Sunday, January 19, 2025

నాలుగు జాతీయ రహదారుల నిర్మాణంతో బాసర, భద్రకాళి భక్తులకు మెరుగైన సౌకర్యం

- Advertisement -
- Advertisement -

రెండేళ్లలో నాలుగు ప్రాజెక్టుల పూర్తి
రూ.1,835 కోట్లను కేటాయించనున్న కేంద్రం

హైదరాబాద్: తెలంగాణలో రూ.1,835 కోట్లతో కేంద్రం 4 జాతీయ రహదారులను విస్తరించాలని నిర్ణయించింది. దీనివల్ల భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నాలుగు జాతీయ రహదారులు పూర్తయితే బాసర సరస్వతి, భద్రకాళి, జైనద్, కురవి ఆలయాలకు భక్తులు రాక పోకలు సాగించడానికి మరింత సౌకర్యంగా ఉంటుంది. ఈ 4 ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఆదిలాబాద్- టు బేల సెక్షన్‌లో 32.97 కిలోమీటర్ల రహదారిని రూ.490.92 కోట్లతో విస్తరించాలని కేంద్రం నిర్ణయించగా, దీనివల్ల ఆదిలాబాద్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రముఖ జైనద్ ఆలయానికి అనుసంధానం ఏర్పడనుంది. దీంతోపాటు ఎల్లారెడ్డి రుద్రూర్ సెక్షన్‌లో 37.28 కిలోమీటర్ల రహదారిని రూ.499.88 కోట్లతో 2 వరుసలుగా విస్తరించడం వల్ల మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలకు రోడ్డు సౌకర్యంతో బాసరకు అనుసంధానం ఏర్పడుతుందని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. 43.91 కిలోమీటర్ల మెదక్ టు ఎల్లారెడ్డి సెక్షన్‌ను రూ.399.01కోట్లతో 2 వరుసలుగా విస్తరించడం వల్ల మెదక్ జిల్లాలోని రక్షణశాఖ ఆధీనంలోని ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అనుసంధానం పెరుగుతుంది. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని ఖమ్మం-, కురవిసెక్షన్‌లో 37.43 కి.మీల రహదారిని రూ.445.76 కోట్లతో 2 వరుసలుగా విస్తరిస్తే ఖమ్మం జిల్లాలోని గ్రానైట్ పరిశ్రమల నుంచి ఆ ఉత్పత్తుల రవాణాకు దోహదం చేయనుంది.
సిద్ధేశ్వరం, సోమశిల మధ్య రూ.1,082.56 కోట్లతో వంతెన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ తీగల వంతెన 30 నెలల్లో పూర్తవుతుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. సిద్ధేశ్వరం, సోమశిల మధ్య రూ.1,082.56 కోట్లతో ఈ వంతెనను నిర్మించడం వల్ల పర్యాటకులు అధికంగా ఇక్కడకు రావడానికి వీలు కలుగుతుందని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఈ వంతెన పైనుంచి చూసినప్పుడు తెలంగాణలోని లలితాసోమేశ్వర ఆలయం, ఎపి వైపు ఉన్న సంగమేశ్వర ఆలయం కన్నులపండుగగా కనిపిస్తుందని భావించిన కేంద్రం, అందులో భాగంగా దీనిని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి నిధులను కేటాయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News