతోంది. లింగ ఎంపిక విధానాల అనుసంధానం కుటుంబాలకు సులభం కావడంతో తక్కువ సంఖ్యలో బాలికలు జన్మిస్తున్నారు.
ఉదాహరణకు అత్యధిక ఆదాయం గల తమిళనాడు, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి జాతీయ సరాసరి కన్నా తక్కువగా ఉంటోంది. ఈ బేటీ బచావో, బేటీ పడావో పథకం లక్షం బాలికల అక్షరాస్యత, చదువుల కోసం పిలుపు ఇవ్వడమే కాకుండా వారికి సామాజిక సాధికారత కల్పించడానికి కృషి చేయడం కూడా. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ప్రకారం జననాల్లో లింగ నిష్పత్తి గత కొన్నేళ్లుగా అభివృద్ధి చెందింది. 2015లో ప్రతి వెయ్యి మంది బాలురకు దాదాపు 919 మంది బాలికలు ఉండగా, 202021లో ప్రతి వెయ్యి మంది బాలురకు 929 మంది బాలికలుగా అభివృద్ధి కనిపించింది. ఏటా బాలికలు ‘అదృశ్యం’ కావడం సరాసరిన 2010లో దాదాపు 4,80,000 వరకు ఉండగా, 2019లో 4,10,000 వరకు తగ్గింది. ఇక్కడ అదృశ్యం అంటే బాలికలు గల్లంతు కావడం అని భావించకూడదు. ఆ మేరకు ఆడపిల్ల పుట్టుకను వద్దనుకొనే సంఖ్యగా పరిగణించాలి. ఈ బేటీ బచావో పథకం ప్రారంభించిన తరువాత గర్భధారణల రిజిస్ట్రేషన్ వేగంగా చేయించుకోవడం, అంటే గర్భాల ప్రారంభ నమోదు, సంస్ధాగత ప్రసవాలు పెరిగాయి. శిక్షణ పొందిన, సమర్ధులైన ఆరోగ్య సిబ్బంది మొత్తం పర్యవేక్షణలో ఆ వైద్య సంస్థలో బిడ్డకు జన్మనివ్వడాన్ని సంస్ధాగత ప్రసవాలుగా పేర్కొంటారు.
గర్భం దాల్చిన తొలి మూడు నెలల్లో యాంటీ నేటల్ కేర్ నమోదు 10 శాతం పెరిగింది. ఆస్పత్రుల్లో కాన్పుల శాతం 87 నుంచి 94 శాతం పెరిగింది. దీనికి అనుబంధంగా ప్రారంభమైన సుకన్యా సమృద్ధి యోజన కూడా ప్రజల్లో వ్యాపించింది. ఇక విద్యారంగానికి సంబంధించి పాఠశాలల్లో బాలికల స్థూల నమోదు నిష్పత్తి (గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో) తగినంతగా పెంచాలని బేటీ బచావో బేటీ పడావో పథకం ముఖ్యలక్షాలలో ఒకటి. వారిని పాఠశాలల్లోనే ఉంచి చదువులు చెప్పించడం పైనే దృష్టి కేంద్రీకరిస్తారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ) వివరాల ప్రకారం సెకండరీ స్థాయిలో బాలికల స్థూల నమోదు నిష్పత్తి 80.97% నుంచి 79.4% వరకు స్వల్పంగా తగ్గినప్పటికీ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో 201516 లో బాలికల స్థూల నమోదు నిష్పత్తి 56.4 శాతం ఉండగా, 202122లో 58.2 శాతం వరకు పెరగడం విశేషం. తల్లిదండ్రులు ఈ పథకం ఆసరాగా స్కాలర్ షిప్పుల ద్వారా అవగాహన ప్రచార కార్యక్రమాల ద్వారా తమ ఆడపిల్లలను చదువుల్లో ప్రోత్సహించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆడపిల్లల చదువుల విషయంలో ఈ పథకం వాస్తవ ప్రభావం విస్తృత పరిధిలో అర్థం చేసుకోవలసి ఉంది.
పాఠశాలల్లో బాలికల నమోదు సంఖ్య పెరిగితే లింగ ఆధారిత డ్రాపౌట్ రేట్లు చెప్పుకోతగినంతగా తగ్గుదల ఉండదు. 202223, 202324 లో సన్నాహక, మధ్యస్థాయిల్లో బాలికల డ్రాపౌట్లు బాలుర కన్నా ఎక్కువగా ఉన్నా, సెకండరీ స్థాయికి వచ్చేసరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాఠశాలలకు బాలికలు మానేయడం ముఖ్యంగా బాల్యవివాహాలు, ఇంటి పనులు, శానిటేషన్ సౌకర్యాల లోపం, తదితర కారణాలతోపాటు ఇతర సమస్యలు కూడా తోడవుతున్నాయి. భారతీయులు చాలా మంది ఆడపిల్లల కన్నా మగపిల్లలకే ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పటికీ కొనసాగుతోంది. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ 5 సర్వే డేటా ప్రకారం 80 శాతం మంది తమ జీవితకాలంలో కనీసం ఒక కొడుకునైనా కనాలన్న కోరికను బయటపెట్టారు. ప్రపంచ లింగ వ్యత్యాస నివేదికలో భారత్ స్థానం చాలా దుర్బలంగా ఉంది. లింగ సమానత్వంలో ప్రస్తుత స్థితి భయంకర చిత్రాన్ని ఆవిష్కరించింది. ఈ విషయంలో దేశం చేయవలసింది ఎంతో ఉంది.